'గ్యాంగ్ లీడర్' కోసం 'వాల్మీకి' వారం త్యాగం చేశాడు!
on Aug 27, 2019
సెప్టెంబర్ 13న రెండు మీడియం బడ్జెట్, మీడియం స్టార్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బలాబలాలు చూసుకోవడానికి రెడీ అయ్యాయి. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యంతో ఆ వార్‌కు తెరపడింది. 'గ్యాంగ్ లీడర్' కోసం 'వాల్మీకి' సినిమా రిలీజ్‌ని ఒక వారం పోస్ట్‌పోన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాని 'గ్యాంగ్ లీడర్', వరుణ్ తేజ్ 'వాల్మీకి' సినిమాలు రెండూ సెప్టెంబర్ 13న విడుదలవుతున్నట్లు వాటి నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇలా ఒకేసారి విడుదలవడం వల్ల రెండు సినిమాల ఓపెనింగ్స్‌పైనా, కలెక్షన్ల పైనా ప్రభావం పడుతుందని వాళ్లకు తెలుసు. అయినా అప్పుడే రావడానికి వాళ్లు నిర్ణయించుకున్నారు. కారణం.. ఆగస్ట్ 30న ప్రభాస్ 'సాహో', అక్టోబర్ 2న చిరంజీవి 'సైరా' సినిమాలు విడుదలవుతుండటం. ఆ రెండు సినిమాల మధ్య 5 వారాల గ్యాప్ ఉండటంతో వాటి మధ్యలో రావడం బెటర్ అని 'గ్యాంగ్ లీడర్', 'వాల్మీకి' సినిమాల నిర్మాతలు భావించారు.
అయితే దిల్ రాజు ఆధ్వర్యంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకొని ఆ ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడింది. వాస్తవానికి ఇప్పటికే ఒకసారి 'సాహో' కారణంగా రిలీజ్ డేట్‌ను ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 13కు 'గ్యాంగ్ లీడర్' మార్చుకోవడంతో, ఆ బేసిస్‌పై 'వాల్మీకి' ప్రొడ్యూసర్స్ అయిన 14 రీల్స్ ప్లస్ అధినేతలు రాం ఆచంట, గోపి ఆచంట బ్రదర్స్‌ను వాళ్ల సినిమాను ఒక వారం తర్వాత రిలీజ్ చేసుకోవాల్సిందిగా గిల్డ్ కోరింది. అంటే 'వాల్మీకి'ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. దీనికి వాళ్లు సరేనన్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఈవెనింగ్ అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోలో ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్ రాజు చెప్పారు. ఈ సమావేశానికి 'గ్యాంగ్ లీడర్' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్, 'వాల్మీకి' నిర్మాతలు కూడా హాజరయ్యారు. రెండు సినిమాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 'సాహో' రిలీజైన రెండు వారాల తర్వాత 'గ్యాంగ్ లీడర్' వస్తుంటే, 'సైరా' రావడానికి రెండు వారాల ముందు 'వాల్మీకి' విడుదలవుతుందన్న మాట.
'గ్యాంగ్ లీడర్'ను విక్రం కె. కుమార్ తీర్చిదిద్దగా, 'వాల్మీకి'ని హరీశ్ శంకర్ రూపొందిస్తున్నాడు.