రాజమౌళి 'షాకింగ్' ట్వీట్!
on Mar 16, 2020
కరోనా వైరస్ దెబ్బకు ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం అని కాకుండా ప్రపంచమంతా అతలా కుతలమవుతోంది. ఇప్పటికే కరోనా వ్యాధికి కారణమైన కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి గురైన వాళ్ల సంఖ్య లక్షా 70 వేలు దాటిపోగా, మరణాలు 6,500 దాటాయి. దాదాపు 6 వేల మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు ప్రతి వారం పది రెట్లు, ఇరవై రెట్లు పెరుగుతూ పోతుండటంతో సర్వత్రా భయాందోళనలు కూడా పెరుగుతున్నాయి. దాని పర్యవసానం ఆర్థిక వ్యవస్థపై పడి ట్రేడ్ మార్కెట్‌లో ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచమే స్తంభించిపోతోందా అన్న విపత్కర పరిస్థితి నెలకొంది.
సినిమా రంగంపై కూడా కరోనా ఎఫెక్ట్ భారీ స్థాయిలో పడింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే సినిమా హాళ్లను, మాల్స్‌ను బంద్ చేశాయి. టాలీవుడ్‌లో షూటింగ్‌లను నిలిపేశారు. ఫలితంగా వందల కోట్ల రూపాయల మేర సినిమా రంగానికి నష్టం వాటిల్లడం తప్పనిసరి. ఈ పరిస్థితులు ఎవరికైనా వణుకు తెప్పించడం సహజం. 'బాహుబలి'తో దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా నీరాజనాలు అందుకుంటున్న రాజమౌళి తాజాగా చేసిన 'కరోనా ట్వీట్' ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. "ప్రపంచం స్తంభించిపోతుండటం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనలు వ్యాప్తి కాకుండా చూడటం అత్యంతావశ్యకం. కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రామాణిక సూచనలను అనుసరించాలి, అలర్ట్‌గా ఉండాలి" అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దాని షూటింగ్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఆ సినిమాలో కొంతమంది విదేశీ తారలు బ్రిటిష్ వాళ్ల పాత్రలను చేస్తున్నారు. విదేశీయుల వీసాలను కేంద్రం తాత్కాలికంగా రద్దు చేయడంతో ఈ సినిమా షూటింగ్‌కు ఆటంకం కలిగినట్లే. ఈ స్థితి మరికొంత కాలం కొనసాగితే 2021 జనవరి 8న 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వస్తుందా?.. అనేది సందేహమే.
రాజమౌళి చేసిన ట్వీట్
Also Read