ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం.. దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్.!
Publish Date:Oct 1, 2026
Advertisement
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి అకారణంగా తొలగిస్తున్నారంటూ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తమ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. ఇప్పటివరకు దాదాపు 20 వేల ఓట్లను ఎలాంటి సరైన కారణాలు లేకుండా కట్ చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లు కూడా ఇప్పుడు మాయమయ్యాయని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓట్ల తొలగింపు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని దానం నాగేందర్ ఆరోపణలు గుప్పించారు. కొందరు అధికారులు బీజేపీ నాయకులతో కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ఓట్లను గల్లంతు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్లు తొలగింపునకు బాధ్యులైన అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజమైన ఓటర్లను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం తన పద్ధతిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. ఈ తీరు కొనసాగితే హైదరాబాద్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబడిపోతుందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు తాము పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. తొలగించిన ఓట్లన్నింటినీ మళ్లీ పరిశీలించి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.ఈ ఘటనతో హైదరాబాద్‌లో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. రాబోయే రోజుల్లో ఈ ఓట్ల తొలగింపు వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. [ Khairatabad by-election notification, Telangana High Court, Danam Nagender, Election Commission, Vijaya Reddy, CM Revanth reddy, BRS Party, KTR, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/-khairatabad-byelection-notification-24-233157.html





