మహేష్‌కి రాజమౌళి కథ చెప్పలేదింకా!
on Apr 25, 2020
వందకు రెండొందల శాతం ఖాయమే... సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కెఎల్ నారాయణ ఓ సినిమా నిర్మించడం! ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత ఆ సినిమా పట్టాలు ఎక్కుతుంది. ‘ఇప్పటికి వందసార్లు చెప్పా. దానయ్యగారి సినిమా తర్వాత మహేష్‌గారు, నారాయణగారు, నా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది’ అని ఇటీవల రాజమౌళి చెప్పారు. వీడియో కాల్స్‌లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ (రచయిత), పెదన్న కీరవాణి (సంగీత దర్శకుడు)తో మహేష్ సినిమా కోసం ఐడియాలు డిస్కస్ చేస్తున్నట్టూ ఆయన తెలిపారు. ఇక ఆసల్యం ఏముంది? కొందరు కొంచెం గ్యాప్ ఇచ్చి వార్తలు వండేశారు. ‘మహేష్, రాజమౌళి సినిమా 2023లో ఉంటుంది’ అని! ఒకవేళ ఆ ఏడాది వచ్చినా రావచ్చు. ఎందుకంటే... ‘ఆర్‌ఆర్‌ఆర్’ 2021 సంక్రాంతికి విడుదలవుతుంది. తర్వాత మహేష్ సినిమా కనుక, దానికి ఓ రెండేళ్లు లెక్క కట్టేశారు.
ఒకవేళ లాక్‌డౌన్ మరో ఆరు నెలలు కొనసాగి ఈ ఏడాది షూటింగులు జరగకపోయినా... వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగు చేసి ద్వియార్థంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత 2022లో మహేష్ సినిమాను రాజమౌళి ప్రారంభించినా... తర్వాతి ఏడాదికి అంటే 2023లో వచ్చేస్తుందని అనుకుని ఉంటాయి. అయితే, అసలు మేటర్ ఏంటంటే... మహేష్‌బాబుకి రాజమౌళి కథ చెప్పలేదింకా! కనీసం ఐడియా కూడా చెప్పలేదు. మహేష్ తను ఎటువంటి సినిమా చేస్తే బావుంటుందని కుటుంబ సభ్యులతో డిస్కస్ చేస్తున్నాడు. అంతే! మహేష్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తన అభిరుచికి తగ్గ సినిమా తీయాలని రాజమౌళి అనుకుంటున్నారు.