ఎన్టీఆర్ బర్త్‌డే సాంగ్‌పై వివాదం
on May 21, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యువ హీరో, 'ఫలక్‌నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ ఒక ర్యాప్ సాంగ్ విడుదల చేశాడు. 'మాస్ కా దాస్' అంటూ సాగిన ఆ పాట రీమిక్స్. ఒరిజినల్ కాదు. 'ఫలక్‌నుమా దాస్' కోసం సంగీత దర్శకుడు వివేక్ సాగర్ స్వరపరిచిన పాటను ఎడిట్ చేసి విశ్వక్ సేన్ రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చింది. బాగుందంటూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కి మాత్రం నచ్చలేదు.
"ఈ పాటను అభినందించవద్దు. వృత్తిలో భాగంగా ఈ పాటను సినిమా కోసం చేశాను. బర్త్ డే విషెస్ కోసం కాదు. ఈ విషయమై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా. ఈ పాటతో నాకు సంబంధం లేదు. విశ్వక్ సేన్ ను చాలాసార్లు పాట తీసేయమని కోరాను. కానీ, అతడు అలా చేయలేదు. పాటను ఎందుకోసం అయితే చేశామో ఆ స్ఫూర్తిని అతడు చంపేశాడు. విశ్వక్ సేన్ ప్రవర్తన పట్ల నేను తీవ్ర అసంతృప్తితో ఉన్నాను" అని వరుస ట్వీట్లలో వివేక్ సాగర్ పేర్కొన్నారు. కాపీ రైట్స్ విషయమై అతడు కంప్లయింట్ చేసే ఆలోచనలో ఉన్నాడట.