రాంగోపాల్ వర్మ 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' టీజర్ రివ్యూ
on Nov 27, 2019
రాంగోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' టీజర్ వచ్చేసింది. చూడగానే షాకింగ్ అనిపించేలా ఉంది. దీన్ని ఆయన భారతదేశపు మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ ఫిలింగా అభివర్ణిస్తున్నాడు. దానిలో నిజానిజాల జోలికి పోకుండా, 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' టీజర్‌ను చూస్తే, నిజంగానే ఒక ఇండియన్ మూవీలో ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్‌ను ఈ రీతిలో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పూజా భాలేకర్ అనే యువతి టైటిల్ రోల్‌లో చెలరేగిన విధానం అపూర్వంగా అనిపిస్తే, ఆమె కనిపించిన తీరు మాత్రం 'వ్వావ్' అనిపించేలా ఉంది. ఒకవైపు మార్షల్ ఆర్ట్స్‌తో రౌడీలను చితగ్గొడుతూ, మరోవైపు అందాల ప్రదర్శన చేస్తూ అటు యాక్షన్ ప్రియుల్నీ, ఇటు రొమాంటిక్ మూవీ లవర్స్‌నీ.. ఏక కాలంలో ఆకట్టుకుంది పూజ.
బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ ఆయనకు నివాళిగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. పైగా ఒక చైనీస్ మూవీ కంపెనీ కొలాబరేషన్‌తో ఈ మూవీని ఆయన తీస్తుండటం గమనార్హం. 'హి డైడ్.. హిజ్ ఇన్‌ఫ్లుయెన్స్ డిడ్ నాట్' అంటూ బ్రూస్‌లీ స్ఫూర్తి ఏ రకంగా ఉందో ఈ సినిమాలోని హీరోయిన్ కేరెక్టర్‌తో వర్మ చూపించినట్లు అర్థమవుతోంది. నవంబర్ 27 బ్రూస్ లీ జయంతి. పైగా ఇది 80వ జయంతి కావడం గమనార్హం. ఆ సందర్భగానే ఈ టీజర్‌ను ఆయన రిలీజ్ చేశాడు. 'ది ఓన్లీ ఒన్ హూ కెన్ స్టాప్ యు ఈజ్ యు' (నిన్ను ఆపగలిగలిగే ఒకే ఒక్క వ్యక్తి నువ్వే) అనే బ్రూస్‌లీ కొటేషన్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. ఆ వెంటనే రెడ్ డ్రస్‌లో ఉన్న పూజ వేగంగా పరిగెత్తుతూ కనిపిస్తుంది. ఆమె వెనకే ఒక హార్స్ పరిగెత్తుతున్నట్లు చూపించారు. అంటే ఆమెది 'హార్స్ స్పీడ్' అని డైరెక్టర్ చెబుతున్నాడు.
పూజ కదలికలు, ఆమె విన్యాసాలు, ఆమె చేసే పోరాటాలు చూస్తుంటే.. ఆ పాత్ర పోషణకు ఆమె చాలా కష్టపడిందనీ, మార్షల్ ఆర్ట్స్‌లో కఠినమైన శిక్షణ తీసుకుందనీ గ్రహించవచ్చు. "నువ్వేం అనుకుంటావో, అదే అవుతావు" అనే బ్రూస్ లీ మరో కొటేషన్‌ని కూడా చూపించారు. దాన్ని బట్టి హీరోయిన్ ఏం కావాలనుకున్నదో డైరెక్టర్ చెబుతున్నట్లే. ఆమె మార్షల్ ఆర్టిస్ట్‌గా ఎందుకు కావాలనుకుంది, దాని వెనుక ఉన్న కథేమిటి? అనేది ఆసక్తికరం. హీరోయిన్‌కు ఒక బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు. గురువు "అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావా?" అనడిగితే, "అవును మాస్టర్" అని జవాబిచ్చింది పూజ. ఒక రెస్టారెంటుకు వచ్చిన ఆ జంటను ఆకతాయిలు అల్లరి పెట్టబోయారు. ఒక్కొక్కడినీ తన ఫైట్ స్కిల్స్‌తో చుక్కలు చూపించింది పూజ. అది చూసి ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా బిత్తరపోయాడు. బహుశా అప్పటి దాకా ఆమె మార్షల్ ఆర్టిస్ట్ అనే విషయం అతడికి తెలీకపోవచ్చు. పూజ ఫైట్లు చేసిన తీరు చూస్తుంటే, చాలామంది హీరోలు కూడా ఆ వేగంతో ఫైట్లు చెయ్యలేరనిపిస్తుంది. ఆఖరుకి కురచ దుస్తుల్లోనే కాదు, చీరకట్టుకొని కూడా ఆమె మార్షల్ ఆర్ట్స్‌తో రౌడీలను చితగ్గొట్టిన తీరు అమోఘం.
ఇక వర్షంలో ఆమె చేసే వొంపుసొంపుల విన్యాసాలు, బాయ్‌ఫ్రెండ్‌తో శృంగార సన్నివేశాలు రసిక జనులను టార్గెట్ చేసుకున్నవని చెప్పాలి. హీరోయిన్ బ్రూస్ లీ భక్తురాలు. బ్రూస్ లీని ఎవరేమన్నా ఓర్చుకోలేదు. ఆఖరుకి తన లవర్‌ని అయినా సరే. అందుకే బ్రూస్ లీని తక్కువ చేసి మాట్లాడినందుకు అతడికి కూడా తన కిక్ రుచి చూపించింది. 'ఎ లవ్ ట్రయాంగిల్' అని టీజర్‌లో చూపించారు. అంటే ఒక హీరోయిన్‌ను ఇద్దరు అబ్బాయిలు లవ్ చేశారా? అనే ఊహ రావచ్చు. హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ ఒక్కడే. మరి ట్రయాంగిల్ ఎలా అవుతుందంటే, ఆమె బ్రూస్ లీని కూడా అమితంగా ప్రేమిస్తుంది కాబట్టి. అందుకే, 'లవ్ ట్రయాంగిల్' అనే మాట ఉపయోగించారు. 'వాటర్ కెన్ ఫ్లో, వాటర్ కెన్ క్రాష్.. బి వాటర్ మై ఫ్రెండ్' అని నేపథ్యంలో బ్రూస్ లీ మాటలు వినిపిస్తుంటే, పూజ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేయడాన్ని చూపించారు. శరీరానికి అతుక్కుపోయే బాడీ సూట్‌లో పూజ అలరిస్తోంది.
ఇది కేవలం ఫైట్లకు ఉద్దేశించిన సినిమా మాత్రమే కాదు, ఇందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని, ఒక సందర్భంలో పూజ ఏడుస్తూ కనిపించడాన్ని బట్టి ఊహించవచ్చు. డిసెంబర్ 13న 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' ఇంటర్నేషనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామనీ, అదీ కూడా చైనాలో బ్రూస్ లీ స్వస్థలమైన ఫోషన్ సిటీలో ఆవిష్కరిస్తామనీ రాంగోపాల్ వర్మ తెలిపాడు. ఈ మూవీలోని కొంత భాగాన్ని చైనాలోనూ ఆయన షూట్ చేశాడు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా వర్మలోని మరో కోణం ఆవిష్కృతమవుతుందనేది నిజం.
Also Read