శరత్‌కుమార్‌పై విశాల్ వేటు..
on Sep 13, 2016
తమిళ సీనియర్ నటుడు శరత్‌కుమార్, యువనటుడు విశాల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విబేధాలున్నాయన్న విషయం కోలీవుడ్‌తో పాటు సౌత్ మొత్తం తెలుసు. అప్పట్లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్‌కుమార్ వర్గం అనేక అవతవకలకు పాల్పడిందని, నిధుల దుర్వినియోగం చేసిందని విశాల్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తాను ఈసారి నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేస్తానని సవాల్ విసిరాడు. అన్నమాట ప్రకారం ఎన్నికల బరిలోకి దిగాడు. ఆ సమయంలో శరత్‌కుమార్, విశాల్ వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయి. సంఘ చరిత్రలోనే తొలిసారిగా హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో విశాల్ ప్యానల్ ఘనవిజయం సాధించింది. ఇక అప్పటి నుంచి వీరిమధ్య వైరం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సంఘం నుంచి శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు నడిగర్ సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తాము నిర్వహించిన తనిఖీల్లో గత కార్యవర్గం పలు అవకతవకలు, అవినీతికి పాల్పడినట్టు తేలడంతో చర్య తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వార్తతో తెలియగానే కోలీవుడ్ ఉలిక్కిపడింది.