తెలంగాణా సర్వే ప్రయోజనం నెరవేరేనా?
Publish Date:Aug 14, 2014
Advertisement
ఈనెల 19న తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలయిన ఒక పిటిషనుపై హైకోర్టు స్పందిస్తూ ప్రజలు సర్వేలో పాల్గొనాలని కానీ లేదా వారి వ్యక్తిగత వివరాలను తెలియజేయమని గానీ ప్రభుత్వం వారిపై ఎటువంటి ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. ప్రజలు ఇష్టమయితేనే ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేయించుకోవచ్చని, సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని స్పష్టంగా చెప్పింది. ఇది పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్చంద సర్వే అని, ఇందులో పాల్గొనమని ఎవరినీ బలవంతంగా ఎవరూ ఒత్తిడి చేయబోమని ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలియజేసారు. ఆయన ఈవిధంగా చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందువలన అంటే ప్రభుత్వం చెపుతున్నదానికీ, ఆయన చెప్పిన దానికీ మధ్య చాలా తేడా కనబడుతోంది. తెలంగాణాలో ప్రజలందరూ ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని ఇంతవరకు తెలంగాణా ప్రభుత్వం పదేపదే చెపుతోంది. అందుకొరకే సర్వే జరిగే రోజున అంటే ఆగస్ట్ 19న తెలంగాణాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, స్కూళ్ళు, కాలేజీలకు అన్నిటికీ శలవు ప్రకటించి, ఆరోజు ప్రజలందరూ తప్పనిసరిగా తమతమ ఇళ్ళవద్దే ఉండి సర్వే ఫారములు నింపడానికి అవసరమయిన అన్ని ఆధారాలను సిద్దంగా ఉంచుకోవాలని నోటిఫికేషన్ లో కోరింది. కనుక ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజలను సర్వేలో పాల్గోమని ప్రభుత్వం ప్రజలను ఒత్తిడి చేయకపోయినట్లయితే, ఇంత భారీ సర్వే చేసి ప్రయోజనం ఉండదు. అలాగని ఒత్తిడి చేసినట్లయితే తరువాత కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదు. ఈ సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంగా చెప్పినందున ఒకవేళ తెలంగాణాలో స్థిరపడిన లక్షాలాది ఆంద్ర ప్రజలు, బోగస్ రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందుతున్న అనర్హులు ఈ సర్వేలో పాల్గొనకపోతే ఈ సర్వే యొక్క ప్రయోజనం కూడా నెరవేరదు. కనుక ప్రభుత్వం ప్రజల మీద పరోక్షంగా ఒత్తిడి తెచ్చి వారి వివరాలు సేకరిస్తుందా? లేక దీనిని తూతూ మంత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకొంటుందా? అనే సంగతి మరో నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది.
http://www.teluguone.com/news/content/telangana-survey-45-37245.html





