కర్ఫ్యూతో బడుగుల కష్టాలు
Publish Date:Apr 12, 2012
Advertisement
నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమాలతో కష్టాలు పడుతున్న బడుగు జీవులకు నేడు కర్ఫ్యూ కష్టాలు కూడా అదన మయ్యాయి. ఉద్యమాలుకాని, కర్ఫ్యూ తో నష్టపోతున్నది సామాన్యులే. సమాజంలో 80 శాతంమంది ప్రజలు రోజువారి కూలీ పనులు, చేతివృత్తులు చేసుకొని జీవించేవారే, సాంప్రదాయ వృత్తులు నిర్వహించే బార్బార్లు, లాండ్రీషాపులు నిర్వహించేవారితో పాటు స్కూటర్ మెకానిక్, సైకిల్ షాప్ మెకానిక్, ఆటో డ్రైవర్, రిక్షా కార్మికుడు, భావన నిర్మాణ కార్మికులు, పాన్ షాప్, బజ్జీ, పానీపూరీ బండ్ల నిర్వాహకులు ఈ విధంగా చెప్పుకుంటూ పొతే ఎంతోమంది బడుగుజీవులు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే ఆదాయంపైనే జీవిస్తారు. ఒకరోజు సంపాదన లేకపోతే వీరు ఆ రోజు పస్తు వుండటం లేదా అప్పుచేసి పొట్టనింపుకోవాలి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పది సంవత్సరాల నుంచి బడుగుజీవులు ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక నెపంతో బంద్ లకు పిలుపునిచ్చే ప్రతిసారి ఈ వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంద్ ల సందర్భంగానే కాకుండా రాస్తారోకో, పికిటింగ్, ధర్నా వంటి కార్యక్రమాలతో ట్రాఫిక్ స్తంభించిన సమయాలలో కూడా ఆయా వృత్తులు, కార్మికులకు ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం బంద్ కారణంగా లేదా కర్ఫ్యూ కారణంగా ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకపోయినా వారి జీతం వారికి వస్తుంది. కాని ఎటువంటి సదుపాయాలూ లేకుండా కేవలం రోజువారి కూలీపై ఆధారపడి జీవించే సామాన్యుల పరిస్థితి ఏమిటని, వారు ఏ విధంగా జీవిస్తున్నారనే విషయంపై ఒక్క నేతకూడా ఆలోచించడం లేదు. ఇటువంటి స్థితిలో సమ్మేళ పేరిట పనులు లేకుండా చేయడం తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకొంటున్న బడుగులకు తెలంగాణ ఉద్యమ నేతలు సమాధానం చెప్పాల్సి వుంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బడుగు వర్గాలకు సహాయం అందించే విధంగానే ప్రభుత్వం కర్ఫ్యూ సమయాలలో బడుగులకు ఆసరా కలిగే విధంగా ఉచిత బియ్యం, ఇతర సరుకులు సహాయంగా అందించాల్సి వుంది.
http://www.teluguone.com/news/content/telanga-agitation-24-13333.html





