పవన్ ఓ జోకర్లా మిగిలిపోతాడా?
on Jun 30, 2015
ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్ర్రాలనూ అట్టుడికించింది. గత కొన్ని రోజులుగా.. జనమంతా ఈ టాపిక్‌పై మాట్లాడుకొన్నారు. నేషనల్ మీడియా కూడా దీన్నే ఫోకస్ చేసింది. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం `త్వరలో స్పందిస్తా..` అంటూ ఓ ట్వీట్టు చేసు ఊరుకొన్నాడు. `తల్లిదండ్రులు తిట్టుకొంటూ లేస్తే.. పిల్లలు కొట్టుకొంటూ లేస్తారని` ఓ సామెత ఎగస్ట్రాగా వదిలాడు. ప్రజా, పాలనా విషయాలపై పవన్ మాట్లాడాలని ఇది వరకు ఎవరూ అనుకోలేదు. కనీసం అభిమానులూ ఆశించలేదు. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అంటూ గత ఎన్నికల ముందు గళమెత్తినందు వల్లే... `పవన్ ఎప్పుడు ప్రశ్నిస్తాడా?` అని అభిమానులు, సామాన్య ప్రజానీకం ఎదురుచూడాల్సివస్తోంది. `టాపిక్` వేడి వేడిగా ఉన్నప్పుడు మాట్లాడకుండా... అది చల్లారి చద్దిమూటవుతున్న సమయంలో పవన్ నోరు విప్పి ఏం లాభం? అయినా ఇప్పుడేం మాట్లాడతాడు? మాట్లాడ్డానికి ఏం మిగిలిందని?? చంద్రబాబు బేరాలు తప్పంటాడా? లేదంటే ఫోన్ ట్యాపింగ్ తప్పంటాడా? ఇద్దర్నీ ఏకి పారేస్తాడా? ఏం చేసినా లాభం లేదిప్పుడు?
నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ చర్చ అరివీరభయంకరంగా జరుగుతున్నప్పుడు ఏదో ఒకరి తరపున మాట్లాడి, నిలబడినా... పవన్‌కి ఒక ప్రాంతం నుంచయినా మద్దతు లభించేది. ఇప్పుడు ఆ అవకాశమూ లేదు. విప్పక విప్పక ట్విట్టర్లో నోరు విప్పాడు. అదీ.. `తరవాత స్పందిస్తా` అంటూ. మాట్లాడడానికి ముహూర్తాలు కావాలా? తరవాత అంటే ఎప్పుడు? ఈ విషయం గురించి ఏం మాట్లాడాలో పవన్‌కే స్పష్టత లేదా? అవన్నీ కూడబెట్టుకొని, స్ర్కిప్టు రాసుకొని అప్పుడు మీడియా ముందుకొస్తాడా? జనం తరపున ప్రశ్నిస్తా అనేవాడు, నాయకుడిగా నిలబడాల్సినవాడు ఇలా అనగలడా?? చంద్రబాబుతో బేరాలు కుదర్లేదని, అందుకే తరవాత స్పందిస్తా అని హింటు ఇస్తున్నాడని పవన్ వ్యతిరేక వర్గం జోకులు వేసుకొంటుంది. త్రివిక్రమ్ ఇంకా స్ర్కిప్టు రాయలేదేమో అంటూ సెటైర్లు వేస్తోంది. వీటిక్కూడా పవన్ సమాధానం చెబుతాడా?? ఓ సమస్యపై రెండు రాష్ట్ర్రాలు నువ్వా, నేనా? అని వాదులాడుకొంటున్నప్పుడు గొంతెత్తని పవన్.. ఇక మీదట స్పందిస్తాడన్న ఆశల్లేవు.
పవన్ పూర్తిగా రాజకీయ నాయుడిలా రూపాంతరం చెందలేదనిపిస్తోంది. తనలోని `నాయకుడి కోణం` అప్పుడప్పుడూ కనిపించి చప్పున చల్లారిపోతుంది. ఓసారి ఆవేశంగా మాట్లాడేస్తాడు. కొంతకాలం నోరు విప్పడు. ఇలాగైతే.. జనం పవన్‌ని ఏమని నమ్మాలి? ఆంధ్రలో తదుపరి ప్రత్యామ్నాయం పవన్ కల్యాణే అని నమ్ముతున్న ఆయన అభిమాన వర్గం కూడా పవన్ చేష్టలకు నీరసించిపోతోంది. పవన్ ఇప్పుడైనా మేల్కొనాలి. స్పష్టమైన రాజకీయ నాయకుడిలా కాకపోయినా నిజాయతీ పరుడైన ప్రజల మనిషిగా అయినా స్పందించాలి. లేదంటే... పాలిటిక్స్ లో చిరులానే పవన్ కూడా ఓ జోకర్లా మిగిలిపోతాడు.