చిరు 'సందేహాలు'
on May 15, 2015
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరతీస్తూ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అని క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ కి నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. ఎందుకంటే గతంలో పూరీకి ఎన్ని ప్లస్ లు ఉండేవో ఇప్పుడన్ని మైనస్ లు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ బద్రీతో కెరీర్ మొదలెట్టిన పూరీ జగన్నాథ్ కి ఆరంభంలోనే మంచి మార్క్స్ పడ్డాయి. కళ్యాణ్ కు కూడా ఆ సినిమా బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత అల్లుఅర్జున్ తో దేశముదురు తెరకెక్కించాడు. ఆర్యతో ఓ మెట్టుపైకెక్కిన అల్లు అర్జున్ కి ఫుల్ మాస్ ఇమేజ్ ఇచ్చి...లుక్ మార్చేశాడు. మొత్తానికి బన్నీ కెరీర్లో దేశముదురు సూపర్ డూపర్ హిట్. ఇక మెగాఫ్యామిలీలో మరో హీరో రామ్ చరణ్ తేజ ఎంట్రీ మూవీ చిరుత. చిరుత కూడా సూపర్ హిట్టవకపోయినా పర్వాలేదని పించింది. పాటలు, హీరోయిన్ నటన, పూరీ డైరెక్షన్ కి మంచిమార్కులే వేశారు. ఆ సినిమాలో అంతో ఇంతో మైనస్ అంటే రామ్ చరణ్ తేజ అని ఒప్పుకోకతప్పదు.
అయితే మెగా హీరోలతో మొదటి సినిమా హిట్టుకొట్టిన పూరీ అదే హీరోలతో రెండో సినిమా తీసి బోల్తాపడ్డాడు. పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతోఈ రెండూ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపర్చాయి. చెర్రీతో ఇప్పటి వరకూ ఇంకా ట్రై చేయలేదు కానీ నాగబాబు కొడుకు వరుణ్ తేజతో త్వరలోనే ఓ చిత్రం తీయనున్నాడనే టాక్ వచ్చింది. ఆ సినిమా కూడా హిట్టైతే మెగా హీరోలతో పూరికి తొలిచిత్రం హిట్టవుతుంది అనే సెంటిమెంట్ బలపడుతుంది.
ఈ లెక్కన చూస్తే చిరంజీవితో పూరీకి ఇదే తొలిచిత్రం కాబట్టి గత సెంటిమెంట్ ప్రకారం హిట్టవుతుందేమో? కానీ అప్పట్లో పూరీ జగన్నాథ్ కి ఇప్పటి పూరీ జగన్నాథ్ కి చాలా తేడా ఉంది. అందుకే భయపడుతున్నాం అంటున్నారు మెగా ఫ్యాన్స్. అప్పట్లో పూరీ ఓ బ్రాండ్. సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్న రవితేజకి లైఫ్ ఇచ్చిందే పూరీ. అతిగా హడావుడి చేయకుండా ముందే టైటిల్ ప్రకటించేసి...తక్కువ సమయంలో సినిమా పూర్తిచేసేస్తాడు. ఏళ్ల తరబడి సినిమాలు సాగదీసేవాళ్లతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్. కానీ ఈ మధ్య ఆహడావుడిలో పడి కథలో క్వాలిటీ మిస్సవుతోంది. అందుకు ఫలితమే వరుస ఫ్లాప్ లు. కెమెరామెన్ గంగతో రాంబాబు నుంచి దాదాపు ఆరు సినిమాలు ఫ్లాప్. హార్ట్ ఎటాక్, టెంపర్ బాగున్నాయి అనిపించినా కమర్షియల్ గా సక్సెస్ అవలేకపోయాయి. పైగా లాంగ్ గ్యాప్ తర్వాత ఫామ్ లోకి వచ్చిన నితిన్ ని మళ్లీ కష్టాల్లోకి నెట్టేశాడు పూరీ. దీంతో పోయి పోయి చిరంజీవి....ఈ దర్శకుడిని ఎందుకు ఎంచుకున్నాడా అని టెన్షన్ పడుతున్నారు చిరు అభిమానులు.
మరో గందరగోళం ఏంటంటే ..చిరు 150వ సినిమాకి బండ్లగణేశ్ నిర్మాత అంటున్నారు. ఈ లెక్కన పూరీ-గణేశ్ కాంబినేషన్లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో, టెంపర్ రెండూ సక్సెస్ కాని ప్రాజెక్టులే. దీంతో ఇదో రిస్కు అనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రామ్ చరణ్ నిర్మాత అయినా పెద్దగా కలిసొస్తుందనే నమ్మకం లేదు. అన్న కొడుకుపై మోజుతోనే ఆరెంజ్ తీసి రోడ్డున పడ్డాడు నాగబాబు. పవన్ సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నాడు. ఈ లెక్కన చిరు కి చరణ్ హిట్టివ్వలేడోమో అంటున్నారు. నిర్మాతల సంగతి పక్కనపెడితే...దర్శకుడిగా మళ్లీ ఫామ్ లోకి రావడానికి పూరికి ఇదో మంచి ఛాన్స్.
అయినా ఆలూ లేదు చూలూ లేదన్నట్టు ఇంకా చిరంజీవి సినిమాకి కొబ్బరికాయే కొట్టలేదు అప్పుడే ఇన్ని సెంటిమెంట్లా అంటున్నారు. ఏది ఏమైనా పొలికల్ గా ఫెయిలైన చిరు మళ్లీ హీరోగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్న సినిమా కాబట్టి ఆచితూచి అడుగేయాల్సిందే. కాదు కూడదు అనుకుంటే ఇండస్ట్రీలోనూ చిరు పరిస్థితి అయోమయమే! .