'అజ్ఞాతవాసి' ఫ్లాప్.. ఎన్టీఆర్ స్పందన.!!
on Oct 6, 2018
మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా దాదాపు ఆయన తీసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి. థియేటర్ లో ప్లాప్ అయిన ఖలేజా లాంటి సినిమాలను కూడా ఈ సినిమా ఎలా ప్లాప్ అయింది అంటూ టీవీలో ఆదరించారు. అలాంటి త్రివిక్రమ్ కెరీర్ లో అజ్ఞాతవాసి సినిమా మచ్చలా మిగిలిపోయింది. అసలు త్రివిక్రమేనా ఈ సినిమా తీసిందని ప్రేక్షకులు అసహం వ్యక్తం చేసారు. అలాంటి అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో అరవింద సమేత మొదలుపెట్టాడు. అయితే అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో అసలు అరవింద సమేత స్టార్ట్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని నమ్మాడు. వెనకడుగు వేయలేదు.
ప్రేక్షకులకు మాత్రం ఎక్కడో అనుమానం. 'అజ్ఞాతవాసి’ ఫ్లాప్ ఒత్తిడి త్రివిక్రమ్‌పై పడి అది అరవింద సమేత మీద ప్రభావం చూపుతుందా? అని. తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో అజ్ఞాతవాసి ప్రస్తావన రాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. 'అజ్ఞాతవాసి ప్రభావం త్రివిక్రమ్‌పై ఉంటుందని నేను అనుకోను. సినిమాలనేవి ఓ ప్రయాణం. అందులో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు. నాకు లేవా ఫ్లాపులు?. ఒత్తిడి అనేది త్రివిక్రమ్‌గారి పైనే కాదు.. అందరిపైనా ఉంటుంది. కానీ ఓ సినిమా ఆ స్థాయిలో ప్రభావితం చేస్తుందని నేను భావించను. ‘అరవింద సమేత’ అనేది పూర్తిగా త్రివిక్రమ్ సినిమా. ఆయన ప్రయాణంలో నేను భాగమయ్యానంతే. అంతేగానీ నా ప్రయాణంలో త్రివిక్రమ్ భాగం కాదు. 'అరవింద సమేత' లో అన్ని పాత్రల్నీ చాలా అద్భుతంగా రాశారాయన' అంటూ ఎన్టీఆర్ ప్రశంసించారు.