రాంగోపాల్ వర్మ అమాయకుడు! అందుకే ఆ సినిమా తీశాడు!!
on Nov 30, 2019
రాజ్యాంగం అందరికీ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చిందనీ, దాని ప్రకారమే రాజకీయ నాయకులు రోజూ ఎవరినో ఒకర్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటారనీ, భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే పొలిటికల్ సెటైరికల్‌గా 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' తీశానని రాంగోపాల్ వర్మ చెబుతున్నారు. బాగానే ఉంది కానీ, రెండు కులాలను ఉద్దేశించి టైటిల్ పెట్టడం, అందునా ఒక కులాన్ని తక్కువచేసి, ఇంకో కులాన్ని ఎక్కువచేసి చెబుతున్నట్లుగా టైటిల్‌లో అర్థం రావడంతో సహజంగానే ఒక కులంవారు ఆ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ టైటిల్ వల్ల ఆ అర్థం వస్తుందనే విషయం తనకసలు తెలీదన్నట్లుగా వర్మ అమాయకత్వాన్ని ప్రకటించారు. ఆ విషయంలో తనది అమాయకత్వమని ఎవరైనా నమ్ముతారని వర్మ అనుకున్నారా? అందుకే ఆ టైటిల్ పెట్టారా?.. అంటే కాదనే ఎవరైనా అంటారు. తనకు రెగ్యులర్ ఫార్ములా సినిమా తియ్యడం చేతకాదని మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా వర్మ చెప్పారు. నిజమే. 'ఆయనకు తెలిసిందల్లా.. ప్రతి సినిమాతో కాంట్రవర్సీ సృష్టించడం, దానితో ఆ సినిమాకి రూపాయి ఖర్చు లేకుండా కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిసిటీ పొందడం'.. అని ఫిలింనగర్‌లో ఎవర్నడిగినా చెబుతారు. అలా ఉచిత పబ్లిసిటీతో డబ్బులు సంపాదించడమెలాగో ఆయన నుంచే ఎవరైనా నేర్చుకోవాలి.
అదే తరహాలో 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' టైటిల్‌తో సినిమా తీశారు. అది తీస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఆ టైటిల్‌పై గగ్గోలు లేచినా ఆయన పట్టించుకోలేదు. దానిపై తన ట్విట్టర్ పేజీలో ఎన్నో ట్వీట్లు చేశారు. ఎన్నో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. "నేనెప్పుడూ ఒకర్ని ప్రేమించడానిక్కానీ, ద్వేషించడానిక్కానీ టైం వేస్ట్ చెయ్యను. పొలిటికల్ సెటైర్ తియ్యడానికి నేను చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఒకరికి ఫేవర్ చెయ్యడం, ఇంకొకరికి ఎగనెస్ట్‌గా తియ్యడం నా ఉద్దేశం కాదు" అని ఇప్పుడు 'రాముడు మంచి బాలుడు' తరహాలో అమాయకత్వం ప్రకటిస్తున్నారు వర్మ. ఈ అమాయకత్వం ఎందుకంటే, సెన్సార్ బోర్డు ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడం. దాంతో నవంబర్ 29న సినిమాని విడుదల చెయ్యడానికి ఆయన చేసుకున్న ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. దీంతో ఒక మెట్టు దిగారు వర్మ. టైటిల్‌ను 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అని మారుస్తున్నట్లు తెలిపారు.
ఒక వ్యక్తిని ఒక సినిమాతో డిగ్రేడ్ చేసినట్లు ఎలా మనం గుర్తిస్తాం? ఆ వ్యక్తిని పోలిన పాత్రను సృష్టించి, అతన్ని హాస్యాస్పదంగా చూపిస్తే, అతడిని తక్కువచెయ్యడానికే ఆ పాత్రను సృష్టించారని మనకు అర్థమవుతుంది. బయోపిక్‌లు, లేదా యథార్థ ఘటనల ఆధారంగా సినిమాలు తీసినప్పుడు చరిత్రలో రికార్డయిన దాని ప్రకారం, కొంత కల్పన జోడిస్తారు. ఆ సందర్భాల్లో కొంతమంది హీరోలవుతారు, కొంతమంది విలన్లవుతారు. ఆ తరహాలోనే తాను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని లక్షీపార్వతి దృష్టి నుంచి తీశానని వర్మ చెబుతారు. ఆ తరహాలోనే ఇప్పుడు 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా తీశానని ఆయన అంటారు. యథార్థ ఘటనలను చిత్రీకరించడం వేరు, వ్యక్తుల్ని పరిహసించే విధంగా ఆ పాత్రల్ని చిత్రించడం వేరు. వర్మ సృష్టించిన పాత్రలు ఈ రెండో రకానికి చెందుతాయని ఎవరికైనా అనిపిస్తాయి. ఆ విషయం ఆయనకూ తెలుసు. ఎవరి నుంచి ఎన్ని అభ్యంతరాలొచ్చినా, తనకు తోచింది తియ్యడం ఆయన సహజ గుణం కాబట్టి, కాంట్రవర్సీతో ప్రచారాన్నీ, తద్వారా డబ్బునూ సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఆయన ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు, ఆయన మాటలు, చేష్టలు సరదాగా ఉంటున్నాయి కాబట్టి జనం కూడా వాటిని ఆస్వాదిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇంతకీ 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా ఎప్పుడు వెలుగు చూస్తుందో మరి!
Also Read