'ఆర్జీవీ.. భయోపిక్'ను అడ్డుకున్న ఫిల్మ్ చాంబర్
on Jan 31, 2020
రాంగోపాల్ వర్మపై బయోపిక్ తీస్తానని ప్రకటించిన ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రయత్నాలకు తొలి అడ్డంకి ఎదురైంది. 'ఆర్జీవీ (ఒక సైకో భయోపిక్)' అనే టైటిల్ రిజిస్ట్రేషన్‌కు తెలుగు ఫిల్మ్ చాంబర్ అభ్యంతరం తెలిపింది. జొన్నవిత్తుల డైరెక్ట్ చేసే సినిమాకు ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయాలంటూ మాగ్నస్ సినీ ప్రైం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున బి. వెంకట శ్రీనివాస్ చాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ టైటిల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మను సూచిస్తుంది కాబట్టి, ఆ టైటిల్‌ను అనుమతి ఇవ్వలేమని చాంబర్ ఆయనకు రాసిన లెటర్‌లో తెలిపింది. అంతేకాదు, ఆ టైటిల్ కావాలనుకుంటే ముందు రాంగోపాల్ వర్మ నుంచి 'ఎన్‌వోసీ' (నో అబ్జెక్షన్ సరిటిఫికెట్) తీసుకొని, తమకు సబ్మిట్ చేయాల్సిందిగా సూచించింది. ఈ లెటర్‌ను చాంబర్ సెక్రెటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ జారీ చేశారు.
రాంగోపాల్ వర్మ 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' (కమ్మరాజ్యంలో కడపరెడ్లు) సినిమాను రూపొందించడం, ఆ సందర్భాల్లో చేసిన కామెంట్లు జొన్నవిత్తులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. వర్మపై ఆయన మీడియా సాక్షిగా మండిపడ్డారు. దాంతో ఆయనను హేళన చేస్తూ ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ఇది జొన్నవిత్తులను మరింత కోపోద్రిక్తుడిని చేసింది. 'ఆర్జీవీ భయోపిక్' పేరుతో సినిమా తీసి, అతని చేష్టల్ని ఎండగడతానని ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఫిల్మ్ చాంబర్‌లో తన నిర్మాతతో ఫిల్మ్ చాంబర్‌లో టైటిల్ రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించారు. కానీ ఆ టైటిల్‌కు చాంబర్ అడ్డుచెప్పింది. ఈ నేపథ్యంలో జొన్నవిత్తుల ఏం చేస్తారో చూడాలి.