ఒకర్ని ప్రేమించడానికీ, ద్వేషించడానికీ నేను టైం వేస్ట్ చెయ్యను: ఆర్జీవీ
on Nov 29, 2019
రాంగోపాల్ వర్మ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా వచ్చే అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. కారణం.. ఆ టైటిల్‌కు సెన్సార్ బోర్డు అనుమంతించకపోవడం. దాంతో ఆ సినిమా టైటిల్ మార్చేశాడు వర్మ. 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా దాని టైటిల్ ఖరారు చేశాడు. ఒక వారంలోగా ఆ సినిమా చూసి, అభ్యంతరాలేవైనా ఉంటే తమ ముందుకు తీసుకు రావాలనీ, నిబంధనల మేరకు దానికి సెన్సార్ పనులు పూర్తిచేసి, సర్టిఫికెట్ ఇవ్వాలనీ తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించడం తెలిసిందే. దీంతో బంతి సెన్సార్ బోర్డు చేతుల్లోకి వెళ్లింది. వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చెయ్యకుండా, కేవలం కట్స్ చెప్పి సర్టిఫికెట్ ఇస్తారా, లేక అభ్యంతరాలను కోర్టుకు సమర్పిస్తారా.. అనే దానిపై 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా విడుదల ఆధారపడి ఉంది. కాగా శుక్రవారం మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆర్జీవీ.. పొలిటీషియన్స్‌ను చూసి తాను నేర్చుకున్న దాని ప్రకారం ఈ సినిమా తీశానని తెలిపారు. ఒకరికి ఫేవర్‌గా, ఇంకొకరికి వ్యతిరేకంగా ఈ సినిమా తియ్యలేదని నమ్మబలికారు. ఆయన మాటల్లోనే ఆ వింత సంగతులు...
"బేసిగ్గా ఒకరి మనోభావాలు దెబ్బతిన్నప్పుడే మనకు వాక్ స్వాతంత్ర్యం అవసరం. లేకపోతే వాక్ స్వాతంత్ర్యం అవసరం ఏముంది? పొద్దున లేచిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరు ఎవరో ఒకర్ని ఏదో ఒకటి అనకుండా ఉండరు. మన నోరు విప్పితే ఎవరో ఒకళ్లని అంటాం. మనం బతికేదే దాని కోసం. దానికి రూల్స్ పెట్టి 'ఇంతే అనాలి, ఇంత అనకూడదు' అని చెప్పడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. నేనెప్పుడూ ఒకర్ని ప్రేమించడానిక్కానీ, ద్వేషించడానిక్కానీ టైం వేస్ట్ చెయ్యను. పొలిటికల్ సెటైర్ తియ్యడానికి నేను చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఒకరికి ఫేవర్ చెయ్యడం, ఇంకొకరికి ఎగనెస్ట్‌గా తియ్యడం నా ఉద్దేశం కాదు. కొంతమందిని వాళ్ల పర్సనాలిటీని బట్టి సెటైరికల్‌గా చెయ్యలేం. కొంతమందిని చెయ్యగలం. ట్రైలర్ రిలీజైనప్పుడు అందరూ ఇదొక ఫన్ ఫిల్మ్ అనీ, సెటైరికల్ వేలో ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నట్లు ఉంది అనీ ఫిక్సయ్యారు. రిలీజ్ చేసిన పాటల్లోనూ అదే మెసేజ్ ఉంది. దేన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనేది ఈ సినిమాతో నేనిస్తున్న మెసేజ్. సినిమాలో 'మనసేన' అధ్యక్షుడికి పేరు లేదు. ఎందుకంటే అతన్ని పేరుపెట్టి పిలవాల్సిన అవసరం స్క్రీన్‌ప్లేలో రాలేదు. పొలిటీషియన్స్ ఒకర్నొకరు తిట్టుకోకుండా ఉంటారా? ఉంటానికి చాన్స్ ఉందా? ఎప్పుడూ ఒకర్నొకరు క్షోభ పెట్టడానికే చూస్తుంటారు. వాళ్ల నుంచి నేర్చుకొని ఈ సినిమా తీశాను. నా గురువులు వాళ్లు. సోషల్ మీడియాపై త్వరలో సినిమా తీస్తాను."