ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ ఎలా అయ్యాడో తెలుసా?
on Aug 27, 2019
ప్రభాస్ అనగానే నేడు దేశవ్యాప్త సినీ ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చేది శివలింగాన్ని భుజాల మీద మోస్తూ కనిపించే 'బాహుబలి' రూపం. ప్రభాస్‌కు అది ఐకానిక్ స్టిల్‌గా మారిపోయింది. 'బాహుబలి' మూవీ కమర్షియల్‌గా కానీ, ఇండియన్ సినిమా పరంగా కానీ ఎన్ని రికార్డుల్నీ, బెంచ్‌మార్క్స్‌నీ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. ఆ మూవీలో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే మనలో గూస్‌బంప్స్ మొదలైపోతాయి. ఒక ఫ్రాంచైజీగా 'బాహుబలి'.. గ్లోబల్ లెవల్లోనే ఒక సెన్సేషన్. యస్.యస్. రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి'తో ఆల్ ఇండియా స్టార్‌గా మారక ముందు ప్రభాస్ కెరీర్ ఎలా మొదలై, ఎలా సాగుతూ వచ్చిందో పరిశీలిస్తే, ఇవాళ అతడు దేశంలోని టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఎలా మారాడో అర్థమవుతుంది.
17 యియర్స్ బ్యాక్.. 'ఈశ్వర్' మూవీలో హీరోగా యాక్ట్ చెయ్యడం ద్వారా ప్రభాస్ కెరీర్ మొదలైంది. అయితే ఆ మూవీ కానీ, దాని తర్వాత వచ్చిన 'రాఘవేంద్ర' కానీ అతడికి పెద్దగా ఉపయోగపడలేదు. 2004లో శోభన్ డైరెక్ట్ చెయ్యగా, ఎమ్మెస్ రాజు ప్రొడ్యూస్ చేసిన 'వర్షం'.. అతడి మొట్టమొదటి బ్లాక్‌బస్టర్. హిందీ హిట్ ఫిల్మ్ 'తేజాబ్'కు ఫ్రీమేక్ అయిన ఆ మూవీలో వెంకట్ అనే కేరెక్టర్‌లో ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. చిత్రమేమంటే ఆ సినిమా హిందీలో 'బారిష్' పేరుతో రిలీజయింది. అక్కడుంచీ అతడికి ఫ్యాన్ బేస్ బాగా పెరుగుతూ వచ్చింది. యాక్టింగ్ స్కిల్స్‌తో పాటు ఫిజిక్‌నీ మెరుగుపర్చుకున్న అతడు 2005లో రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఛత్రపతి' సినిమాతో మాస్ స్టార్‌గా మారాడు. యాంగ్రీ యంగ్‌మేన్‌గా ఆ మూవీలో ప్రభాస్ చూపిన పర్ఫార్మెన్స్‌కు మాస్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అతడి ఫైట్స్, డైలాగ్స్ యూత్‌ను సైతం అమితంగా అలరించాయి. తల్లి నుంచి తప్పిపోయి కాందిశీకుడిగా మారి, ఆ తల్లి కోసం అన్వేషించే శివాజీ కేరెక్టర్‌లో చక్కగా ఇమిడిపోయాడు ప్రభాస్.
ఆ సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేసినంత ఆడకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. 2009లో వచ్చిన 'బిల్లా', 'ఏక్ నిరంజన్' సినిమాలు ఫర్వాలేదనిపించాయి. 2010లో కరుణాకరన్ డైరెక్ట్ చేసిన 'డార్లింగ్'లో లవర్ బాయ్‌గా అలరించడమే కాకుండా కెరీర్ పరంగా రిలీఫ్ పొందాడు. ఆ వెంటనే దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీ కూడా హిట్టవడంతో ప్రభాస్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. అతడిలోని కామిక్ టైమింగ్ కూడా వాళ్లను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలతో అతడి ఫ్యాన్ బేస్‌లోని మాస్ ఆడియెన్స్ ఒకింత డిజప్పాయింట్ అయ్యారు. ఆ లోటు తీర్చిన సినిమా 2013లో వచ్చిన 'మిర్చి'. అప్పటి దాకా రైటర్‌గా తెలిసిన కొరటాల శివ డైరెక్టర్‌గా మారి తీసిన ఆ తొలి సినిమాలో ప్రభాస్ స్టైలిష్ మాస్ హీరోగా అన్ని వర్గాల ఆడియెన్స్ హృదయాల్ని దోచేశాడు. ప్రభాస్ కెరీర్‌లోనే 40 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా నిలిచింది 'మిర్చి'. తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాల కారణంగా చిన్నతనంలోనే తండ్రికి దూరమై తల్లి దగ్గర పెరిగి, పెద్దవాడయ్యాక తండ్రి దగ్గరకు చేరి, ఆయనను శత్రువుల నుంచి కాపాడుకున్న జై అనే కేరెక్టర్‌లో ప్రభాస్ ప్రదర్శించిన పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని చెప్పాలి. ఆ కేరెక్టర్‌లో ఎంతో స్టైలిష్ లుక్‌లో, అతడు హ్యాండ్సంగా కనిపించిన తీరుకు అమ్మాయిలైతే డై హార్డ్ ఫ్యాన్స్‌గా మారిపోయారు.
'మిర్చి' చేసే సమయంలోనే రాజమౌళి చెప్పిన 'బాహుబలి' కథ విన్నాడు ప్రభాస్. ఆ సినిమా కోసం రెండేళ్ల పాటు వేరే సినిమా ఏదీ ఒప్పుకోకూడదనే రాజమౌళి కండిషన్‌కు సైతం ఒప్పుకొని ఆయన ఏం చెబితే, ఎలా చెబితే అది చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్‌కు మరో రెండేళ్లు కూడా రాజమౌళికే ఇచ్చేశాడు. ఈ క్రమంలో పెళ్లి ఆలోచనను కూడా పక్కన పెట్టేశాడు. రిజల్ట్ ఏమిటనేది ఇవాళ మనం చూస్తున్నాం. రాజమౌళిపై అతడు చూపిన నమ్మకమే ప్రభాస్‌ను పాన్-ఇండియా స్టార్‌గా మార్చేసింది. అతడిపై ఎంత బడ్జెట్ అయినా పెట్టొచ్చన్నే నమ్మకాన్ని మిగతా ప్రొడ్యూసర్స్‌లోనూ కలిగించింది.
అలా ఇప్పుడు వస్తున్న సినిమాయే 'సాహో'. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ సుజిత్ రూపొందించిన ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఏకంగా 350 కోట్లు కుమ్మరించారు. అదీ ఇవాళ ప్రభాస్ స్టామినా. తెలుగు వెర్షన్‌తో పాటు తమిళ, హిందీ వెర్షన్లలోనే ఒకేసారి తయారైన 'సాహో' మూవీ ఆగస్ట్ 30న మన ముందుకు వస్తోంది. ఈ సినిమాతో అతడు ఇంకెన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని అతడి డై హార్డ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వర్క్‌పై డెడికేషన్, లైఫ్‌లో డిసిప్లిన్‌తోటే దేశంలోని టాప్ స్టార్స్‌లో ఒకడిగా అతడు ఎదిగాడనడంలో సందేహం లేదు.
Also Read