అది విశాల్ అంటే..!
on Sep 22, 2016
తమను ఇంత స్థాయికి తీసుకొచ్చిన జనం కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయడానికి వెండితెర వేల్పులు ఎప్పుడూ ముందేఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్నా అందరి స్టార్స్ మాట ఒక్కటే..వీరిలో తమిళ
యువహీరో విశాల్ మాత్రం ప్రత్యేకం. ఆపదలో ఉన్నవారికి నేనున్నంటూ ఆపన్న హస్తం అందించడంలో విశాల్ ఎప్పుడూ వెనుకడుగు వేయడు. చెన్నై వరదల సమయంలో మోకాళ్ల లోతు నీటిలో సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నాడు. ఆ తర్వాత అంతకు ముందు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు విశాల్.
తాజాగా ఈ నెల 19న చెన్నైలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును నడిపి 13 ఆటోలను ఢీ కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తూ ఆర్ముగం అనే వ్యక్తి మరణించాడు. ఆయన మరణంతో అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో ఆర్ముగం కుటుంబాన్ని ఆదుకోవడానికి విశాల్ ముందుకు వచ్చాడు. అతని స్వగ్రామానికి వెళ్లి అతని కుటుంబసభ్యుల్ని పరామర్శించి కిరణా షాపు పెట్టుకునేందుకు, వారి కుమార్తె చదువుకయ్యే ఖర్చును భరిస్తానని మాట ఇచ్చాడు. ఈ వార్త తెలియడంతో విశాల్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు.