రామ్‌చరణ్ తర్వాత ప్రభాస్‌తో చేస్తుందా?
on May 21, 2020
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ముంబై ముద్దుగుమ్మ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతోంది. అందులో ఆమె రోల్ చిన్నదే. 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, ఆమె తన డ్రీమ్ డైరెక్టర్స్ లో ఒకరు కావడం, పాన్ ఇండియన్ ఫిల్మ్ కావడంతో నిడివి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో అలియా భట్ నటించే అవకాశాలు ఉన్నట్టు తాజా సమాచారం. అయితే, అది కూడా పాన్ ఇండియన్ ఫిల్మ్ కావడం విశేషం.
ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ కాదు, పాన్ వరల్డ్ స్టోరీతో సినిమా తీస్తున్నాని చెప్పి ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచాడు దర్శకుడు. ఇందులో కథానాయికగా అలియా భట్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆమె ఏమంటుందో చూడాలి. ఒకవేళ ఆలియా భట్ అంగీకరిస్తే... ప్రభాస్ 21 ఆమె రెండో తెలుగు సినిమా అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ విజువలైజేషన్ పనుల్లో దర్శకుడు నాగ అశ్విన్ బిజీగా ఉన్నాడు.