బొద్దింకల ఆందోళనకు ఆర్ఎస్ఎస్ మద్దతు?
Publish Date:Jul 25, 2026
Advertisement
విద్యా రంగ ప్రక్షాళన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగసిన యువత, విద్యార్థుల ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ మద్దతుగా నిలుస్తున్నదా? కేంద్రంలో మోడీ సర్కార్ విధానాల పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ అసంతృప్తి వ్యక్తమౌతోందా? ఆ కారణంగానే రాత్రికి రాత్రి మోడీ ఓ వీడియో సందేశం ద్వారా నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాల్సి వచ్చిందా అంటే.. జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సంఘ్ పరివార్ పెద్దలలో అసహనం, అసంతృప్తి గూడుకట్టుకున్నాయంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎదిగి, ఇప్పటికీ ఆ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి కాక్రోచ్ ఆందోళనలకు మద్దతుగా బాహాటంగా చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. విద్యార్థుల ఉద్యమం సమజసమేననీ, ఆ ఉద్యమంలో పస ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే వారితో చర్చలు జరపాలని ఆయన మోడీ సర్కార్ కు విస్పష్ట సూచన చేశారు. పార్టీలో సీనియర్ మోస్ట్ నేత, అది కూడా ఆరెస్సెస్ మద్దతు ఉన్న బలమైన నాయకుడు మురళీ మనోహర్ జోషీ బాహాటంగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా గళం ఎత్తడమే మోడీ తీరు పట్ల ఆరెస్సెస్ ఆగ్రహంగా ఉందనడానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదం పొందాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. కానీ మోడీ సర్కార్ తీరు వల్ల పార్లమెంట్ లో చర్చలు జరిగే అవకాశమే లేకుండా పోవడం పట్ల ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు విద్యార్థుల ఆందోళనను మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోసం విద్యార్థుల డిమాండ్ ను పెడచెవిన పెట్టడం సాధ్యం కాదన్న భావన ఆరెస్సెస్ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు. RSS support for the cockroaches protest, RSS serious on Modi, Dharmendra Pradhan resignation demand, Murli Manohar Joshi on student protest
http://www.teluguone.com/news/content/-rss-support-for-the-cockroaches-protest-45-227042.html




