బాహుబలిపై రాజమౌళికే నమ్మకం లేదా?
on Jun 30, 2015
బాహుబలి గురించి అందరూ గొప్పగా మాట్లాడుకొంటున్నారు. విడుదలకు ముందే... `ఈ సినిమా ఓ క్లాసిక్ అవ్వబోతోంది` అంటూ కితాబులిస్తున్నారు. ప్రభాస్ అభిమానులైతే... `బాహుబలి సౌతిండియా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం` అనుకొంటున్నారు. అయితే ఈ మాటలు, ఈ అంచనాలూ.... రాజమౌళిని తీవ్రంగా భయపెడుతున్నాయి. పెరిగిన అంచనాలకు సినిమా కాస్త అటూ ఇటూ అయినా... బుర్ర తిరిగిపోవడం ఖాయం.
రోజురోజుకీ పెరుగుతున్న అంచనాలకు కళ్లెం ఎలా వేయాలో కూడా రాజమౌళికి అర్థం కావడం లేదు. అయితే ఈ సినిమా ఫలితంపై పై టీమ్‌లోనూ కాస్త భయం ఉన్నట్టు టాక్. `సినిమా బాగుంటుంది కానీ.. వచ్చిన హైప్‌కి అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది` అని బాహుబలి టీమ్‌కి పనిచేసిన ప్రధాన టెక్నీషియన్లు కూడా గుసగుసలాడుకోవడం విశేషం. ఆఖరికి రాజమౌళి కూడా ఆ భయాన్ని దాచుకోలేకపోయాడు. `సినిమా ఎలా ఉంటుందో అన్న టెన్షన్ నాక్కూడా ఉంది. అయితే ఆ భయాన్ని కనిపించకుండా కవర్ చేసుకొంటున్నా..` అంటూ బయటపడిపోయాడు.
ప్రభాస్ సైతం.. `అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయమే` అని నిజం ఒప్పుకొన్నాడు కూడా. దాంతో బాహుబలి పై టీమ్‌కే పెద్దగా నమ్మకాల్లేవన్నది అర్థమవుతోంది. ఇప్పుడొచ్చిన హైప్ ప్రకారం చూస్తే.. తొలివారం రోజులూ ఈసినిమా రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయం. అయితే.. ఆ తరవాత నిలబడాలంటే, పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలంటే... బాహుబలి ఓ క్లాసిక్‌లా నిలబడాల్సిందే. అయితే బాహుబలికి అంత సీన్ ఉందా, లేదా? అనే విషయం విడుదల అయితే గానీ తెలీదు.