'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మూవీ రివ్యూ
on Dec 12, 2019
సినిమా పేరు: అమ్మరాజ్యంలో కడపబిడ్డలు
తారాగణం: అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మానందం, అలీ, నిధి కుశలప్ప, ధీరజ్ కె.వి., అరవింద్ రావ్, ధన్‌రాజ్, రాం చైతన్య, జబర్దస్త్ రాము, స్వప్న, కత్తి మహేశ్, శ్రీ సాయిదుర్గ
సంగీతం: రవిశంకర్
సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: అజయ్ మైసూర్
దర్శకత్వం: సిద్ధార్థ తాతోలు
బ్యానర్స్: టైగర్ కంపెనీ ప్రొడుక్షన్స్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 12 డిసెంబర్ 2019
మొదట 'కమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనే పేరుతో సినిమా తీసి, సెన్సార్ అభ్యంతరాలతో రాజీపడి, 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా టైటిల్‌ను మార్చిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాని సిద్ధార్థ తాతోలు అనే తన శిష్యుడితో కలిసి ఈ సినిమాని డైరెక్ట్ చేశానని ప్రెస్‌మీట్లలో, ఇంటర్వ్యూల్లో నొక్కి వక్కాణించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో, ఎన్నికల ముందు, తర్వాత పరిణామాలపై, రానున్న రోజుల్లో ఏం జరగనున్నదో ఊహిస్తూ ఈ సినిమా తీశామని కూడా ఆయన ప్రకటించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతోటే ఆయన నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేసుకున్నారనే విషయం మనందరికీ తెలిసింది. ఈ సినిమాతో దాని తీవ్రత పెరిగిందనే అభిప్రాయం ట్రైలర్‌తోనూ, పాటలతోనూ, ఆర్జీవీ ట్వీట్లతోనూ మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి జనంలో కలగడం సహజం. సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకొని, ఎట్టకేలకు రివైజింగ్ కమిటీ ఇచ్చిన క్లియరెన్సుతో ఇప్పుడు సినిమా మన ముందుకు వచ్చింది. అయితే టైటిల్స్‌లో డైరెక్టర్‌గా తన పేరును ఆర్జీవీ వేసుకోకపోవడం గమనార్హం. కేవలం సిద్ధార్థ తాతోలుకే ఆ క్రెడిట్ ఇచ్చారు.
కథ:
ఎన్నికల్లో అధికార వెలుగుదేశం పార్టీ (వీడీపీ) ఓడిపోయి, అంతదాకా ప్రతిపక్షంలో ఉన్న ఆర్‌సీపీ 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంది. కేవలం 23 సీట్లను మాత్రమే తమ పార్టీ గెలుచుకోవడం, అనూహ్యంగా ఆర్సీపీ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేకపోయిన వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన తనయుడు ఆకాశ్ అలియాస్ చినబాబు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎలాంటి ఎత్తులు వేశారు, వాటిని ఆర్సీపీ అధినేత వీఎస్ జగన్నాథరెడ్డి ఎదుర్కోగలిగాడా, లేదా? బెజవాడకు చెందిన వీడీపీ ముఖ్యనేత 'దయలేని రమ' నగరం నడిబొడ్డున హత్యకు గురైతే, దాన్ని సాకుగా చేసుకొని కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించి మధ్యంతర ఎన్నికలను తీసుకొస్తే, ఆ ఎన్నికల్లో ఆర్సీపీ మరింత ఘనవిజయం సాధించి, వీడీపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోవడం క్లైమాక్స్. ఈ రెండు పార్టీల మధ్యలో 'మనసేన' అనే పార్టీ, దాని నాయకుడు మనసేనాని, వరల్డ్ పీస్ పార్టీ నాయకుడు పీపీ చాల్ చేసే హంగామాలూ ఈ ఆత్మలేని కథలో భాగం.
విశ్లేషణ:
ఇది స్పూఫింగ్ సినిమా. అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్లు రియల్ లైఫ్‌లోని పలు పొలిటికల్ లీడర్లను పోలి కనిపిస్తుంటాయి. సినిమా మొదట్లో వేసిన డిస్‌క్లైమర్‌లో 'ఇందులో పాత్రలు, సన్నివేశాలు, ప్రదేశాలు ఎవర్నీ ఉద్దేశించినవి కావు, అంతా తూచ్' అని చెప్పుకున్నారు. అయినప్పటికీ అనేక పాత్రలు మనకు అవి ఎవర్ని ఉద్దేశిస్తున్నాయో స్పష్టం చేస్తుంటాయి. సిద్ధార్థ తాతోలు ఈ మూవీని సీరియస్ సినిమాగా తియ్యాలనుకున్నాడు కానీ, చివరకు స్పూఫింగ్ సినిమాగా తయారుచేశాడు. ఈ సినిమాలో ఒక కథంటూ ఏమీ ఉండదు. ఒక పార్టీని పూర్తిగా డీగ్రేడ్ చేసే విధంగా, మరో పార్టీని అందలం ఎక్కించే విధంగా, ఒక పార్టీ నాయకుల్ని విలన్లుగా, ఇంకో పార్టీ నాయకుడిని హీరోగా చూపించే సీన్లు రాసుకొని, వాటిని ఒకదారానికి గుచ్చి సినిమాగా తీసి జనం మీదకు వదిలారంతే. దాంతో సహజంగానే ఒక పార్టీ వాళ్లకు ఈ సినిమా చేదుగా, ఇంకో పార్టీ వాళ్లకు తియ్యగా ఈ సినిమా కనిపిస్తుంది. డైరెక్టర్ తన ఇమాజినేషన్‌తో విజయవాడకు చెందిన ఒక పేరుపొందిన నాయకుడిని పోలిన 'దయలేని రమ' అనే క్యారెక్టర్‌ను సృష్టించి, ఆ క్యారెక్టర్‌ను హత్య చేయించడం గమనార్హం. అది ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా. అంటే భవిష్యత్తులో ఆ నాయకుడు హత్యకు గురవుతాడని జోస్యం చెబుతున్నారన్న మాట. పైగా దయలేని రమ తమ పార్టీవాడిని తామే హత్య చేసి, ఆ హత్యను ముఖ్యమంత్రి పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తే, అది వికటించి, అతడే హత్యకు గురవుతాడు. క్లైమాక్స్‌లో మధ్యంతర ఎన్నికల్లో ఆర్సీపీ పార్టీ మొత్తం 175 సీట్లలో 174 సీట్లు గెలుచుకుందనీ, దీనికి కారణం దయలేని రమ హత్యను జగన్నాథరెడ్డి చేయించలేదని జనం నమ్మారు కాబట్టే ఏకపక్షంగా గెలిపించారనీ స్వయంగా తెరపైకి వచ్చి రాంగోపాల్ వర్మ చెప్పారు. వీడీపీ తరపున బాబు ఒక్కరే గెలిచారంటే, ఏమూలో ఆ హత్యను ఆయన చేయించలేదని జనం అనుకోబట్టేనని కూడా వాక్రుచ్చారు. సినిమా మొత్తమ్మీద పది పేజీల డైలాగ్స్ కూడా ఉండవు. ప్రధానంగా హావభావాలు, రీరికార్డింగ్‌తో సినిమాని నడిపారు.
ఏతావాతా వీడీపీ చినబాబు ఏడుపులు, పప్పన్నం తినడాలు, బాబు క్రూర చూపులు, అసెంబ్లీలో జగన్నాథరెడ్డి వెటకారపు నవ్వులు, ఆ పార్టీకే చెందిన పూజ అనే ఎమ్మెల్యే కేకలు, స్పీకర్ నిద్రలు, వివిధ రకాల హావభావాలు, మనసేనాని, పీపీ చాల్ మేనరిజాలు, వాళ్ల డైలాగులు కొంత హాస్యాన్ని పుట్టించాయి. ఓపిగ్గా సగం సినిమా చూడగలిగినవాళ్లు, రెండో సగాన్ని చూడాలంటే చాలా సహనవంతులై ఉండాలి. అంత సహనం ఉన్నవాళ్లకే ఈ సినిమా మొత్తం చూసే భాగ్యం దక్కుతుంది. ఏ డిపార్టుమెంటూ మనసుపెట్టి పనిచేసినట్లు కనిపించలేదు. ప్రొడక్షన్ విలువలు నాసిరకంగా ఉన్నాయి. స్పూఫింగ్ సినిమా కావడంతో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఇతర టెక్నీషియన్లు కూడా ఏదో సరదాగా పనిచేసి, సినిమా పేరిట జనం మీదికి వదిలారు. వరస్ట్ అవార్డులు ఇచ్చేపనైతే ఈ సినిమాకి చాలా వస్తాయి.
ప్లస్ పాయింట్స్:
హాస్యాన్ని పంచిన పీపీ చాల్ పాత్ర
మైనస్ పాయింట్లు
సరైన కథ లేకపోవడం
ముళ్లమీద కూర్చోపెట్టే స్క్రీన్‌ప్లే
చెవులు వాయగొట్టే రీరికార్డింగ్
ఒకే తరహా ఎక్స్‌ప్రెషన్స్‌తో భయపెట్టే నటులు
కడుపులో దేవినట్లుండే డైరెక్షన్
తారల అభినయం:
వీఎస్ జగన్నాథరెడ్డిగా 'రంగం' ఫేం అజ్మల్ అమీర్, బాబుగా ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే ప్రధాన పాత్రలు పోషించారు. అజ్మల్‌కు వాయిస్ సూట్ కాలేదు. అతను నోరు ఆడిస్తుంటే, ఇంకెవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ధనుంజయ్ యాక్టర్ కాదు కాబట్టి ఉత్సవ విగ్రహం తరహాలో ఎప్పుడూ ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుంటాడు. బ్రహ్మానందం (బాబు కారు డ్రైవర్) ఏడెనిమిది సీన్లలో కనిపించి చివరలో ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పారు. అలీ (స్పీకర్), ధీరజ్ కేవీ (చినబాబు అలియాస్ ఆకాశ్), నిధి కుశలప్ప (బాబు కోడలు రమణి), శ్రీసాయిదుర్గ (ఆర్సీపీ ఎమ్మెల్యే పూజ), శ్రీకాంత్ అయ్యంగార్ (దయలేని రమ), అరవింద్ రావ్ (మనసేనాని), జబర్దస్త్ రాము (పీపీ చాల్), ధన్‌రాజ్ (గంగవీటి భవాని), సిట్ ఆఫీసర్ (స్వప్న), సీబీఐ ఆఫీసర్ (కత్తి మహేశ్) సినిమాలో పాత్రధారులుగా భాగమయ్యారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
సినిమా చూద్దామని కాకుండా కొన్ని నిజ జీవిత రాజకీయ పాత్రల స్పూఫ్‌లను తెరపై చూడాలనుకొనే వాళ్లు, అత్యంత సహనవంతులు ఈ సినిమాకు వెళ్లవచ్చు.
రేటింగ్: 0.5/5
- బుద్ధి యజ్ఞమూర్తి