మళ్లీ గ్యాప్ తరువాత వస్తున్న పవన్.. ఈ సారి రిజల్ట్ ఏంటో?
on Mar 16, 2020
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. జయాపజయాలకు అతీతంగా భారీ అభిమానగణం సొంతం చేసుకున్న వైనం పవన్ సొంతం. ఇక టాక్ సంగతి ఎలా ఉన్నా సరే.. ఓపెనింగ్స్ పరంగా పవర్ స్టార్ చిత్రాలకు ఉండే ట్రాక్ రికార్డే వేరు. అందుకే.. పవన్ సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన మేనియా నెలకొంటుంది.
అలాంటి పవన్ రెండేళ్ళకు పైగా గ్యాప్ తో 'వకీల్ సాబ్'తో పలకరించనున్నారు. ఇక క్యాలెండర్ ఇయర్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం.. ఒక సంవత్సరం మిస్ అవుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. 'అజ్ఞాతవాసి' తరువాత క్రియాశీలక రాజకీయాలపై దృష్టి సారించడం వల్లే పవన్ కి ఈ విరామం వచ్చిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా.. పవన్ కి ఇలా గ్యాప్ రావడం ఇదే తొలిసారి కాదు. కారణాలేమైనా గానీ... పవన్ అడపాదడపా ఇలా 'జీరో రిలీజ్ ఇయర్'ని తన కిట్టీలో వేసుకుంటూనే ఉంటారు. అందుకే.. అభిమానులు, సగటు ప్రేక్షకులు ఈ తరహా విరామాలకు అలవాటు పడిపోయారు కూడా.
అయితే, ఇక్కడో చిన్న మెలిక ఉంది. అదేమిటంటే.. గ్యాప్ తరువాత పవన్ నుంచి వచ్చిన సినిమాలేవీ విజయం సాధించిన దాఖలాలు చరిత్రలో లేవనే చెప్పాలి. 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన పవన్.. తన కెరీర్ లో ఇప్పటివరకు 2002, 2009, 2014, 2019... ఇలా నాలుగు సార్లు మాత్రమే సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయ్యారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గ్యాప్ తరువాత వచ్చిన పవన్ చిత్రాలేవీ ఆదరణకు నోచుకోలేదు. 2002 క్యాలెండర్ ఇయర్‌ని మిస్ అయిన పవన్... 2003లో 'జానీ'తో పలకరించగా డిజాస్టర్ దక్కింది. ఇక 2009ని 'జీరో రిలీజ్ ఇయర్'గా సరిపెట్టిన ఈ కొణిదెల స్టార్.. 2010లో 'కొమరం పులి'తో జనం ముందుకు రాగా ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. అదే విధంగా.. 2014ని మిస్ అయిన పవన్ 2015లో 'గోపాల గోపాల'తో పలకరించగా యావరేజ్ రిజల్ట్ దక్కింది. ఈ నేపథ్యంలో... 2019 క్యాలెండర్ ఇయర్ లో దర్శనమివ్వని పవన్.. 2020లో 'వకీల్ సాబ్'తో పలకరించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరి.. 'గ్యాప్'కి సంబంధించి గత సందర్భాల్లో చేదు అనుభవాలే చూసిన పవన్.. ఈ సారి అందుకు భిన్నంగా బ్లాక్‌బస్టర్ అందుకుంటారేమో చూడాలి.