శరత్‌ను టైం చూసి కొట్టిన విశాల్
on Nov 30, 2016
తమిళ సీనియర్ నటుడు శరత్‌కుమార్, యువనటుడు విశాల్ మధ్య వైరం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. నిన్న మొన్నటి వరకు ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతోనే సరిపెట్టుకున్న వీరిద్దరూ ఇప్పుడు అమీతుమీ తేల్చుకునే స్థాయికి వచ్చారు. రెండు సార్లు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఆయన్ను ప్రశ్నించేవారెవ్వరూ లేకపోవడంతో శరత్ ఆడింది ఆట..పాడింది పాట అన్నట్లు సాగింది. కానీ విశాల్ నేతృత్వంలోని కొత్త ప్యానెల్ ఎన్నికైన తర్వాత శరత్‌కు బ్యాడ్ టైం స్టార్టయింది. శరత్ కుమార్ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారంటూ తొలి నుంచి ఆరోపిస్తున్న విశాల్ తాను కార్యదర్శి అయిన తర్వాత ఆ కుంభకోణాలను తేల్చేందుకు కమిటీ వేశాడు.
ఈ దశలో విశాల్‌ను నిర్మాతల సంఘం నుంచి వెలివేసేలా పావులు కదిపాడు శరత్‌కుమార్. తన టైం కోసం వెయిట్ చేసిన విశాల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. అవినీతి కుంభకోణాలను సమర్థించారన్న కారణంతో శరత్‌కుమార్, రాధారవిలను నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అటు సుమారు మూడు దశాబ్ధాల పాటు అగ్రనటుడిగా కొనసాగుతున్న వ్యక్తిని..నిన్న గాక మొన్న వచ్చిన యువ నటుడు దెబ్బకు దెబ్బ తీయడంపై కోలీవుడ్ వర్గాల్లో చర్చినీయాంశమైంది.