ఇండోనేషియాలో కంపించిన భూమి...సునామీ హెచ్చరికలు
Publish Date:Apr 11, 2012
Advertisement
జకర్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.9 గా నమోదైంది. భూకంప తీవ్రతకు సుమత్రా దీవి వణికింది. దీంతో 28 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాని ప్రభావంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని గౌహతి, చెన్నై, కోల్‌కత్తా, బెంగళూర్, విజయవాడ, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూప్రకంపనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అండమాన్, నికోబార్ దీవులకు ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియాలోనే సుమత్రా తీరంలో భూకంపం చోటు చేసుకుంది. హిందూ మహాసముద్రంలోని అండమాన్ నికోబార్ దీవులకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ రెడ్ హై - లెవల్ వార్నింగ్ జారీ చేసింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మణిపూర్‌ల్లో కూడా ఇండోనేషియా భూకంపం ప్రభావం కనిపించింది.
ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బందా ఏస్ ప్రాంతానికి 495 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రం లోపలి భాగంలో 33 కిలోమీటర్ల అడుగున భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా వాతావారణ శాఖ వెల్లడించింది. 2004 సంవత్సరంలో సంభవించిన భూకంపం 9.1 నమోదైన సంగతి తెలిసిందే. హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ సుమారు రెండు లక్షల ముఫ్ఫై వేల మంది మృత్యువాత పడ్డారు.
ఇండోనేషియాలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం ఏదీ ఇప్పటి వరకు అందలేదు. హిందూ మహాసముద్రం మొత్తంగా సునామీ హెచ్చరికల ప్రభావం ఉండవచ్చునని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాల్లో కూడా దాని ప్రభావం కనిపించింది.
భువనేశ్వర్‌లో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరంలో సముద్రం కొంత ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దేశవ్యాప్తంగా దీని ప్రభావం కనిపించినట్లు అర్థమవుతోంది. ఇండోనేషియా నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉంది.
కాగా, భూకంప ప్రమాద ప్రభావం దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో, అసోంపై కూడా ఉంది. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ, విజయనగరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, అనకాపల్లిలో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. గత వందేళ్ళలో ఇది ఎనిమిదో అతిపెద్ద భూకంపం కావడం గమనార్హం. బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న కోల్‌కతాలో ఈ భూకంప ప్రకంపనల తీవ్రత అధికంగా ఉంది. ఫలితంగా కోల్‌కతాలో మెట్రో రైల్ సర్వీసులను నిలిపి వేశారు. ఇక్కడ రెండు దఫాలుగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
http://www.teluguone.com/news/content/indonesia-24-13307.html





