మామాంగం మూవీ రివ్యూ
on Dec 12, 2019
నటీనటులు: మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, ప్రాచి తెహెలాన్, మాస్టర్ అచ్యుతన్, తరుణ్ రాజ్ అరోరా తదితరులు
తెలుగు పాటలు: భువనచంద్ర
తెలుగు మాటలు: కిరణ్
యాక్షన్ కొరియోగ్రఫీ: శ్యామ్ కౌశల్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పిళ్ళై
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా
సంగీతం: ఎం. జయచంద్రన్
దర్శకత్వం: ఎం. పద్మకుమార్
నిర్మాత: వేణు కున్నపిళ్లి
తెలుగులో విడుదల: గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్
విడుదల తేదీ: 12 డిసెంబర్ 2019
'బాహుబలి', తర్వాత 'కె.జి.యఫ్' భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త దారి చూపించాయి. భాషాభేదం లేకుండా కథ బావున్న చిత్రాలకు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కుతుండడంతో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఆ కోవలో తెలుగులోకి వచ్చిన సినిమా 'మామాంగం'. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'యాత్ర'తో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గర కావడం కూడా ఓ కారణమే. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
కథ:
నాలుగు శతాబ్దాల వెనక్కి వెళితే... కేరళలో ప్రతి 12 ఏళ్లకు జరిగే 'మామాంగం' మహోత్సవానికి సాముద్రి మహారాజును అంతం చేయాలనే లక్ష్యంతో వెళ్లువనాడు నుండి చావేరుళ్ వంశస్థులు ఒక్కరైనా వస్తారు. ఓసారి చంద్రోత్ వీర పానికర్... సాముద్రి మహారాజును చేరుకుంటాడు. కానీ, రాజును అంతం చేయకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ 24 ఏళ్లకు చావేరుళ్ నుండి చంద్రోత్ వంశంలో చివరి పానికర్ (ఉన్ని ముకుందన్), అతడి మేనల్లుడు (మాస్టర్ అచ్యుతన్) వస్తారు. మార్గమధ్యలో వీరు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కృపాచారి (మమ్ముట్టి) సహాయం చేస్తాడు. అతడి నిజరూపం ఏంటి? చావేరుళ్ కి ఎందుకు సహాయం చేశాడు? సాముద్రి మహారాజును చావేరుళ్ చంపగలిగారా? లేదా? చివరికి ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ:
మొదటగా చెప్పాల్సింది ఏంటంటే... ఇది యుద్ధ నేపథ్యంలో రూపొందిన హిస్టారికల్ వార్ మూవీ కాదు. కేరళలో ప్రాచీన యుద్ధవిద్య కలరిపయట్టు నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ మూవీ. ఒక ఆసక్తికర యుద్ధంతో సినిమా మొదలవుతుంది. అక్కణ్ణుంచి కథ ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి ప్రేక్షకుడికి చాలా సమయం పడుతుంది. మమ్ముట్టి కూడా తెరపై ఎక్కువసేపు కనిపించడు. ఉన్ని ముకుందన్, మాస్టర్ అచ్యుతన్ తదితరులు వస్తారు.
చావేరుళ్, సాముద్రి మహారాజుల మధ్య వైరం గురించి.... ఓపక్క మామాంగం మహోత్సవంలో భర్తలు, పిల్లలను కోల్పోయిన మహిళల బాధను, కోల్పోతామేమోనని బాధ పడుతున్న మహిళల ఆవేదనను చూపించే సన్నివేశాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. మధ్యలో సాముద్రి మహారాజు అనుచరులు ప్రజలను ఏ విధంగా బాధ పెడుతున్నదీ చూపించే సన్నివేశాలు వస్తాయి. అవేవీ ఆకట్టుకోవు. యుద్ధం కంటే ఎమోషన్ మీద దర్శకుడు ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు. ఆ ఎమోషన్ కానీ, ఆ రాజుల కథ కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు. కేరళ ప్రజలకు మాత్రమే కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈలోపు విసుగుతో పాటు విశ్రాంతి వస్తుంది. తర్వాత కూడా సినిమా నత్తనడకన సాగుతుంది.
క్లుప్తంగా కథను చెప్పాలంటే... యుద్ధం కంటే శాంతి ముఖ్యమని చెప్పే బుద్ధుడి లాంటి ఓ రాజు కథ ఇది. దాన్ని దర్శకుడు నేరుగా చెప్పకుండా... మలుపులతో చెప్పాలని ప్రయత్నించాడు. దాంతో మధ్యలో అసలు కథ కంటే కొసరు కథలు ఎక్కువ అయ్యాయి. ఆ మలుపులను ప్రేక్షకులు ఎవరైనా సులభంగా ఊహించవచ్చు. కథనం, దర్శకత్వంలో లోపాలు ఉన్నప్పటికీ... ఛాయాగ్రహణం, సంగీతంతో సరి చేయాలని సాంకేతిక నిపుణులు కృషి చేశారు. కానీ, సీరియల్ లా సాగుతున్న సన్నివేశాల ముందు వారి ప్రతిభ వెలవెలబోయింది. నిర్మాణ విలువలు, కాస్ట్యూమ్స్ బావున్నాయి.
ప్లస్ పాయింట్స్:
ప్రాచీన యుద్ధవిద్య కలరిపయట్టు నేపథ్యంలో సన్నివేశాలు
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
మలయాళీలు మాత్రమే కనెక్ట్ అయ్యే కథ
ఏం జరుగుతుందో అర్థం కాని ప్రథమార్ధం
నత్తనడకన సాగిన కథనం, దర్శకత్వం
ఏమాత్రం ఆకట్టుకోని మలుపులు
నటీనటుల అభినయం:
మమ్ముట్టి మంచి నటుడు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. తన పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. కృపాచారిగా కాసేపు నవ్విస్తారు కూడా! ఉన్ని ముకుందన్‌కు మజిల్ బాడీ చూపించి, యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా ప్రారంభంలో, ముగింపు సన్నివేశాలకు ముందు యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరికీ ఏమాత్రం తీసిపోని రీతిలో మాస్టర్ అచ్యుతన్ యాక్షన్ సీన్స్ చేశాడు. ప్రాచి తెహెలాన్ అందంగా కనిపించింది. తరుణ్ రాజ్ అరోరా ప్రతినాయకుడిగా కనిపించాడు. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
ఈ సినిమా చూడాలంటే... కేరళ కలరిపయట్టు విద్య నేపథ్యంలో సన్నివేశాలు చూడాలనే ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. సహనం, శాంతి, ఓపిక కూడా కావాలి. చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలతో కూడిన సినిమా చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తప్పకుండా నిరాశ పరిచే చిత్రమిది.
రేటింగ్: 1.75/5