ఉత్తరాంధ్రలో బొత్స ప్రభ మసకబారిందా?
Publish Date:Sep 10, 2026
Advertisement
ఉత్తరాంధ్ర రాజకీయాలలో బొత్స కుటుంబ ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మజ్జి శ్రీనివాసరావు వైపీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం, పార్టీలో బొత్స ప్రాధాన్యతకు గండి కొడుతుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మజ్జి శ్రీనివాసరావు బొత్సకు కుడి భుజంగా వ్యవహరించేవారు. అటువంటి మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీ మారడం వెనుక బొత్స వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయంటున్నారు. అయితే బొత్స సత్యనారాయణతో చిన్న శ్రీను విభేదించడం ఇదే తొలిసారి కాదనీ, గతంలో అంటే 2024 ఎన్నికల సమయంలో కూడా చిన్న శ్రీను, బొత్స సత్యనారాయణ మధ్య విభేదాలు తలెత్తిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత బొత్సకు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలిలో ప్రతిపక్ష నేత బాధ్యతలను పార్టీ అధినేత జగన్ అప్పగించారు. బొత్సకు అంతటి ప్రాధాన్యత ఇచ్చిన జగన్.. అదే సమయంలో బొత్సతో విభేదిస్తున్న చిన్న శ్రీనును విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించడంతో పాటు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చచార్జ్ బాధ్యతలను కూడా అప్పగించారు. బొత్స అభీష్ఠానికి వ్యతిరేకంగా జగన్ చిన్న శ్రీనును ప్రోత్సహించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇటీవల కొంత కాలంగా బొత్స జనసేన గూటికి చేరనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. స్వయంగా ఆ ప్రచారాన్ని బొత్స ఖండించారనుకోండి. అది వేరే విషయం. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న శ్రీను వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంపై వైసీపీయులే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న శ్రీను నిష్క్రమణ బొత్స ఆశీస్సులతోనే జరిగిందా అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా చిన్న శ్రీను పార్టీని వీడటం విజయనగరం జిల్లాలో మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు పరిశీలకులు. ఇక వైసీపీలో బొత్స ప్రతిష్ఠ, పరపతికీ కూడా చిన్న శ్రీను తెలుగుదేశం గూటికి చేరడం దెబ్బేనని చెబుతున్నారు.
[Botsas influence waned in North Andhra, Botsa Satyanarayana, Chinna Srinu, YSRCP, TDP, Vizianagaram Politics, Uttarandhra News]
http://www.teluguone.com/news/content/-botsas-influence-waned-in-north-andhra-45-231126.html




