అప్రకటిత విద్యుత్ కోతలు: ఎండుతున్న పంటలు.. రోడ్డెక్కిన అన్నదాతలు.!
Publish Date:Sep 30, 2026
Advertisement
తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలపై అన్నదాతలు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సల్తాన్‌పూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరియు నిజాంపేట్ ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి తమ నిరసనను తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు, విద్యుత్ శాఖ ఇస్తున్న కోతలు శరాఘాతంగా మారుతున్నాయి. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు నిరంతరం విద్యుత్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు, ప్రస్తుత సంక్షోభ సమయంలో కనీసం 7 గంటల పాటు కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వలేకపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలు కారణంగా బోర్ వెల్స్ పై ఆధారపడి సాగు చేస్తున్న వేలాది ఎకరాల భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో వోల్టేజ్ సమస్య కారణంగా ఇప్పటికే వందలాది వ్యవసాయ పంప్ సెట్లు, మోటార్లు కాలిపోయి వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. సమస్యను ఎన్నిమార్లు ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సబ్ స్టేషన్లను ముట్టడించాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని ఖమ్మం, జోగులాంబ గద్వాల, సిద్దిపేట తదితర జిల్లాల్లో కూడా ఇదే రకమైన దుస్థితి నెలకొనడంతో రైతాంగం పెద్ద ఆందోళనలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అప్రకటిత కోట్లను నిలిపివేయాలని, వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో విద్యుత్ అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని, ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. [Power Cuts, Farmers Protest, Telangana, Sultanpur Substation, Sangareddy, Agriculture, Low Voltage Issue, Telugu One]
http://www.teluguone.com/news/content/power-cuts-24-233033.html




