చిరుకి చీమకుట్టినట్లైనా లేదా? పి.ఆర్.పి. కేడర్ర్ కు
Publish Date:Apr 11, 2012
Advertisement
చిరుకి చీమకుట్టినట్లైనా లేదా? పి.ఆర్.పి. కేడర్ర్ కు జరుగుతున్న అన్యాయంపై తిరుపతిలో ఆందోళన! మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావటంతో ఆయన అభిమానులు కాపుసామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎంతో సంబరపడ్డారు. తిరుపతి నుంచి ఆయన శాసనసభకు ఎన్నికైనప్పుడు వందలాదిమంది నాయకులూ, కార్యకర్తలూ జేబులో డబ్బులు ఖర్చుపెట్టి చిరును అందలమేక్కించారు. అయితే ఇప్పుడు ఆ కార్యకర్తలూ, నాయకులూ చిరుపై చిటపటలాడుతున్నారు. తమను నట్టేట ముంచి చిరంజీవి అందలం ఎక్కారని వాపోతున్నారు. పి.ఆర్.పి.ని ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత తమకు గుర్తింపు అనేది లేకుండా పోయిందనీ, తాము కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నాయకులుగా మారామని, తమ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయినప్పటికీ చిరంజీవికి చీమకుట్టినట్లయినా లేదని వారు వాపోతున్నారు. కనీసం తిరుపతిలో పది నామినేటేడ్ పోస్టులు తమకు వస్తాయని స్థానిక మాజీ పి.ఆర్.పి. నాయకులు ఆశించారు. అయితే, కాంగ్రెస్ లో విలీనం తరువాత వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. తుడా చైర్మన్ పదవికి విజయ్ కుమార్, ఎపి టూరిజం డైరెక్టర్ అశోక సామ్రాట్టు పేర్లను చిరు ప్రతిపాదిస్తాడని అంతా భావించారు. కానీ, చిరంజీవి తమ గురించి అసలు పట్టించుకోవటం లేదని ఆ ఇద్దరు నాయకులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తిరుపతి వచ్చిన చిరంజీవిని వీరిద్దరూ కలుసుకోలేదు. వీరిలాగే మిగతా మాజీ పి.ఆర్.పి. ఆశావాదులు కూడా చిరంజీవిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/megastar-chiranjeevi-24-13292.html





