వర్మకి షాక్.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు' విడుదల వాయిదా
on Nov 28, 2019
వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద సినిమాలతో అందరికీ షాకులిచ్చే రామ్ గోపాల్ వర్మకి షాక్ తగిలింది. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా రేపు అనగా నవంబర్ 29 న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ సినిమా టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చు రగిల్చేలా ఉందని, సినిమా టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. దీంతో వర్మ ఈ సినిమా టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని సెన్సార్ బోర్డు కు తెలిపారు.
అయినా సెన్సార్ బోర్డు.. సినిమాకు సెన్సార్ చేయకుండా, సెర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపడంతో.. నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, సినిమా రేపు రిలీజ్ చేయాల్సి ఉందని చెప్పడంతో.. హైకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. వారంలోగా సినిమా చూడాలని సెన్సార్బోర్డును ఆదేశించింది. అలాగే ఈ సినిమాపై వచ్చిన అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో రేపు రిలీజ్ కావాల్సిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ సెన్సార్ బోర్డు పై ఆధారపడి ఉంది.