రాజగోపాల్ అతిఆరాటంపై సిఎం ఆరా
Publish Date:Apr 16, 2012
Advertisement
విజయవాడ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఏం చేసినా అంతా సంచలనమే. ఆయన నోట ఏదైనా మాట వెలువడిన వెంటనే ఖండించటానికి టి.ఆర్.ఎస్. నేతలు, విమర్శించటానికి పొన్నం ప్రభాకర్ వంటి తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పిన తరువాత రాజగోపాల్ కొంతకాలం ఎవరికీ కనిపించకుండా సొంతపనుల్లో మునిగిపోయారు. మళ్ళీ హఠాత్తుగా బుల్లితెరపై ప్రత్యక్షమై ఎవరికీ అర్థంకాని ప్రకటన ఒకటి చేసి గందరగోళం సృష్టించారు. నిజానికి రాజగోపాల్ ప్రకటనే గందరగోళంగా ఉన్నప్పటికీ దాన్ని కూడా యథావిధిగానే టి.ఆర్.ఎస్., తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఖండించి పారేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్ర నాయకత్వం రాష్ట్రజనాభాలో 80 శాతం మందికి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి తెలంగాణా విషయంలో సూచిస్తుందని రాజగోపాల్ శెలవిచ్చారు. నిజానికి 80 శాతం మందికి సంతృప్తిని ఇచ్చే ఫార్ములా ఏదీ అధిష్టానం వద్ద లేదన్నది నిర్వివాదాంశం. రాజగోపాల్ అతి ఆరాటంతో చేసిన ఈ ప్రకటనపై సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు రాజగోపాల్ ఇటువంటి అస్పష్ట ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సలహాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాన్నీ ఆరా తీయాల్సిందిగా ముఖ్యమంత్రి తన సలహాదారులను ఆదేశించినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/vijayawada-mp-lrajgopal-24-13385.html





