'అశ్వథ్థామ'కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్
on Jan 28, 2020
అవును... మీరు చదివింది నిజమే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో 'అశ్వథ్థామ' సినిమా ప్రారంభం కానుంది. అయితే... ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన వాయిస్ ఓవర్ చెప్పలేదు. 'గోపాల గోపాల' చిత్రంలో పవన్ కళ్యాణ్ అశ్వత్థామ గురించి ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ ను ఈ సినిమాలో వాడుకున్నారు. ఈ సంగతి 'అశ్వథ్థామ' హీరో, స్టోరీ రైటర్ నాగశౌర్య మంగళవారం ఉదయం మీడియాతో చెప్పారు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగ శౌర్య మీడియాతో ముచ్చటించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ గురించి మాట్లాడుతూ "మేం 'గోపాల గోపాల'లో పవన్ గారు చెప్పిన డైలాగ్ వాడుకుంటున్నాం. ఆయనతో పాటు నిర్మాత శరత్ మరార్ గారి అనుమతి తీసుకున్న తర్వాతే మా సినిమాలో ఆ డైలాగు ఉపయోగించాం" అని అన్నారు.
మహాభారతంలో అశ్వత్థామ అది కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. అతని పేరు ఈ సినిమాకు పెట్టడం ఏమిటి? అని నాగశౌర్య అని ప్రశ్నించగా "ప్రతి ఒక్కరి లో మంచి చెడు రెండూ ఉంటాయి. ద్రౌపతి వస్త్రాపహరణం అప్పుడు అశ్వత్థామ అది తప్పని చెప్పాడు. తప్పు అని ప్రశ్నించాడు. మా సినిమాలో హీరో కూడా తప్పుని ప్రశ్నిస్తాడు. అందుకని అతడి పేరు మా సినిమాకు టైటిల్ గా పెట్టాను. నేను అతడిలో మంచిని మాత్రమే తీసుకున్నాను" అని అన్నారు.
ఇటీవల హైదరాబాదులో దిశ ఘటన జరిగింది. సమాజంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటి ఆధారంగా సినిమాలో సన్నివేశాలు రూపొందించామని నాగ శౌర్య తెలిపారు.
Also Read