'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కి రాజమౌళి కొత్త ప్లాన్
on May 8, 2020
'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి కొత్త ప్లాన్ వేశాడు. ప్రస్తుతం కరోనా రక్కసి కోరలు చాచి ఎవరు దొరుకుతారు అని ఆశగా ఎదురుచూస్తున్న వేళ... ప్రస్తుతం ఎవరూ షూటింగ్స్ చేయడం లేదు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్స్ మొదలైతే ఎలా మొదలవుతాయి? ప్రభుత్వం షూటింగ్స్‌కి అనుమతులు ఇస్తే ఎంతమందితో చేసుకోమని చెబుతుంది? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చినట్టు పరిమిత బృందంతో షూటింగ్ చేసుకోమంటే? ముందుజాగ్రత్తగా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కోసం రాజమౌళి కొత్త ప్లాన్ వేశాడు. షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ రీషెడ్యూల్స్ చేస్తున్నామని చెప్పాడు.
"ఏయే సన్నివేశాలకు ఎక్కువమంది జూనియర్ ఆరిస్టులు అవసరం అవుతారు? భారీ సెట్స్ ఏయే సన్నివేశాలకు అవసరం? వీలైనంత తక్కువమందితో ఎలా షూటింగ్ చేయవచ్చు? అని లెక్కలు వేసుకుంటూ రీషెడ్యూల్ చేస్తున్నాం" అని రాజమౌళి చెప్పాడు.
ముందుగా తక్కువమందితో, లోకల్ కాస్ట్ అండ్ క్రూతో తీసే సన్నివేశాలు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే... ఈ సినిమా కోసం కొంతమంది ఫారిన్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఒలీవియా మోరిస్ కూడా ఫారిన్ నుండి రావాలి. ప్రస్తుతం ఫారిన్ నుండి రావడం ఎంత కష్టమో తెలిసిందే. అందుకని, ఈ ప్లాన్ అన్నమాట.
"మా సినిమాకు వర్క్ చేసే టెక్నీషియన్లు, యాక్టర్స్ కొందరు విదేశాల నుండి రావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుండి సెట్స్ వేయడానికి కొందరు హైదరాబాద్ రావాలి. ఇప్పటికి ఇప్పుడు వారు రావడం సాధ్యం కాదు. అందుకని, హైదరాబాద్ లో ఎవరు అందుబాటులో ఉన్నారో చూస్తున్నాం. మొదట ఇక్కడివాళ్ళతో చేసి, తర్వాత ఫారిన్ నుండి రావాల్సిన వాళ్లపై దృష్టి పెడతాం" అని రాజమౌళి వివరించారు.