బిగ్ స్టోరీ: ఆ క్రేజీ మూవీస్ టైటిల్స్ ఎందుకు మారాయో తెలుసా?
on Mar 14, 2020
ఆకర్షణీయమైన టైటిల్ పెడితే తమ సినిమా ప్రచారానికి అది బాగా హెల్ప్ అవుతుందనీ, తద్వారా సినిమా సక్సెస్‌లో అది కీలకం అవుతుందనీ దర్శక నిర్మాతలూ, హీరోలూ భావించడం సహజం. కొన్ని సినిమాల పేర్లు మొదట ఒకటి అనుకొని, తర్వాత మార్చడం మనకు కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఒక టైటిల్ నిర్ణయించుకొని, షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడో, సినిమా విడుదలకు ముందో ఏదో ఒక వివాదంతో టైటిల్ మార్చాల్సి రావడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే. అలాంటి సందర్భాల్లో కొంతమంది తెలివిగా మొదట అనుకున్న టైటిల్‌కి ముందో, చివరో ఇంకో పదం జోడించి, టైటిల్ లోగోలో దాన్ని చిన్న అక్షరాల్లో డిజైన్ చేసి, మొదట అనుకున్న టైటిల్‌తోటే జనం దాన్ని పిలిచేలా చేస్తుంటారు. మరికొంతమంది నిర్మాతలకు టైటిల్‌ని పూర్తిగా మార్చేసి, వేరే టైటిల్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడైతే వాళ్ల బాధ వర్ణనాతీతం. అలాంటి సందర్భం ఈమధ్యే వరుణ్ తేజ్ సినిమాకు రావడం చూశాం. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఆ మూవీకి పెట్టిన టైటిల్ 'వాల్మీకి'. కానీ ఆ టైటిల్‌పై వచ్చిన అభ్యంతరాలు, కోర్టు కేసుతో విడుదలకు కేవలం ఒకే ఒక్క రోజు ముందు 'గద్దలకొండ గణేష్' అని మార్చాల్సి వచ్చింది. ఇది ఆ సినిమాకు ఎంతో కొంత మేర నష్టం కలిగించిందనేది వాస్తవం. గడచిన కొన్ని సంవత్సరాల్లో అలా టైటిల్ మార్చాల్సి వచ్చిన సినిమాలేవో ఇప్పుడు చెప్పుకుందాం.
1. 'కొమరం పులి' నుంచి 'పులి'గా మారిన పవన్ కల్యాణ్
ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'కొమరం పులి' టైటిల్‌ను సరిగ్గా విడుదలకు ముందు 'పులి'గా మార్చారు నిర్మాతలు. టైటిల్'లో ఉన్న 'కొమరం' అనే పదానికి తెలంగాణ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, టైటిల్‌లో ఆ పదాన్ని తొలగించకపోతే ఆందోళనలు చేస్తామనీ, తెలంగాణలో సినిమా విడుదలను అడ్డుకుంటామనీ హెచ్చరికలు జారీచేయడంతో పోస్టర్ల నుంచి 'కొమరం' అనే పదాన్ని తొలగించి ఉత్త 'పులి'గా మార్చారు. 2010 సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన ఈ సినిమాని ఇప్పటికీ ప్రేక్షకులు 'కొమరం పులి'గానే పరిగణిస్తూ వస్తున్నారు.
2. 'ఖలేజా' కాదు.. 'మహేష్ ఖలేజా'!
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ హీరోగా నటించిన 'ఖలేజా' సినిమా టైటిల్ పరంగా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఆ టైటిల్ అనౌన్స్ చేసే సమయానికి ఆ టైటిల్‌ను వేరే నిర్మాత ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అయినప్పటికీ 'ఖలేజా' నిర్మాతలు సి. కల్యాణ్, సింగనమల రమేశ్ పట్టించుకోలేదు. దాంతో విజయ్‌భాస్కర్ రెడ్డి అనే ఆ నిర్మాత కోర్టు మెట్లెక్కారు. దాంతో త్రివిక్రమ్ బృందం తెలివిగా సినిమా టైటిల్‌ను 'మహేశ్ ఖలేజా'గా మార్చింది. టైటిల్ లోగోలో మహేశ్ అనే పేరును చిన్నక్షరాలతో డిజైన్ చేయించి, 'ఖలేజా' పేరును పెద్దగా పెట్టించారు. ఇది అనైతికమని విజయ్‌భాస్కర్ రెడ్డి ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ అయిన ఈ సినిమాని ఇప్పటికీ మనం 'ఖలేజా' పేరుతోనే వ్యవహరిస్తున్నాం.
3. 'మసాలా'తో సరిపెట్టుకున్న 'గరం మసాలా'!
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'బోల్ బచ్చన్'ను తెలుగులో వెంకటేశ్, రామ్ పోతినేని హీరోలుగా డైరెక్టర్ కె. విజయభాస్కర్ రీమేక్ చేశాడు. మొదట ఈ సినిమాకు అనుకున్న పేరు 'గరం మసాలా'. ఆ తర్వాత దానికంటే 'గోల్‌మాల్' బావుంటుందని భావించి, ఆ టైటిల్ ను అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. తర్వాత అది వర్కవుట్ కాదనిపించి, టైటిల్ మార్చాలనుకున్నారు. రామ్ క్యారెక్టర్‌ను దృష్టిలో ఉంచుకొని 'రామ్-బలరామ్' అని పెట్టాలనుకున్నారు. కానీ వెంకటేశ్ క్యారెక్టర్ విలువను తగ్గించినట్లు అవుతుందనే అభిప్రాయంతో 'మసాలా' అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేశారు. టైటిల్ విషయంలో ఇంతగా గింజుకున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఫ్లాప్ చేయడం కొసమెరుపు.
4. 'నానీస్ గ్యాంగ్ లీడర్'గా మారిన 'గ్యాంగ్ లీడర్'!
'గ్యాంగ్ లీడర్' అంటే మనకు గుర్తుకువచ్చేది మెగాస్టార్ చిరంజీవే. అదే టైటిల్‌తో సినిమా చెయ్యాలని నాని తెగ ఉబలాటపడ్డాడు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు నాని ఎగ్జైట్‌మెంట్ చూసి తీరాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ కంటే ముందే ఒక చిన్న నిర్మాత అదే టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌పై ఆయన లీగల్ యాక్షన్‌కు సిద్ధమవడంతో చేసేది లేక టైటిల్‌ను 'నానీస్ గ్యాంగ్ లీడర్'గా మార్చారు. టైటిల్ లోగోలో 'నానీస్' అనే పేరును ఇంగ్లీషు అక్షరాల్లో చిన్నవిగా 'గ్యాంగ్ లీడర్' టైటిల్‌కు పైన ఉపయోగించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి, నాని కలను భగ్నం చేసింది.
5. 'వాల్మీకి' కాదు.. 'గద్దలకొండ గణేష్'!
రేపు సినిమా విడుదల అనగా, ఈరోజు టైటిల్ మార్చడం అంటే ఆ సినిమాకు కమర్షియల్‌గా ఎంత పెద్ద దెబ్బో ఊహించుకోవాల్సిందే. ప్రొడ్యూసర్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు అది గుండెలు ఆగిపోయినంత పని. అయినా వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'వాల్మీకి' మూవీకి అలాంటి కష్టమే వచ్చింది. అయినా సినిమా విడుదల ఆపకుండా ధైర్యం చేసి, తెల్లవారి సినిమా విడుదల అవుతుందనంగా ముందు రోజు సాయంత్రం 'గద్దలకొండ గణేష్'గా టైటిల్ మార్చారు. 'వాల్మీకి' టైటిల్‌కు బోయ సామాజిక వర్గం అభ్యంతరాలు తెలపడం, నిర్మాతలు దాన్ని తేలిగ్గా తీసుకోవడంతో వాళ్లు హైకోర్టులో కేసు వేయడంతో.. అప్పుడు నిర్మాతలు కళ్లు తెరిచారు. సినిమాలో వరుణ్ తేజ్ పోషించిన 'గద్దలకొండ గణేష్' పేరునే టైటిల్‌గా ఖరారు చేశారు. అయితే అప్పటికే జనం నోళ్లలో 'వాల్మీకి' పేరే నానడంతో, టైటిల్ మార్పు జరిగినా వాళ్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందువల్లే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడి మంచి వసూళ్లు సాధించింది.
6. 'బెజవాడ రౌడీలు' వద్దు.. 'బెజవాడ' ముద్దు!
రామ్‌గోపాల్ వర్మ ఎక్కడుంటే కాంట్రవర్సీ అక్కడ ఉంటుందని మనకు తెలుసు. సినిమా టైటిల్స్‌తోనూ కాంట్రవర్సీకి కారణమవడం ఆయనకే చెల్లింది. అలాంటి వాటిలో ఒక సినిమా 'బెజవాడ రౌడీలు'. నాగచైతన్య హీరోగా ఆయన రూపొందించిన ఈ సినిమా టైటిల్‌కు విజయవాడకు చెందిన అనేక వర్గాల నుంచి వ్యతిరేకత, నిరసనలు వచ్చినా టైటిల్ మార్చనని మొదట భీష్మించిన వర్మ, చివరకు టైటిల్‌లోని 'రౌడీలు' పదాన్ని తొలగించి ఉత్త 'బెజవాడ'గా మార్చారు. టైటిల్ మార్చడానికి ఎవరెన్ని కారణాలు ఊహించుకున్నా అసలు కారణం తనకొక్కడికి మాత్రమే తెలుసని ఆయన వ్యాఖ్యానించాడు. షరా మామూలుగా.. 'బెజవాడ' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
7. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' కాదండోయ్.. 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మాత్రమే!
రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే రీతిలో.. అదీ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ పెట్టిన సినిమా టైటిల్ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'పై ఎంత దుమారం రేగిందో మనం చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీని, చంద్రబాబునూ, కమ్మ సామాజిక వర్గాన్నీ చులకన చేసే విధంగా ఆ చిత్రాన్ని వర్మ రూపొందించాడని ఆ వర్గంవాళ్లు భావించి, కోర్టుకెక్కారు. ఆ టైటిల్‌తో సినిమా విడుదలకు కోర్టు అంగీకరించే పరిస్థితి కనిపించకపోవడంతో 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా టైటిల్ చేంజ్ చేశాడు వర్మ. ప్రేక్షకులు ఎప్పటిలాగే స్పందించారు. ఆ సినిమా ఆడిన కొద్ది రోజులూ థియేటర్లవాళ్లు ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు.
8. 'అర్జున్ సురవరం'గా మారిన 'నిఖిల్ ముద్ర'!
నిఖిల్ జర్నలిస్టుగా నటించిన సినిమాకు 'నిఖిల్ ముద్ర' అనే టైటిల్ పెట్టారు. కారణం.. అప్పటికే జగపతిబాబు హీరోగా చేసిన సినిమాకు నిర్మాత నట్టి కుమార్ 'ముద్ర' అనే టైటిల్ పెట్టడమే. మొదట నట్టి కుమార్ సినిమాయే విడుదలైంది. అయితే కొన్ని థియేటర్లలో 'నిఖిల్ ముద్ర' పోస్టర్లను పెట్టడంతో నిఖిల్ బృందం గగ్గోలెత్తిపోయింది. టైటిల్ మార్చకపోతే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారని జనం భావిస్తారనుకొని హీరో పేరు అయిన 'అర్జున్ సురవరం'నే టైటిల్‌గా మార్చారు. అప్పటికీ విడుదలకు నానా కష్టాలు పడ్డ ఆ సినిమా ఎట్టకేలకు విడుదలై ఊహించిన దానికి మించి ఆదరణ పొందింది.
9. 'మిస్టర్ నూకయ్య'గా మారిపోయిన 'మిస్టర్ నోకియా'!
అనిల్ కృష్ణ (అని కన్నెగంటి) దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమాకు మొదట పెట్టిన టైటిల్ 'మిస్టర్ నోకియా'. నిజానికి సినిమాలో హీరో పేరు నూకయ్య అయినప్పటికీ స్టైల్‌గా ఉంటుందని తన పేరును నోకియా అని చెప్పుకుంటూ ఉంటాడు. సినిమా నిర్మాణంలో ఉండగానే మొబైల్ బ్రాండ్ నోకియా నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్ మార్చక తప్పలేదు. ఒరిజినల్ టైటిల్‌కు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మిస్టర్ పదాన్ని అలాగే ఉంచేసి 'నోకియా'ను 'నూకయ్య'గా మార్పు చేశారు. ఎటు తిరిగీ హీరో పేరు అదే కాబట్టి సమస్య లేదు. ఈ సినిమాని కూడా జనం ఆదరించలేదు.
10. 'మెంటల్ పోలీస్' బాలేదు.. 'పోలీస్' చాలు!
శ్రీకాంత్ హీరోగా పదేళ్ల క్రితం వచ్చిన సినిమాకు మొదట 'మెంటల్ పోలీస్' అనే టైటిల్ పెట్టారు. అందులో శ్రీకాంత్ పోలీస్ ఇన్‌స్పెక్టర్. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచే ఆ టైటిల్‌కు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందని, దయచేసి టైటిల్ మార్చమనీ పోలీస్ సంఘాల ప్రతినిధులు నేరుగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ శ్రీకాంత్‌ను కోరారు. సెన్సార్ బోర్డు సైతం ఆ టైటిల్‌తో సినిమా విడుదలకు అంగీకరించలేదు. దాంతో టైటిల్‌లోని 'మెంటల్' అనే పదాన్ని తొలగించి 'పోలీస్'గా మార్చారు. అయినా ప్రేక్షకులు ఆ సినిమాని అంతగా పట్టించుకోలేదు.
ఈ టైటిల్స్‌తో పాటు మరికొన్ని సినిమాల టైటిల్స్ కూడా మొదట అనుకున్న విధంగా కాకుండా రకరకాల కారణాల వల్ల మార్పుకు గురయ్యాయి. 'కత్తి' టైటిల్ 'కల్యాణ్‌రామ్ కత్తి'గా మారితే, రవితేజ 'కత్తి' టైటిల్ 'నిప్పు'గా మారిపోయింది. 'శ్రీదేవి' టైటిల్‌ను 'సావిత్రి'గా, 'వంగవీటి రంగా' టైటిల్‌ను 'వంగవీటి'గా రామ్‌గోపాల్ వర్మ మార్చాడు. విజయ్ హీరోగా నటించిన డబ్బింగ్ సినిమా 'పోలీసోడు' టైటిల్ 'పోలీస్' అయ్యింది. పవన్ కల్యాణ్ కోసం తన 'కాటమరాయుడు' టైటిల్‌ను ఇచ్చి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సప్తగిరి.
- బుద్ధి యజ్ఞమూర్తి
Also Read