ఆ పాత్రతో సందీప్ కిషన్ కాంట్రవర్సీ కొనితెచ్చుకుంటాడా?
on Nov 26, 2019
హీరోగా 14 ఏళ్ల స్వల్ప కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ రెండూ చూసి, సూసైడ్‌తో అర్ధంతరంగా జీవితాన్ని చాలించిన ఒకప్పటి ఆమ్మాయిల కలల రేడు ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మూవీతో ఫ్లాప్‌ను చూసిన సందీప్ కిషన్ ఆ మూవీని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అందరి కళ్లూ ఆ బయోపిక్‌పైకి మళ్లుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. సందీప్ కిషన్ ఇంతదాకా దీనిపై స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమని నమ్మాల్సి వస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను చెయ్యాలనే సాహసానికి సందీప్ ఎందుకు పూనుకున్నాడంటూ ఫిలింనగర్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో సందీప్ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. సందీప్ మేనమామ, పేరుపొందిన సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఇక్కడ చిరంజీవి ప్రస్తావన ఎందుకంటే, ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన ఒక కీలక ఘట్టంలో చిరంజీవి ఫ్యామిలీ ఉంది కాబట్టి.
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్‌కు ఎంగేజ్‌మెంట్ జరగడం, ఆ సందర్భంలోనే జర్నలిస్టులతో పవన్ కల్యాణ్ ఘర్షణ పడటం, దాన్ని దక్కన్ క్రానికల్ పేపర్ పతాక శీర్షికలతో రాయడం, ఆ పత్రిక కార్యాలయం ఎదుట పవన్ ధర్నాకు దిగడం, తర్వాత కొద్ది రోజులకే ఆ ఎంగేజ్‌మెంట్‌ను పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించడం.. ఒక సంచలనం. ఉదయ్ లైఫ్‌ను ఆ ఘటన తీవ్రంగా ప్రభావితం చేసిందని ఎవరైనా చెబుతారు. ఈ ఉదతం చోటుచేసుకుంది 2003లో. ఆ తర్వాత నుంచే అతని కెరీర్ ఒడిదుడుకుల్లో పడింది. పేరుపొందిన నిర్మాతలెవరూ అతనితో సినిమాలు చెయ్యడానికి ముందుకు రాకపోవడానికి ఈ ఘటన కూడా కారణమని ఇండస్ట్రీలో వినిపించే మాట. దాని తర్వాత మానసికంగా ఉదయ్ బాగా దెబ్బతిన్నాడని అతనితో సన్నిహితంగా మెలగినవాళ్లు అంటూ ఉంటారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు అతను విషిత అనే యువతిని పెళ్లాడాడు. ఏడాది తిరిగిందో లేదో, తను నివాసం ఉండే ఫ్లాట్‌లోనే అతను ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఉదయ్ మానసికంగా దెబ్బతినడానికి అతని తల్లి మరణం కూడా ఒక కారణమని వినిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఒక సినిమా తియ్యడానికి కావాల్సిన అంశాలన్నీ ఉదయ్ జీవితంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సుస్మితతో ఎంగేజ్‌మెంట్ కంటే ముందే ఒక లేడీ జర్నలిస్టుతో అతను డేటింగ్ చేశాడనే ప్రచారం ఉంది. అయితే ఆ ఇద్దరూ సామరస్యంగా విడిపోయారు. ఆ తర్వాతనే అతను సుస్మితకు దగ్గరయ్యాడనీ, వాళ్లిద్దరూ పరస్పరం ఇష్టపడటంతో పెద్ద మనసుతో వాళ్ల వివాహానికి చిరంజీవి అంగీకరించారనీ చెప్పుకుంటారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉదయ్ కిరణ్‌ను అల్లుడ్ని చేసుకోవడానికి చిరంజీవి సిద్ధపడినా, బహిర్గతం కాని కారణాలతో అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆ విషయంలో ఉదయ్ స్వయంకృతాపరాధం ఉందనే ప్రచారం అప్పట్లో నడిచింది.
ఇప్పుడు ఉదయ్ బయోపిక్‌కు సందీప్ కిషన్ సిద్ధపడుతుండటం, ఉదయ్ క్యారెక్టర్‌ను పోషించాలని ప్లాన్ చేస్తుండటంతో ఆ బయోపిక్‌లో చిరంజీవి క్యారెక్టర్, ఆయన కుమార్తెతో ఉదయ్ నిశ్చితార్థం ఘటన ఉంటాయా, ఉండవా? అనే చర్చ మొదలైంది. ఉదయ్ జీవితాన్నీ, అతని సినీ కెరీర్‌నూ మలుపుతిప్పినదిగా పేర్కొనే ఆ ఘటన లేకుండా అతని బయోపిక్‌ను ఊహించడం కష్టమని అతని సన్నిహితులు భావిస్తున్నారు. చందు అనే ఒక కొత్త దర్శకుడితో 2020లోనే ఈ సినిమాకు సందీప్ ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి క్యారెక్టర్‌ను, నిశ్చితార్థం ఎపిసోడ్‌నూ పెట్టి కాంట్రవర్సీని సందీప్ తలకెత్తుకుంటాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఆ ఎపిసోడ్ ఉన్నా కాంట్రవర్సీకి ఆస్కారంలేని రీతిలో దాన్ని చిత్రీకరిస్తారేమోననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఉదయ్ కిరణ్ బయోపిక్ నిజమైతే, సందీప్ తేనెతుట్టెను కదిపినట్లేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..
Also Read