వీళ్లు ఖర్చుపెట్టకుండా ఉండలేరు!
Publish Date:Apr 9, 2019
Advertisement
‘అప్పుచేసి పప్పు కూడు’ అని మన పెద్దలు ఓ సామెతని చెబుతూ ఉంటారు. కొంతమందిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒంటి మీద వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా, పిల్లలకి తిండి పెట్టే స్తోమత రాకపోయినా... విలాసవంతమైన వస్తువులు కొనడంలో వీళ్లు ముందే ఉంటారు. ఇలాంటి మనస్తత్వం వెనుక ఏదన్నా కిటుకు ఉందేమో గమనించే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ బ్యాంకుని ఎన్నుకొన్నారు. ఆ బ్యాంకులోని 718 వినియోగదారుల చెంతకి వెళ్లారు. మీ ఖాతాలను ఓ ఏడాదిపాటు గమనించే అవకాశం ఇవ్వండి అని వారిని ఒప్పించారు. ఆ తర్వాత వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నల జాబితాను వారి ముందు ఉంచారు. ఏడాదిపాటు వీరంతా డబ్బుని ఖర్చుచేసిన విధానాన్ని బట్టి ఐదు క్యాటగిరీలుగా విభజించారు. బాగా తక్కువ ఖర్చు చేసే వారు తొలి క్యాటగిరీలోకి రాగా... విపరీతంగా ఖర్చుపెట్టేవారిని ఐదో క్యాటగిరీలోకి చేర్చారు. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా కొందరు బాగా ఖర్చు చేయడాన్ని గమనించారు. వ్యక్తిత్వాలలోని తేడా వల్లే ఇలా జరుగుతున్నట్లు తేలింది. బహిర్ముఖంగా (extroverts) ఉండేవారు, నలుగురిలోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారట. అంతర్ముఖంగా (introverts)గా ఉండేవారు తమ social status (అంతస్తు) ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. కానీ బహిర్ముఖులు అలా కాదు. వాళ్లు నలుగురిలో కలివిడిగా తిరగడానికి ఇష్టపడతారు. ఇతరుల ముందు తమ పేదరికం ఎక్కడ బయటపడుతుందో అని అప్పు చేసి మరీ విలాస వస్తువులని కొనుగోలు చేస్తారట. కొందరి ఆదాయం నేల చూపులు చూసినా, విలాస వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణం అని తేల్చి చెబుతున్నారు. కావాలంటే మీ చుట్టూ ఓసారి తరచి చూసుకోండి!
- నిర్జర.
http://www.teluguone.com/news/content/lifestyle-35-86530.html