మూవీ రివ్యూ: రాయుడు
on May 27, 2016
విశాల్ సినిమా అంటే.. ఫైట్లు, ఫైట్లు, ఫైట్లు!
చాలా సినిమాల నుంచీ ఇదే పద్ధతి. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నా అనుకొని మూస పద్ధతిలోనే వెళ్లిపోతుంటాడు. బహుశా.. తన శైలికి యాక్షన్ కథలే నప్పుతాయని డిసైడ్ అయిపోయినట్టున్నాడు. అందుకే విశాల్ ఆ మూస చుట్టూనే తిరుగుతుంటాడు. విశాల్ సినిమా అనగానే అదో యాక్షన్ డ్రామా అని ఫిక్సయిపోయి జనాలు థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇప్పుడు రాయుడు పరిస్థితీ అంతే. కాకపోతే.. ఈ సినిమా విశాల్ సినిమాల ఫైట్లు, ఫైట్లు, ఫైట్లు మాత్రమే కాదు. మధ్య మధ్యలో కాస్త సెంటిమెంట్ కూడా తాళింపు వేసి.. కొత్త ఫ్లేవర్ అద్దే ప్రయత్నం చేశారు. మరి ఆ సెంటిమెంట్ అయినా వర్కవుట్ అయ్యిందా? అసలింతకీ ఈ రాయుడు కథేంటి? అతనెవరికి నచ్చుతాడు?? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి జంప్ చేయాల్సిందే.
కథ:
అనంతపురం నేపథ్యంలో సాగే కథ ఇది. భైరవుడు ఆ ప్రాంతపు పెద్ద. వాడి... విశ్వాస పాత్రుడు రొలెక్స్ బాచీ. భైరవుడు అండతో బాచీ పదవుల్ని సంపాదిస్తుంటాడు. అతని దృష్టి ఎమ్.ఎల్.ఏ సీటుపై పడుతుంది. అయితే ఎమ్మెల్యే కావడానికి ఒకే ఒక అడ్డు. తన పేరుపై కోర్టులో ఓ మర్డర్ కేసు నడుస్తుంటుంది. ఆ కేసు నుంచి తప్పించుకొంటే ఎమ్మెల్యే సీటు వచ్చేయడం ఖాయం. మరోవైపు రాయుడు (విశాల్) మార్కెట్‌లో కూలీ. బామ్మంటే తనకు చాలా ఇష్టం. బామ్మ ఏం చెబితే అది చేస్తాడు. బామ్మ చెప్పిందనే భాగ్యలక్ష్మి (శ్రీదివ్య) వెంటపడి, ప్రేమించి.. పెళ్లి చేసుకొంటాడు. రొలెక్స్‌పై ఉన్న మర్డర్ కేసు భాగ్యలక్ష్మి వేసిందే. భాగ్యలక్ష్మి అమ్మని దారుణంగా హత్య చేస్తాడు రొలెక్స్. బామ్మ చెబితే ఏదైనా చేసే రాయుడు.. మరి భార్య కోసం రొలెక్స్‌ని ఎదిరించాడా?? రొలెక్స్ బాచీ ఎమ్మెల్యే అయ్యాడా?? వీరిద్దరి మధ్య జరిగిన పోరులో విజేత ఎవరు? అన్నదే రాయుడు కథ.
విశ్లేషణ:
ఊర్లో ఓ బలవంతుడైన దుర్మార్గుడు, అతన్ని ఎదిరించే ఓ మొనగాడు. వాళ్లిద్దరి మధ్య పోరు.. ఇదే రాయుడు కథ. తొలి సన్నివేశాల్లో రోలెక్స్ బాచీ ఎంత దుర్మార్గుడో చూపించారు. అదే సమయంలో రాయుడు ఎంత బలవంతుడో బిల్డప్ ఇచ్చారు. దాంతో.. వీరిద్దరి మధ్యే పోటీ జరగబోతోంది అన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతుంది. రాయుడు లవ్ స్టోరీ.. ఓ సోదిలా సాగుతూనే ఉంటుంది. మధ్యమధ్యలో పాటలు మోతమోగిస్తుంటాయి. బామ్మ ఓవరాక్షన్, కొక్కొరొక్కోగా కమెడియన్ సూరి వేసే అరిగిపోయిన పంచ్‌లు వీటితో తొలి సగం చాలా భారంగా సాగుతుంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఆసక్తి రేకెత్తించేదే. అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంత గొప్పగా ఏం లేదు. తొలిభాగం ఎలాగోలా గడిచిపోయింది.. హమ్మయ్య అనుకొనేలోగా సెకండాఫ్‌లో అరాచకం వేరే లెవిల్లో మొదలవుతుంది. రాయుడు - బాచీ నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం తప్ప.. ఇద్దరూ బరిలో దిగి పోటాపోటీగా తలపడింది లేదు. బామ్మని బెరిదించి వెళ్లే సన్నివేశం, ఆ తరవాత బామ్మని దాచి.. రాయుడ్ని బెదిరించే సీన్లు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్లైమాక్స్‌కి ముందు కాస్త ఉద్వేగంగా సాగినట్టు అనిపించినా... మళ్లీ దర్శకుడిలో రొటీన్ ఫార్ములా విజృంభించడంతో శత్రు సంహారం చేసి కథ ముగించేశాడు.
సినిమా నిండా తమిళ నటులే. శ్రీదివ్య తప్ప తెలిసిన మొహం లేదు. దాంతో పాటు సన్నివేశాల్ని తెరకెక్కించిన విధానం కూడా తమిళ వాసనతో సాగిపోతుంది. తెలుగు సినిమా చూస్తున్నామన్న ఫీలింగే కనిపించదు. విశాల్ స్వతహాగా నల్లగాఉంటాడు. ఈసినిమాలో మరింత మసి పూశారేమో అనిపిస్తుంది. వినోదం లేకపోవడం.. సినిమా అంతా సీరియస్ మూడ్‌లో సాగడం, భరించలేనంత తమిళ నేటివిటీ.. ఇవన్నీ విసుగెత్తిస్తాయి. యాక్షన్ సినిమాల్ని విపరీతంగా ఇష్టపడి, మాకు ఫైట్లుంటే చాలు, మరేం అక్కర్లెద్దు అనుకొనేవాళ్లు తప్ప.. ఈ సినిమాని ఓపిగ్గా చూడడం కష్టమే.
పెర్‌ఫార్మ్సెన్స్:
విశాల్ ఈ సినిమాతో కొత్తగా చేసిందంటూ ఏమైనా ఉందంటే అది మూటలు మోయడమే. రౌడీలను ఇరగ్గొట్టడం, మాస్ డైలాగులు చెప్పడం ఎప్పుడూ చేసేవేగా. శ్రీదివ్య క్యూట్‌గా ఉంది. నీట్‌గా నటించింది. ఆమెది మాత్రమే ఈ సినిమాలో చూడగలిగే ఫేస్ అంటే.. ఇక అర్థం చేసుకోవొచ్చు. రొలెక్స్ బాచీ బాగా భయపెట్టాడు. సూరి ఓ మాదిరిగా నవ్వించాడు. బామ్మ నటన కూడా ఓకే.
సాంకేతికంగా:
ఇమాన్ అందించిన పాటలు ఏం అర్థం కాలేదు. ఇక ఎక్కడ గుర్తుంచుకొంటాం?? ఆర్.ఆర్ తో మాత్రం సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. ఛాయాగ్రహణం... మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. ఆర్ట్ విభాగం ప్రత్యేకించి ఏం చేయలేదు. ఎందుకంటే.. ఈ సినిమా అంతా సహజమైన లొకేషన్లలో తీసిందే. మామూలుగా మన ఇళ్లలో ఎక్కడ ఏముంటాయో.. ఈ సినిమాలోనూ అలానే ఉంటుంది. సినిమాటిక్ ఫీల్ ఉండదు. ఆ విషయంలో మాత్రం దర్శకుడ్ని మెచ్చుకోవచ్చు. రొటీన్ కథని ఎంచుకొన్న దర్శకుడు ముత్తయ్య.. దాన్ని మరింత రొటీన్‌గా తీర్చిదాద్దాడు.
తెలుగు వన్ వ్యూ:
వీడు రొటీన్.. రాయుడు
రేటింగ్: 2/5