'వకీల్ సాబ్' విషయంలో అది రూమరే!
on May 18, 2020
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిత్ర పరిశ్రమలోకి పునః ప్రవేశం చేస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. పై మూడు నాలుగు రోజులుగా ఇంటర్నెట్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయడానికి సినిమాను ఇస్తే 62 కోట్ల రూపాయలు ఇస్తామని అమెజాన్ ఆఫర్ చేసిందని, నిర్మాత దిల్ రాజు 75 కోట్ల రూపాయలకు పైనే అయితే ఇస్తానని చెబుతున్నారని ఆ వార్త సారాంశం. దీనికి అదనపు సమాచారం ఏంటంటే... దిల్ రాజు నిర్మించిన మరో సినిమా 'వి'కి అమెజాన్ 35 కోట్లు ఆఫర్ చేస్తే, ఆయన 45 కోట్లు అడుగుతున్నారట. అసలు వివరాలు తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఇది ఒట్టి పుకారే అని తెలిసింది.
'వి' సినిమా విడుదలకు సిద్ధమైంది. దానికి అమెజాన్ నుండి ఆఫర్ వచ్చినమాట వాస్తవమే. అయితే, హీరోలు నాని సుధీర్ బాబు సహా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించలేదు. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' విషయానికి వస్తే... ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. విడుదల మాట ప్రస్తావనకి రాలేదట. ఇప్పటి వరకు షూటింగ్ చేసిన సన్నివేశాలను ఎడిట్ చేసే పనిలో యూనిట్ పడింది. దర్శకుడు శ్రీరామ్ వేణు స్క్రిప్ట్ ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేయవలసిన సన్నివేశాలకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు. మళ్లీ షూటింగులు మొదలై సినిమా పూర్తయిన తర్వాత విడుదల గురించి ఆలోచించాలని అనుకుంటున్నారట.
క్రేజీ సినిమాలకు వల వేయడంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ బిజీ బిజీగా ఉంది. హిందీ, తమిళం, కన్నడ భాషలకు చెందిన ఏడు సినిమాలను పోటీలో విడుదల చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన ఎగ్జిబిటర్లుకు షాక్ ఇచ్చింది. నిర్మాతలపై ఐనాక్స్, పివిఆర్ వంటి మల్టీప్లెక్స్ చైన్ సంస్థలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం... నిర్మాతలకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మద్దతుగా నిలవడం, కొందరు మల్టీప్లెక్స్ సంస్థలపై విమర్శలు చేయడం తెలిసిన సంగతే. ఇవన్నీ పక్కన పెడితే... ఇప్పటివరకు ఓటీటీ పట్ల తెలుగు పరిశ్రమ ఆసక్తి చూపించలేదు.