మృతుల కుటుంబాలకు కోటి ఇస్తున్న కమల్
on Feb 20, 2020
లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి తన గొప్ప స్వభావాన్ని చాటుకున్నారు. 'ఇండియన్ 2' సెట్స్ లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు టెక్నీషియన్లకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆ ముగ్గురి కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా కుటుంబాల్లో చోటుచేసుకున్న నష్టానికి పరిహారం గా ఈ డబ్బు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తాను ఇస్తున్న కోటి రూపాయలు నష్టపరిహారం కాదని ఆర్థిక సాయం మాత్రమేనని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏదైనా కుటుంబంలోని కీలక వ్యక్తి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం బ్రతుకు సాగించడం ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసునని ఆయన అన్నారు. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా పరిశ్రమ ప్రముఖులతో మాట్లాడినట్లు కమల్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఇతరులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ఆయన వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసే వాళ్లకు రక్షణ ఇవ్వలేకపోతున్న అందుకు వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నానని కమల్ తెలిపారు.