ఇకపై రాజమౌళి సినిమాలకు మాత్రమే??
on May 16, 2020
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇకపై రాజమౌళి సినిమాలకు మాత్రమే పని చేస్తారా? ఆయన రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనల్లో ఉన్నారా? ఇండస్ట్రీలో ఇటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కొత్త సినిమాలను అంగీకరించ కూడదని నిర్ణయం తీసుకున్నారట. యువ సంగీత దర్శకులను ప్రోత్సహించాలని అనుకుంటున్నారట.
ఎం.ఎం. కీరవాణి రిటైర్మెంట్ ఆలోచన ఇప్పటిది కాదు. కొన్ని రోజుల క్రితం నుండి ఉంది. 'బాహుబలి 2' తర్వాత సంగీతానికి శుభం కార్డు వేస్తానని ఆయన ట్వీట్స్ చేశారు. ఒక విధంగా కీరవాణి నిర్ణయం అప్పట్లో కలకలం సృష్టించింది. అయితే... అతడి మనసు మార్చుకునేలా ఇండస్ట్రీలో కొందరు చక్రం తిప్పారు. తర్వాత కొన్ని సినిమాలకు కీరవాణి పని చేశారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇంటిలో ఎక్కువ సమయం గడుపుతున్నా కీరవాణి మరోసారి రిటైర్మెంట్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత కొత్త చిత్రాలను అంగీకరించడం కూడదని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే, ఇప్పటివరకు కీరవాణితో తప్ప మరో సంగీత దర్శకుడితో రాజమౌళి పనిచేయలేదు. సో... అన్నయ్య నిర్ణయాన్ని తమ్ముడు మార్చే అవకాశాలు లేకపోలేదు. రాజమౌళి సినిమాలకు కనీసం రెండేళ్లు పడుతుంది. ఈ సమయంలో చాలా జాలీగా బాణీలు సమకూర్చి, నేపథ్య సంగీతం చేయవచ్చు. కీరవాణి పై ఎటువంటి ఒత్తిడి ఉండదు. పైగా తమ్ముడి ఆలోచనలు, అభిప్రాయాలపై అతనికి పూర్తి అవగాహన ఉంది. అందుకని రాజమౌళి సినిమాలకు తప్ప ఇతర సినిమాలకు ఆయన పనిచేయకపోవచ్చు అనే మాట వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజమో కీరవాణిగారే చెప్పాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
