పుట్టపర్తిపై కన్నేసిన ఆ ముగ్గురు బాబాలు ఎవరు?
Publish Date:May 16, 2012
Advertisement
సత్యసాయిబాబా భౌతికంగా దూరమైన తరువాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వెలవెలబోతోంది. బాబా మహాభినిశ్రమణ అనంతరం పుట్టపర్తికి భక్తుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వ్యాపారలావాదేవీలు స్తంభించిపోయాయి. వందలాది మంది నిరుద్యోగులయ్యే ప్రమాదం ఏర్పడింది. కొంతమంది వ్యాపారులైతే తమ సంస్థలను మూసేసి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. పుట్టపర్తి తనవైభావాన్ని కోల్పోతుండటంతో ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో పాగా వేయటానికి ముగ్గురు బాబాలు ప్రయత్నిస్తున్నారు. ఈ బాబాల ప్రయత్నాలకు స్థానిక వ్యాపార్య్లతో పాటు ఆశ్రమ నిర్వాహకుల్లో కొందరు కూడా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టపర్తిపై కన్నేసిన బాబాలలో ఇద్దరు కర్నాటకకు చెందిన వారు. వారిలో అనంతపురం జిల్లావాసులకు అంతో ఇంతో పరిచయమున్న చిక్ బళ్ళాపూర్ కు చెందిన శివసాయిబాబా ఒకరు. సత్యసాయి శివైక్యం అయిన సమయంలో అక్కడ ప్రత్యక్షమై తామే ఆయన వారసుడనని ప్రకటించుకున్నారు. శివసాయి స్థానిక బిల్డర్లు, రాజకీయనాయకుల సహాయ సహకారాలతో పుట్టపర్తిలో ఒక పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని, మరో పెద్ద ఆశ్రమాన్ని నిర్మించబోతున్నారు. పుట్టపర్తిపై కన్నువేసిన బాబాల్లో మరొకరు అఘోరాబాబా. కర్ణాటకకు చెందిన ఈయన పుట్టపర్తికి 20 కిలోమీటర్ల దూరంలో అఘోరాబాబా సంస్థాన్ పేరిట సుమారు 50 ఎకరాల్లో ఆశ్రమం నిర్మిస్తున్నారు. పుట్టపర్తిలో పాగావేసేందుకు తహతహలాడుతున్న మరో బాబా మన రాష్ట్రానికి చెందిన రంగాసాయిబాబా, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం పరిసర ప్రాంతాల్లో రంగాసాయిబాబాకు భక్తులున్నారు. రంగాసాయిబాబా పుట్టపర్తిలో ఆశ్రమం ఏర్పాటు చెయాలని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఆహ్వానించారు. బాబా ఏర్పాటు చేసే ఆశ్రమానికి భూములు కేటాయిస్తామన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు బాబాల ప్రయత్నాలు సఫలమైతే పుట్టపర్తి మరోసారి భక్తులతో కళకళలాడే అవకాశం ఉంటుంది.
http://www.teluguone.com/news/content/puttaparti-sai-baba-demise-24-14070.html





