కార్తికేయ ఒక థండర్ స్టార్మ్: అనూప్ రూబెన్స్
on Nov 30, 2019
"కార్తికేయ ఒక థండర్ స్టార్మ్ లాంటివాడు. ఎనర్జీ బ్యాంక్. నేను చూసిన మోస్ట్ ఎనర్జిటిక్ పర్సన్స్‌లో ఒకడు. బిందాస్‌గా ఉంటాడు. హీరోననే భేషజం తనలో అస్సలు కనిపించదు. భవిష్యత్తులో చాలా పెద్ద స్టార్ అవుతాడు" అని చెప్పారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. కార్తికేయ హీరోగా నటించిన '90ఎంఎల్' సినిమాకు ఆయన సంగీతం సమకూర్చారు. శేఖర్‌రెడ్డి యెర్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆయనతో చేసిన ఇంటర్వ్యూ విశేషాలు...
'90ఎంఎల్'కు ఎన్ని పాటలిచ్చారు? సినిమా గురించి ఏం చెబుతారు?
నాకు ఆల్కహాల్ అలవాటు లేదు. కానీ మా డైరెక్టర్ శేఖర్‌రెడ్డి యెర్ర చెప్పిన కథ '90ఎంఎల్' తీసుకున్నంత కిక్ ఇచ్చింది. ఈ మూవీలో 6 సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. కంప్లీట్ మాస్ మ్యూజికల్. '90ఎంఎల్' అనేది ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్. ఈ మూవీలో కార్తికేయను వేరే లెవల్లో చూస్తారు. ఇందులో అతను నాకు కొత్తగా కనిపించాడు. అతనిలో మంచి హ్యూమర్ ఉంది. ఇప్పటిదాకా ఆ యాంగిల్ సినిమాల్లో రాలేదు. ఈ సినిమాలో ఆ యాంగిల్లో మనకు కనిపిస్తాడు. తను చాలా బాగా చేశాడు. కార్తికేయ అలా డాన్స్ చేస్తాడని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అలా చేశాడు. ఇది అతని ఫ్యాన్స్‌కూ, ఆడియెన్స్‌కూ ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్. అలాగే అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా.
మూవీలో మీకు నచ్చినదేమిటి?
డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. నెక్స్ట్ సీన్ ఏమిటనేది నా అంచనాలకు అందకుండా చెప్పాడు. ఒక కొత్త అప్రోచ్, ఒక కొత్త లైన్ అనిపించింది. నాకేం చెప్పాడో అది తీశాడు. శేఖర్‌రెడ్డి ప్రోపర్ కమర్షియల్ డైరెక్టర్. కమర్షియల్ మీటర్‌లో '90ఎంఎల్'ను చాలా బాగా తీశాడు. ఆరోగ్యపరంగా తనకు ఉండే ఒక సమస్యను హీరో ఎమోషన్స్‌తో ఎలా డీల్ చేశాడన్నదే స్టోరీ లైన్. మ్యూజిక్‌కు మంచి స్కోప్ ఉన్న కథ. రీరికార్డింగ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది.
ఇవాళ సినిమాల్లో మూడు నాలుగు పాటల కంటే ఎక్కువ ఉండట్లేదు.. 6 పాటలంటే ఎక్కువే. అన్ని అవసరమా?
పాటలన్నీ కథలో భాగంగానే వస్తాయి. తనకు 6 పాటలు కావాలని చెప్పి చేయించుకున్నాడు డైరెక్టర్. ఆ పాటలకు తగ్గ చక్కని సందర్భాల్ని కల్పించాడు. అయితే అవన్నీ లెంగ్తీ సాంగ్స్ కావు. అన్నీ మూడు నుంచి మూడున్నర నిమిషాల సేపు ఉండే పాటలే. ఇదివరకు నేను రెండు మూడు మాస్ సినిమాలు చేశాను కానీ, ఈ తరహా సినిమా మాత్రం నాకు కొత్త.
సాధారణంగా ఒక పాటకు ట్యూన్స్ కట్టేటప్పుడు ఏయే విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటారు?
ఒక స్టార్ సినిమాకి మ్యూజిక్ చెయ్యాలనుకున్నప్పుడు అతనికి ఎలా చెయ్యాలనేది మైండ్‌లోకి వచ్చేస్తుంది. ఆ స్టార్ ఇమేజ్, అతని బాడీ లాంగ్వేజ్, అతని డాన్సింగ్ స్కిల్స్ వంటివాటిని దృష్టిలో పెట్టుకొని బీజియమ్స్‌లో ప్లాన్ చేస్తాం. డాన్స్ ఇరగదీసే స్టార్ అయితే ట్యూన్స్‌కు బౌండరీస్ ఉండవు. '90ఎంఎల్' టైటిల్ సాంగ్‌లో మూడో బీజియం పూర్తిగా బీట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. దాన్ని కార్తికేయ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ట్యూన్ కంపోజింగ్‌లో ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటాం.
మీ కెరీర్ ఎలా సాగుతోంది?
నా కెరీర్ బాగానే నడుస్తోంది. పెద్ద సినిమాలు చేసినా, హిట్లు వచ్చినా, ఇటీవల గ్యాప్ వచ్చిందేమిటని అడుగుతున్నారు. కాకపోతే ఇటీవల కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అనుకున్నవి ఆగిపోయాయి. అందుకే కాస్త గ్యాప్ వచ్చింది. ఏమైనా ఏ టైంలో ఏది జరగాలో అది జరుగుతుంది.
ఇవాళ సంగీతానికి ఎలాంటి ప్రాధాన్యం ఉందనుకుంటున్నారు?
ఎవరైనా మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, ఆ మ్యూజిక్‌కు మంచి పేరొచ్చిందంటే.. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతుంటాను. దాని కంటే బాగా చెయ్యాలని ప్రయత్నిస్తుంటాను. ఇదొక స్పోర్టివ్ కాంపిటిషన్. ఇవాళ మ్యూజిక్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. జనాల్లోనూ మ్యూజిక్ టేస్ట్ పెరుగుతోంది. వాళ్లను సినిమాలకు రప్పించే సాధనంగా మ్యూజిక్ మారుతోంది. మ్యూజిక్‌ను చూసి సినిమాకు వస్తున్నారు. ఇదొక గ్రేట్ అండ్ పాజిటివ్ థింగ్. స్టార్స్ లేని సినిమాలు కూడా మ్యూజిక్ బాగా ఉంటే, ఓపెనింగ్స్ బాగా వస్తున్న సందర్భాలుంటున్నాయి.
పాట క్వాలిటీగా రావాలంటే?
పిందికొద్దీ రొట్టె అనే సామెత మ్యూజిక్‌కు కూడా వర్తిస్తుంది. తెరపై బాగా ఖర్చుపెట్టే పాటలో లావిష్‌నెస్ కనిపిస్తుంది. అదే తరహాలో మ్యూజిక్ కంపోజిషన్‌లోనూ బడ్జెట్ కీలక పాత్ర వహిస్తుంది. ఆర్కెస్ట్రైజేషన్ కానీ, మిక్సింగ్ కానీ బాగా ఖర్చు పెట్టగలిగినప్పుడు మరింత క్వాలిటీగా వస్తాయి. మనం వినే ఒక పాటలో చాలా అంశాలు ఇమిడివుంటాయి. ఒకే పాట సింఫనీ ఉపయోగిస్తే ఒక రకంగా, అది లేకపోతే ఇంకో రకంగా వినిపిస్తుంది.
చిన్న సినిమాలకూ ప్రాముఖ్యం ఇస్తుంటారా?
నాకు స్టోరీ నచ్చితే, చిన్న బడ్జెట్ అయినా చెయ్యాలనుకుంటాను. కొన్నిసార్లు నా సొంత డబ్బు ఖర్చుపెట్టి మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. శాటిస్‌ఫై అవడం నాకు ఇంపార్టెంట్. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా నాకు తేడా ఉండదు.
స్వతహాగా మీకు ఏ తరహా బాణీలంటే ఇష్టం?
బేసిగ్గా నాకు పెప్పీ మెలోడీస్ ఇష్టం. అలాగే డాన్స్ నంబర్స్ అన్నా ఇష్టమే. 'ఇష్క్', 'టెంపర్', 'పైసా వసూల్', 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' వంటి సినిమాల్లో మాస్ నంబర్స్ ఇచ్చాను. వాటికి మంచి పేరొచ్చింది. నా మ్యూజికల్ హిట్స్ ఎక్కువగా మెలోడీస్ కావడం వల్ల నాకు ఆ తరహా సినిమాలే ఎక్కువగా వస్తున్నాయనుకుంటాను.
భవిష్యత్తులో పాటలు లేకుండానే సినిమాలు వస్తాయనుకుంటున్నారా?
పాటలనేవి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మన బ్లడ్‌లోనే మ్యూజిక్‌ను ఇష్టపడటమనేది ఉంది. భారతీయ సినిమాలో పాట లేకపోతే సంపూర్ణ భోజనం చేసిన ఫీలింగ్ కలగదని షారుఖ్ ఖాన్ అన్న మాటలు నిజం. పాటలు లేకుండా 'ఖైదీ' (కార్తీ) లాంటివి ఒకట్రెండు సినిమాలు వచ్చి ఆడవచ్చు. కానీ పాటలనేవి ఎప్పటికీ ఉంటాయి. పాటల్లేని సినిమాలోనూ బ్యాగ్రౌండ్ స్కోర్ రూపంలో సంగీతం ఉంటుంది. అందులో సాహిత్యం వినిపించదంతే. పాటలకు ఎలా ట్యూన్స్ కడుతుంటామో, సన్నివేశాలకు కట్టే ట్యూన్స్ కూడా అంతే.
కాపీ మ్యూజిక్‌పై మీ అభిప్రాయం?
ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌కు ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే నాదొక స్టైల్. నేనొక వంద ట్యూన్స్ కంపోజ్ చేస్తే, వాటిలో ఐదారు ట్యూన్స్ ఒకేలా అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఎవరో కొట్టిన ట్యూన్‌ను మక్కీకి మక్కీ దించితే.. కాపీ అంటాం. నేనెప్పుడూ అలా చెయ్యను. అలా చెయ్యడాన్ని నేను వ్యతిరేకిస్తాను. అలా కాకుండా దాని ప్రేరణతో ట్యూన్ కడితే, అందులో తప్పు లేదు.
ప్రస్తుతం ఏమేం సినిమాలు చేస్తున్నారు?
కన్నడంలో ఇటీవలే 'గీత' అని ఫిల్మ్ చేశాను. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నా. తెలుగులో కొండా విజయ్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్న 'ఒరేయ్ బుజ్జిగా', ఇంకో రెండు సినిమాలకు పనిచేస్తున్నా.
- బుద్ధి యజ్ఞమూర్తి
Also Read