అంటరానితనం అంతం కోసం పోరాడిన మహావ్యక్తి – డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్..!
Publish Date:Dec 6, 2024
Advertisement
అంబేద్కర్ గారి జీవితం ప్రతీ ఒక్కరికీ ప్రేరణ కలిగించే కథ. అంబేద్కర్ గారు సామాజిక-రాజకీయ సంస్కరణలు చేసిన వ్యక్తిగా తన ముద్రను భారతదేశ చరిత్రపై విడిచారు. ఆయన అనేక సామాజిక వివక్షలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పటికీ, విద్య ద్వారా విజయం సాధించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారు. అందుకే ఆయన మరణించిన డిశంబర్ 6వ తేదీన, అంబేద్కర్ వర్ధంతిగా దేశమంతా జరుపుకుని, ఆయనకి నివాళులర్పిస్తారు. ఆయన పశ్చిమ భారతదేశంలో దళిత మహార్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి భారత సైన్యంలో అధికారి. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే పాఠశాలలోని ఉన్నత కులానికి చెందిన తోటి విధ్యార్ధుల చేత అవమానించబడేవారు. అప్పట్లో స్కూల్లో వెనకబడిన వర్గాలవారిని గది బయటనే కూర్చోబెట్టేవారు, అలాగే వారికి నీళ్లు కూడా నేరుగా తీసుకునే హక్కు ఉండేది కాదు. ప్యూన్ లాంటి వారెవరొకరు పైనుంచి పోస్తే కిందనుంచి తాగాల్సిన పరిస్థితి. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ ఆయన రాసిన పుస్తకంలో “నో ప్యూన్, నో వాటర్” అని రాశారు. అంటే ప్యూన్ రానిరోజున నీళ్ళు కూడా తాగకుండా వుండేవారని రాశారు. అంబేద్కర్ గారి మరణానంతరం 1990వ సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. ఆయనని గౌరవిస్తూ అనుచరులు జై భీమ్ అనే నినాదం పలుకుతారు. ఆయన గౌరవప్రదంగా బాబాసాహెబ్ అని కూడా పిలవబడ్డారు దీని అర్థం "గౌరవనీయమైన తండ్రి". అని. ఆ మహానుభావుడు సమాజం కోసం చేసిన కృషికి నేడు ఆయన విగ్రహం లేని ఊరు ఉండదనటం అతిశయోక్తి కాదేమో...అలాగే 'స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్' పేరుతో విజయవాడలో కాంస్య విగ్రహం నిర్మించారు. ఇది దేశంలోనే రెండో ఎత్తయిన విగ్రహం కావటం విశేషం.అలాగే తెలంగాణలో కూడా నిర్మించారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుని మనమేం చేయాలి? డా. అంబేద్కర్ గారు ఆశించిన సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన జీవితం మనకు సంఘర్షణ, ధైర్యం, సేవాస్ఫూర్తికి ప్రతీక. ఈ రోజున ఆయన ఆశయాలను గౌరవిస్తూ, సామాజిక విభేదాలను తొలగించేందుకు కృషి చేయడం మన బాధ్యత. డా. అంబేద్కర్ గారి మరణ దినం మనకు ఆయన ఆశయాలను గుర్తుచేసే రోజు మాత్రమే కాకుండా, ఈ రోజుకీ పూర్తిగా మన సమాజాన్ని విడిచిపెట్టకుండా పట్టి పీడిస్తున్న కుల వివక్ష, అంటరానితనం రూపుమాపటానికి మనం చేయాల్సిన కృషిని గుర్తు చేయాలి. సామాజిక సమానత్వం కోసం మనందరం కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది. *రూపశ్రీ
సామాజిక వివక్ష బలంగా ఉన్న రోజుల్లో ఒక వెనుకబడిన వర్గంలో పుట్టి, పెరిగిన ఒక సాధారణ వ్యక్తి అప్పటికే మహావృక్షపు వేర్లలా సమాజమంతా అల్లుకుపోయిన అంటరానితనం, కుల వివక్షల మీద పోరాటం మొదలుపెట్టి, అందులో విజయం సాధించటం అంత సులువయిన విషయమేమీ కాదు. ఆ విజయం వెనుక ఎన్నో అవమానాలున్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మరెన్నో విమర్శలున్నాయి. కానీ అవన్నీ దాటుకుని వెనుకబడిన వర్గాల జీవితాలు బాగుపడటానికి అవకాశం కల్పించిన ఆ మహానుబావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఇంకెవరో కాదు…. ఒక దళితునిగా పుట్టి, పెరగటంలో ఒక మనిషి ఎదుర్కొనే కష్ట నష్టాలన్నీ స్వయంగా అనుభవించి, వాటిపై న్యాయ పోరాటం చేసి, దళితుల పాలిట దేవుడిగా పేరు పొందిన డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు.
ఆయన బరోడా గాయకవార్(రాజు) అందించిన స్కాలర్‌షిప్ సహాయంతో అమెరికా, బ్రిటన్, జర్మనీలోని విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. గాయకవార్ అభ్యర్థన మేరకు బరోడా పబ్లిక్ సర్వీస్‌లో చేరినప్పటికీ, అక్కడ కూడా వెనుకబడిన వర్గం నుంచి వచ్చినవాడిగా, ఉన్నత కులానికి చెందిన సహచరుల చేత అవమానాలు ఎదుర్కొనటంతో, తన దృష్టిని న్యాయవాద వృత్తి, బోధనవైపు మళ్లించారు. అంటరానితనం మీద పోరాటం మొదలుపెట్టారు.
దళితులలో ప్రముఖ నాయకుడిగా ఎదిగి, వారి హక్కుల కోసం పత్రికలను స్థాపించి, ప్రభుత్వ శాసన మండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యం పొందడంలో విజయం సాధించారు. విద్య అనే ఆయుధంతో, న్యాయమనే నిప్పుతో ఆయన పోరాటం సాగింది. 1947వ సంవత్సరంలో అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగ రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన సమాజంలో అణచివేతకు గురైన వర్గాల హక్కులను కాపాడటానికి న్యాయబద్ధమైన మార్గాలను ప్రవేశపెట్టారు. అలాగే, కుల వివక్ష నిర్మూలన, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పని చేశారు. జనవరి 26, 1950న రాజ్యాంగం స్వీకరించటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ జనవరి 26నే గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
ప్రభుత్వ విధానాల మీద నిరాశ చెందడంతో, 1951లో ఆయన మంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు. ఆయన తన జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛపై ధృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండేవారు. కుల వ్యవస్థని తీవ్రంగా విమర్శించారు. కులవ్యవస్థకు హిందూ ధర్మం ఆధారంగా ఉందని ఆయన చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారి, హిందువులలో ఆగ్రహం కలిగించాయి. హిందూ సిద్ధాంతంలో తాననుకుంటున్న స్పష్టమైన మార్పులు లేవని భావించి, 1956లో ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయనతో పాటు 2 లక్షలమందికిపైగా దళితులు కూడా బౌద్ధమతంలో చేరారు.
ఈ రోజు అతడి సేవలు, ఆలోచనలు, ఈ సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకునే రోజుగా నిలుస్తుంది. ప్రత్యేకంగా దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.
http://www.teluguone.com/news/content/ambedkar-death-anniversary-35-189509.html