కిరణ్ కు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్న చిత్తూరు నేతలు
Publish Date:Apr 3, 2012
Advertisement
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. కిరణ్ కుమార్ నాయకత్వాన్ని బహిరంగంగానే సవాలు చేస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టిడిపిలో చేరాలనుకొని మళ్ళీ తన నిర్ణయం మార్చుకున్న డికె ఆదికేశవులునాయుడు కూడా కిరణ్ పై సమయం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడని, తాను సిఎంకు వ్యతిరేకమే కాని కాంగ్రెస్ పార్టీకి కాదని ఆదికేశవులునాయుడు అంటున్నారు. మరోవైపు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ చింతా మోహన్ కూడా కిరణ్ వ్యతిరేక వర్గీయులతో చేతులు కలుపుతున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు అగ్రనేతలు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. దీంతో మంత్రి గల్లా అరుణకుమారి అభీష్టం నెరవేరకపోతే ఆమె కూడా కిరణ్ వ్యతిరేక వర్గీయుల జాబితాలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ను తన కొడుకు గల్లా జయదేవ్ కు కట్టబెట్టాలని గల్లా అరుణకుమారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గల్లా జయదేవ్ కు టిక్కెట్ ఇప్పించడం కిరణ్ కుమార్ రెడ్డికి ఇష్టంలేదు. ఒకవేళ నిజంగా గల్లా జయదేవ్ కు టిక్కెట్ రాకపోతే గల్లా అరుణకుమారి కిరణ్ పై ధ్వజమెత్తే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కిరణ్ కుమార్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. తన తరపున తన వ్యతిరేక వర్గీయులతో మాట్లాడే సమర్థుడైన నాయకుడు కూడా ఎవరూ లేకపోవడం కిరణ్ కు ఇబ్బందికరంగా మారింది. చిత్తూరు శాసనసభ్యుడు సికె బాబు ప్రస్తుతం ఈ రాజకీయాలకు అంటీ అంటనట్టుగా ఉంటున్నారు. ఒకవేళ సికె బాబు కూడా ఈ వ్యతిరేక వర్గీయులతో చేతులు కలిపితే కిరణ్ పరిస్థితి జిల్లాలో మరింత అధ్వాన్నంగా తయారవుతుంది.
http://www.teluguone.com/news/content/chief-minister-kiran-kumar-reddy-24-13138.html





