ప్రభాస్ విషయంలో ఫ్యాన్స్ కోరుకుంటోంది అదే!
on Mar 21, 2020
కరోనా వైరస్‌కు భయపడి దేశంలో అన్ని భాషల చిత్ర పరిశ్రమలు షూటింగ్‌లను నిలిపివేశాయి. టాలీవుడ్‌లో చిరంజీవి సినిమా 'ఆచార్య', రాజమౌళి మూవీ 'ఆర్ఆర్ఆర్' సహా అన్ని సినిమాల చిత్రీకరణలూ ఆగిపోయాయి. అయితే అన్నింటి కంటే ఆలస్యంగా షూటింగ్ నిలిపి వేసిన సినిమా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'ఓ డియర్'. కారణం.. దీని షూటింగ్ జార్జియాలో జరుగడం. నిజానికి కరోనా భయాందోళనలు తీవ్రంగా వ్యాపించి సమయంలోనే రెండు వారాల క్రితం జార్జియాలో షూటింగ్ నిమిత్తం ప్రభాస్ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఆ సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్ మాస్క్ ధరించి కనిపించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి కూడా.
ఆ తర్వాత పూజా హెగ్డే కూడా ప్రభాస్ బృందాన్ని కలుసుకోడానికి జార్జియా వెళ్లంది. ప్రభాస్, పూజా హెగ్డే, మరికొంతమంది ప్రధాన పాత్రధారులతో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడు. ఈలోగా కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అన్ని దేశాలూ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అనేక రకాల ఆంక్షలు, నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. వాటిలో ముఖ్యమైంది సామాజిక దూరం. మీటింగ్‌లు, ఫంక్షన్‌లు వాయిదా వేసుకోమనీ, ఎక్కువమంది కలిసి ఒకచోట ఉంటే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందనీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయినా ప్రభాస్ బృందం షూటింగ్ కొనసాగించింది. అయితే భారత ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించడం ప్రారంభించడంతో నిర్మాతలు అప్రమత్తమై అప్పుడు తమ బృందానికి ఇండియాకు వచ్చేయమని కబురు చేయడంతో హడావిడిగా షెడ్యూల్ ముగించేసి ఇండియాకు వచ్చేశారు.
జార్జియా నుంచి వచ్చీ రాగానే ప్రభాస్, పూజా హెగ్డే, రాధాకృష్ణ కుమార్ సహా యూనిట్ మొత్తం సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లింది. క్వారంటైన్‌లో ఉన్న సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి. 14 రోజుల వరకూ ఎలాంటి వైరస్ లక్షణాలూ కనిపించకపోతే అప్పుడు బయటకు రావచ్చు. మూడు రోజుల క్రితమే ప్రభాస్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతడు కానీ, అతని బృందం కానీ కరోనా బారిన పడకుండా ఉండాలని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకుంటున్నారు. కాగా మార్చి 25న ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ఈ మూవీని రిలీజ్ చేయాలనేది నిర్మాతల సంకల్పం. గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.