కరోనా ఎఫెక్ట్: 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కు బ్రేక్!
on Mar 14, 2020
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దిగ్దర్శకుడు యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 2021 జనవరి 8న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే కరోనా వైరస్ భయంతో చాలా సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇదే స్థితి నెలకొని ఉంది.
'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను పూణేలో ప్లాన్ చేయడం సమస్యగా మారింది. కారణం.. శుక్రవారం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా హాళ్లను బంద్ చేసేసింది. దాంతో పాటు కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు నిబంధనలు విధించింది. ఫలితంగా పలు హిందీ సినిమాల షూటింగ్‌లను నిర్మాతలు వాయిదా వేసుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్'కు సైతం ఇదే స్థితి ఏర్పడిందని సమాచారం. ఆ నిబంధనల మధ్య షూటింగ్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయంతో కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇవ్వడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈలోపు రాజమౌళి సూచనల ప్రకారం నిర్మాత దానయ్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
కరోనా ఫియర్ ప్రస్తుతం సినిమా రంగాన్ని కూడా వణికిస్తోంది. దేశవ్యాప్తంగా సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చాలా థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేయడంతో, మరికొన్ని రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో సినీ రంగం పరిస్థతి ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read