కత్తులు దూసుకుంటున్న కామ్రేడ్లు
Publish Date:May 11, 2012
Advertisement
ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కమ్యూనిస్టు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. ఒకరి విధానం సరైనది కాదంటే మరొకరిది కాదంటూ వేదికలెక్కి మరీ ఈ కామ్రేడ్లు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో అసలు మనదేశంలో కమ్యూనిస్టుపార్టీలు ఎందుకు పూర్తిస్థాయిలో అధికారం పొందలేదో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది. సిద్ధాంత విభేదాల కారణంగా విడిపోయిన చరిత్ర ఉన్న ఈ కామ్రేడ్ల కథ ఎప్పుడు పరిశీలించినా మొదటికే వస్తోంది. కొన్నిస్థానాల్లో బలపడ్డారు అనుకునేలోపే అంచనాలు తారుమారు కావటమూ సహజమైంది. మనదేశంలో ప్రధానంగా కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా (సిపీఐ), భారతకమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) (సిపీఎం), భారతకమ్యూనిస్టు (మార్కిస్టు-లెనినిస్ట్) లిబరేషన్ (సిపి.ఐ.ఎం.ఎల్.), భారతకమ్యూనిస్టు (మావోయిస్టు), భారతకమ్యూనిస్టు (జనశక్తి) వంటి పార్టీలు పని చేస్తున్నాయి. వీటిలో సిపీఐ, సిపిఎం జనంలో ఉంటూ తమ భావజాలం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. సిపిఐఎంఎల్ లిబరేషన్, జనశక్తి వంటి పార్టీలు అక్కడక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. భావజాలంలో వచ్చిన విభేదాలు మన భారత స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్ళు పూర్తయినా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయుధాలతోనే రాజకీయ స్వాతంత్ర్యం సాధించటం కుడురుతుందన్న మావోయిస్టులు అడవుల దారి పట్టారు. బయటే ఉన్న సిపిఎంఎల్ రాష్ట్ర నేత కోటయ్య ఇటీవల ఒక రైతు సదస్సుకు వచ్చి సిపీఐ, సిపిఎం కు అస్సలు రాజకీయ వ్యూహమే లేదన్నారు. అలానే తెలంగాణా సమస్య విషయంలో సిపీఐ మద్దతు ప్రకటించింది. సమైక్యతకే తాము ప్రాధాన్యత ఇస్తాం కానీ ఎవరినీ వ్యతిరేకించమని సిపిఎం స్పష్టం చేసింది. ఇలా భావజాలాలతో పాటు సమస్యలను చూసే ధృక్కోణాలు మార్చుకున్న ఈ కామ్రేడ్ లను ప్రదానపార్తీలు విమర్శించక్కర్లేదు. కామ్రేడ్లే పరస్పరం విమర్శించు కుంటున్నారు. కోటయ్య తన ప్రసంగంలో చైనా, రష్యాల నుంచి వచ్చే ఆదేశాల కోసం చూస్తూ కూర్చోటం కన్నా స్థానికంగా ఎదురయ్యే సవాళ్ళపై ఉద్యమాలు చేసి ఉంటే ఈపాటికి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి ఉండేవారని తేల్చేశారు.
http://www.teluguone.com/news/content/internal-quarrel-between-communist-parties-of-india-24-13965.html





