చిరు కత్తికి తుప్పట్టేసింది
on Dec 16, 2015
హమ్మయ్య... చిరంజీవి కి ఎట్టకేలకు సినిమా చేసే మూడొచ్చింది. 150వ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తాడా, అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన కూడా ఇదిగో అదిగో అంటూ.. ఊరించాడు. తన సినిమా కొన్నేళ్లుగా వార్తల్లో ఉంటేట్టు చూసుకొన్నాడు. ఎటు వెళ్లాలో, ఏ కథ ఎంచుకోవాలో, ఏ దర్శకుడ్ని నమ్మాలో తెలీక.. ఏదీ తేల్చుకోక తర్జనభర్జనలు పడ్డాడు. చివరికి అందరికీ నీరసం వచ్చేసి, ఇక చిరు సినిమా చేస్తే ఎంత చేయకపోతే ఎంత? అని అనుకొంటున్న తరుణంలో వినాయక్‌ని పిలిచి.. కత్తి రీమేక్ తన చేతిలో పెట్టాడు.
చిరు సినిమా మొదలవుతుందన్న ఆనందం ఒకవైపు అయితే.. ఆలస్యమైపోయినందున ఆ క్రేజ్ చల్లారిపోయిందన్న బాధ ఇంకోవైపు. పోయి పోయి కత్తి రీమేక్ ఎంచుకోవడం ఏమిటన్ననిట్టూర్పులూ వినిపిస్తున్నాయి. చిరు మనసు పెడితే మంచి కథలు దొరికేవి కదా.. అంటున్నారు. అయితే చిరు మాత్రం తన వంతుగా చాలా ట్రైల్సే వేశాడు. కానీ తన ఆశలకు, అంచనాలకు ఎవ్వరూ దగ్గరికి రాలేదు. దాంతో వద్దన్న కత్తి రీమేకే దిక్కయ్యింది. వదులుకొన్న వినాయకే... మళ్లీ కావల్సివచ్చింది. కత్తి ని చిరు తన 150వ సినిమా కోసం రీమేక్ చేస్తున్నాడన్న వార్త బయటకు పొక్కి చాలాకాలమైంది. అప్పటి నుంచి తమిళ కత్తిపై చిరు అభిమానులు ఫొకస్ పెట్టారు. విజయ్ స్థానంలో చిరుని ఊహించుకోవడం మొదలెట్టారు. చేస్తే బెటరా, చేయకపోతే బెటరా అనే లెక్కలు వేసుకొన్నారు. చిరు సినిమా లేటయ్యేసరికి... కత్తిపై చాలామందికి ఆసక్తిపోయింది. కథ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి, ఇప్పుడంత ఇంట్రస్ట్ ఉండదు. అందుకే కత్తికి ఎప్పుడో తుప్పట్టేసిందని చెప్పుకొని నవ్వుకొంటున్నారు.
అయితే చిరు ఉద్దేశం మాత్రం వేరు. సెకండాఫ్‌లో భారీ మార్పులు చేసి, తన స్టైల్‌కి తగ్గట్టు మార్చుకోవాలని చూస్తున్నాడు. ఇద్దరు క్రేజీ హీరోయిన్లను తీసుకొచ్చి.. సినిమాకి హైప్ ఇవ్వాలన్నది చిరు ఆలోచన. చిరు కూడా చివరికి హీరోయిన్లపైనా, బిల్డప్పులపైనా ఆధారపడిపోతున్నాడన్నమాట. ఏం చేస్తాం..?? ఏజ్ బార్ హీరోయిజం ఇలానే ఉంటుంది మరి. మొత్తానికి చిరు సినిమా ఫిక్సయ్యింది. అందుకే.. కొన్ని సెటైర్లు వినిపిస్తున్నా అవేం పట్టించుకోకుండా.. పండగ చేసుకొంటున్నారు చిరు ఫ్యాన్స్. ఇక మెగా హంగామా మొదలైనట్టే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
