ఆదిమూలం రాజీనామా? సత్యవేడుకు ఉప ఎన్నిక?

తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదు అయింది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నంబర్లు 105, 106ల్లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటిఎన్నికల సందర్భంగా జంప్ అయిన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తనవెంట తెచ్చుకున్నారు. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారు. వైసీపీలో అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకోరుగానీ, తెలుగుదేశంలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాసలీలల గురించి బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తుంది.  ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం వుంది. మరి ఆదిమూలం మళ్ళీ తన సొంతగూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా వుంచితే, ఉప ఎన్నికలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జె.డి.రాజశేఖర్‌కి టీడీపీ టిక్కెట్ దక్కాల్సి వుంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టిక్కెట్ ఆదిమూలానికే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జె.డి.రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఆదిమూలం గెలుపుకు తనవంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జె.డి.రాజశేఖర్‌కే టిక్కెట్ దక్కే అవకాశం వుందని తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహం ఎలా వుండబోతోందో చూడాలి. ఆదిమూలానికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే సత్యవేడు నుంచి పోటీ చేయిస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి. మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ, సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద వున్న ‘11’ ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం వుంది.
Publish Date: Sep 6, 2024 8:03PM

పిసిసి అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం

తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదవికి మరో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ పోటీ పడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇకనుంచి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని ఎఐసిసి పేర్కొంది. రెండు వారాలక్రితమే పిసిసి అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ గౌడ్ పేరు అనధికారికంగా ఖరారైనప్పటికీ శుక్రవారం అధికారికంగా ఖరారైంది. మహేష్ నియమితులైన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
Publish Date: Sep 6, 2024 6:25PM

తోడేళ్లు పగబడతాయా.. ప్రతీకారం తీర్చుకుంటాయా?

తోడేళ్లు పగబడతాయా? ప్రతీకారం తీర్చుకుంటాయా? కక్షగట్టి వెంటాడి, వేటాడి మరీ ఉసురు తీస్తాయా? అంటే ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో జరుగుతున్న వరస సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ ఔననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు.  ఇంత కాలం మనం పాములు పగబడతాయనే విన్నాం. అయితే పాములు పగబట్టడం అన్నది ఉట్టి మూఢనమ్మకమేననీ అందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవనీ తేలిపోయింది. ఇక జంతువులు పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయన్న మాటే ఇప్పడి దాకా మనం వినలేదు. కానీ అటవీ అధికారులు మాత్రం తోడేళ్లు పగబడతాయనీ, అందుకు బహ్రైచ్ లో తోడేళ్లు జరుపుతున్న వరుస దాడులే నిదర్శనమనీ చెబుతున్నారు.  తోడేళ్లు కూడా మనుషుల్లాగే సామూహికంగా జీవనం సాగిస్తాయనీ, వాటి మధ్య మనుషులకున్నంతగా గాఢమైన మమతానుబంధాలు పెనవేసుకుని ఉంటాయనీ చెబుతున్నారు. అటువంటి తోడేళ్ల గుంపులోని ఓ రెండు పిల్ల తోడేళ్లు ఓ ట్రాక్టర్ గుద్దడంతో చనిపోయాయి. ఆ సంఘటన జరిగి ఆరు నెలలు దాటింది. సరిగ్గా ప్రమాదంలో రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచీ అంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయి. గత ఆరు నెలలుగా తోడేళ్లు తమ ప్రతీకార దాడులతో ఆరడజను మందిని చంపేసి పీక్కు తిన్నాయి. మరో 36 మందిని తీవ్రంగా గాయపరిచాయి. అటవీ అధికారులు గ్రామాన్ని  తోడేళ్ల బెడద నుంచి విముక్తి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.   బహ్రైచ్ గ్రామంపై దాడులు చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న తోడేళ్ల గుంపును కాల్చి చంపేందుకు యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.   
Publish Date: Sep 6, 2024 5:54PM

ముంపుప్రాంతాల్లో  చంద్రబాబు ఏరియల్ సర్వే 

భారీ వర్షాల వల్ల ఎపి అతలాకుతలమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. నిన్న బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రికి  తృటిలో రైలు ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.    కాగా ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. . బుడమేరు కొల్లేరులో కలిసే ప్రక్రియను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు కబ్జా అయిన వైనాన్ని చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజి నీళ్లు  కృష్ణానదిలో కలిసే తీరు , అక్కడ్నుంచి సముద్రంలో కలిసే తీరు చంద్రబాబు ఏరియల్ సర్వేలో తెలుసుకున్నారు. 
Publish Date: Sep 6, 2024 5:44PM

ఈటలకు ఝలక్.. బీజీపీ తెలంగాణ పగ్గాలు బండికేనా?

తెలంగాణలో బీజేపీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కృత నిశ్చయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా సంపాదించలేకపోయింది. ఎప్పటిలాగే సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో  సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అవి కొంత మేర ఫలించి కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడం వల్లనే బీజేపీ ఆ మాత్రం లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగిందని కమలనాథులకు అర్ధమైంది.  ఇప్పుడు ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉద్వాసన పలికిన బండి సంజయ్ కే మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందని రాష్ట్ర బీజేపీ శ్రేణులలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.వాస్తవానికి గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కట్టబెట్టనున్నారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈటలకు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించే విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది. కిషన్ రెడ్డినే కొనసాగించింది. అయితే కిషన్ రెడ్డి ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని సార్వత్రిక ఎన్నికల తరువాత నుంచీ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న విషయంలోనే తేల్చుకోలేకపోతోంది.  పార్టీ అధ్యక్ష పగ్గాలు ఈటలకు అప్పగి స్తారన్నది దాదాపుగా ఖరారైందని కూడా అంతా భావించారు. అయితే అనూహ్యంగా బండి సంజయ్ రేసులోకి రావడం, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో బీజేపీ హైకమాండ్ వెనక్కు తగ్గింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు బండి చేతుల్లో ఉన్న కాలంలో  బీజేపీకి రాష్ట్రంలో మంచి మైలేజీ ఉందని, ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాతనే పార్టీలో కుమ్ములాటలు, గ్రూపులు ఎక్కువయ్యాయన్న భావనలో పార్టీ హైకమాండ్ ఉంది. దీంతో ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబట్టడాన్ని బండి వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. అసలు వాళ్లూ వీళ్లూ అని వెతకడం ఎందుకు బండినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే పోలా అన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్ లో వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తాజాగా ఖమ్మంను అతలాకుతలం చేసిన భారీ వరదల సమయంలో  కేంద్ర మంత్రి హోదాలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం, ఆయనకు పోటీగా ఈటల మరో బృందంతో పర్యటనకు రెడీ కావడం ఇద్దరి మధ్యా విభేదాలను ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చింది. హై కమాండ్ అనుమతి లేకుండా బండి వరద ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉండదని అంటున్నారు. పార్టీ హైకమాండ్ బండినే ప్రోత్సహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని చెబున్నారు.   
Publish Date: Sep 6, 2024 5:28PM

మన న్యాయ వ్యవస్థ పవర్ ఇది!

మన భారతీయ న్యాయ వ్యవస్థ చలా గొప్పది. అపరాధులను వదిలిపెట్టదు. నిర్దోషులను శిక్షించదు. న్యాయం విషయంలో తన, పర భేదం చూపించదు. ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ వున్న దేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి. మన న్యాయ వ్యవస్థ మీద మనకున్న గౌరవాన్ని మరింతగా పెంచే సంఘటన బిహార్‌లో జరిగింది. 34 సంవత్సరాల క్రితం 20 రూపాయల లంచాన్ని డిమాండ్ చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ని వెంటనే వెతికి అరెస్టు చేయాలని గౌరవనీయులైన న్యాయమూర్తి గారు ఆదేశించారు. నేరం అనేది చిన్నదా.. పెద్దదా అనేది ముఖ్యం కాదు.. నేరం చేసిన వారికి శిక్ష పడాలి. ఇది ముఖ్యం.  అసలేం జరిగిందంటే, 1990లో.. అంటే 34 సంవత్సరాల క్రిందట బిహార్‌లోని సహర్సా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించే సురేష్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ ప్లాట్‌ఫామ్ మీద కూరగాయల మూటతో వున్న సీతాదేవి అనే మహిళని ఆపాడు. తనకు 20 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె అతనికి 20 రూపాయలు ఇస్తున్న సమయంలో రైల్వేస్టేషన్ ఇన్‌ఛార్జ్ చూశాడు. కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు. 1999లో సురేష్ ప్రసాద్ బెయిల్ మీద బయటకి వచ్చి పరారయ్యాడు. దాంతో అతని బెయిల్ రద్దు చేసి అరెస్టు వారెంట్ జారీ చేశారు. సురేష్ ప్రసాద్ తప్పు అడ్రస్ ఇవ్వడంతో అతని ఆచూకీ దొరక్క పోలీసులు ఇప్పటికీ అతని కోసం వెతుకుతూనే వున్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసు గౌరవనీయ న్యాయస్థానం దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచాలని డీజీపీని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న కేసుల పరిష్కరించాలన్న సదుద్దేశంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ నిందితుడు సురేష్ ప్రసాద్ దొరకాలి. అతని నేరానికి తగిన శిక్ష పడాలి. 
Publish Date: Sep 6, 2024 3:50PM

ఓహో.. జగన్ టూర్ వాయిదా ఇందుకా?

మామూలుగా అయితే జగన్ ఈపాటికి లండన్‌లో విహరిస్తూ వుండాలి. కానీ అలా జరగలేదు. ఈనెల 3 నుంచి 25 వరకు లండన్‌కి వెళ్ళిరావడానికి సీబీఐ కోర్టు నుంచి జగన్ పర్మిషన్ తీసుకున్నారు. నిజానికి ఆయన మాటమాటకీ లండన్ ఎందుకు వెళ్తున్నారోగానీ, ఈసారికి మాత్రం కుమార్తె పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నట్టుగా పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ వచ్చిన దగ్గర్నుంచి సామాను సర్దుకునే పనిలో వున్న జగన్, మిగతా విషయాలేవీ పట్టించుకోకుండా ప్రయాణం మీదే దృష్టిపెట్టారు. కేసులు ముంచుకొస్తున్నా, తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నా, తాను తిరిగి వచ్చేసరికి పార్టీ మొత్తం ఫినాయిల్ వేసి కడిగినట్టు క్లీన్ అయ్యే అవకాశాలు వున్నాయని అర్థమవుతున్నా ఎంతమాత్రం పట్టించుకోకుండా, నివారణ చర్యలేవీ చేపట్టకుండా లండన్ గురించే ఆలోచిస్తున్నారు. అలాంటి జగన్ మూడో తారీఖున లండన్‌కి చెక్కేయాల్సి వున్నా ఆ పని చేయలేదు. ఇదేంటబ్బా అనుకుంటే, ఆయన భజన బ్యాచ్ ఒక పాయింట్‌ని ప్రచారం చేయడం ప్రారంభించారు. విజయవాడ వరదల్లో మునిగిపోయింది కాబట్టి వాళ్ళని పరామర్శించి, ఆదుకోవడానికే జగన్ లండన్ టూర్‌ని వాయిదా వేసుకున్నారు అని చెప్పుకుంటూ తిరిగారు. పోనీలే, వరద బాధితులను ఆదుకుంటారేమో అని కొంతమంది అమాయకులు అనుకున్నారు. జనాన్ని పరామర్శించడం అనే పేరుతో బయటకి వచ్చిన జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విషం కక్కడం మినహా చేసిందేమీ లేదు. మూడో తారీఖు అయిపోయింది.. నాలుగో తారీఖు అయిపోయింది.. ఐదో తారీఖు కూడా అయిపోయింది. రోజులు గడిచిపోతున్నాయిగానీ, జగన్ లండన్ వెళ్ళడం లేదు. తాను లండన్‌కి వెళ్తే పార్టీ ఖాళీ అయిపోతుందన్న భయంతో జగన్ లండన్‌కి టూర్ రద్దు చేసుకున్నారా అనే సందేహాలు కలుగుతున్న నేపథ్యంలో అసలు విషయం బయటకి వచ్చింది. అదేంటంటే, జగన్ పాస్‌పోర్టు రద్దయింది. ఇంతకాలం జగన్‌కి ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాట్ పాస్‌పోర్టు వుండేది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి డిప్లొమాట్ పాస్‌పోర్టు రద్దయింది. జగన్ మళ్ళీ సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగన్‌కి సంవత్సరం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీని మీద జగన్ అప్పీల్ చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు రావాలి.. ఆ తర్వాత పాస్‌పోర్టు రావాలి. అప్పుడే జగన్ టూర్ వుంటుంది. మరి ఈ వ్యవహారం మొత్తం పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో... అప్పటికి సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతి గడువు పూర్తి అవుతుందేమో అనే సందేహాలు కూడా వున్నాయి.
Publish Date: Sep 6, 2024 3:25PM

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి  కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జిట్టా  యశోదా హాస్పిటల్ లో చికిత్సపొందుతూ  మరణించారు జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం భువనగిరికి కుటుంబసభ్యులు తరలించారు. ఈ సాయంత్రం  భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.  తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి  పాత్ర మరువలేనిది.  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణానంతరం  జిట్టా కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం యువ తెలంగాణ పార్టీ'ని స్థాపించారు.  ప్రత్యేక తెలంగాణ బిల్లుకు సహకరించిన బీజేపీలో యువతెలంగాణలో  విలీనం చేశారు.  తెలంగాణలో రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లో న్యాయం జరగదని భావించి జిట్టా కెసీఆర్ నాయకత్వంలోని టిఆర్ ఎస్ లో చేరారు.  గత ఎన్నికల్లో జిట్టాకు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారని భంగపడ్డారు.  ఆ తర్వాతే జిట్టా ఆరోగ్య పరిస్థితి విషమించింది. జిట్టా తిరిగిరాని లోకాలకు చేరుకోవడం తెలంగాణవాదులను కలచివేసింది. 
Publish Date: Sep 6, 2024 3:16PM

 ఇస్లాంలో కోపం నిషిద్దం

జాఫర్ కు నలుగురు అన్నదమ్ములు . జాఫర్ దుబాయ్ లోనే డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు. ఆర్థికంగా చితికిపోయిన జాఫర్ అన్నదమ్ములు వారసత్వంగా వచ్చిన ఇల్లును విక్రయించాలనుకుంటారు. జాఫర్ కొడుకు సిరాజ్ ఆ ఇల్లును తనకే అమ్మాలని కండిషన్ పెట్టాడు. డబ్బులు ఎవరు ఇస్తారో వారికే విక్రయిస్తామని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. జాఫర్ కు వచ్చే భాగాన్ని వదిలేసి మిగతా ముగ్గురు అదే బస్తీలో ఉన్న ఖాన్ కు విక్రయించాలనుకుంటారు. సిరాజ్ వారిని వేధించడంతో అదే బస్తీలో పేరు గడించిన మౌలానా దగ్గరికి చేరుకున్నారు.  సిరాజ్ బాధితులు: సలాం వాలేకుం మౌలానాసాబ్  మౌలానా: వాలేకుం సలాం భాయ్ ఆయియే క్యాబాత్ హై బహుత్ దిన్ కే బాద్  సిరాజ్ బాధితులు: జీ మౌలానా సాబ్ . సిరాజ్  గుస్సాకా షికార్ బన్ గయే  హమ్.  ఘర్ మే  హమారే ఇస్సా  బేచ్ నే నైదేరా. జాఫర్ బయ్ కే ఇస్సా చోడ్ కే బేచ్ నే జారే. ఫిర్ బీ  జాఫర్ బాయ్ కా  బేటా  సిరాజ్ బేచ్ నే నైదేరా. హర్ దిన్ గాలి దేరా ..కుచ్ నా కుచ్ రాస్తా బతాయియే . ఇస్లాంలో కోపానికి తావు లేదు. అల్లాను సంతోషపరచడమే నేర్చుకోవాలి.  జన్నత్(స్వర్గం), జహన్నమ్(నరకం) రెండుమార్గాల చాయిస్ ఇచ్చేశాడు. మనమే చాయిస్ ఎంచుకోవాలి. కోపం కూడా మంచిదే కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. గుర్రం మీద  స్వారీ  చేయడం ఆనందంగా ఉంటుంది  కానీ నేర్పుతో గుర్రపు స్వారీ చేయాలి. గుర్రానికి ట్రయినింగ్ అవసరం. ట్రయినింగ్ వల్ల గుర్రం మీద కూర్చొని గమ్య స్థానాలకు చేరుకోగలం. అదే విధంగా కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే జీవితమనే గుర్రం మీద స్వారీ చేయగలం. చాలామంది నిత్యం కోపం ప్రదర్శిస్తారు. కోపం తెచ్చుకోవడం అంటే మనల్ని మనం దహనం చేసుకోవడమే. ఓపిక, సహనం ఇస్లాంలో అతిముఖ్యమైన లక్షణాలు. నబీ కోరుకున్నది కూడా ఇదే. ఎవరు స్వర్గానికి వెళతారు ఎవరు నరకానికి వెళతారో తెలియదు కానీ వారికుండే లక్షణాలే స్వర్గ,నరక ద్వారాలను నిర్ణయిస్తాయి. ఐదుసార్లు ప్రతిరోజు నమాజు చేయడం స్వర్గానికి వెళ్లే మొదటిమెట్టు. నా తమ్ముడుకి కోపం వస్తే ఊరుకోడు. నేను మాత్రమే కంట్రోల్ చేయగలను అని ఇటీవల తెలంగాణకు చెందిన పార్లమెంటుసభ్యుడు ఒకరు గొప్పలు చెప్పుకున్నాడు. ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు  యువత ఎక్కువగా ఈ డైలాగ్ ను గొప్పగా చెప్పుకుంటున్నారు. కోపం అనేది నెగెటివ్ పదం. కోపాన్ని కూడా అదేదో ఆభరణంగా అలంకరించుకోవడం అంత మూర్ఖత్వం మరోటి లేదు. కోపం వల్ల వ్యక్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో తిట్లకు కొరత లేదు. కోపంగా ఎవరైనా అరిస్తే సైలెంట్ గా ఉండిపోవాలి. ఆ తిట్లన్నీ ప్రకృతిలోని పంచభూతాల్లోకి వెళ్లిపోతాయి.  ప్రతిగా మనకు కోపం వస్తే దెబ్బతినేది మన ఆరోగ్యమే.  కోపం అనేది మన కంట్రోల్ లో ఉండాలి. కోపం కంట్రోల్ లో మనం ఉండకూడదు. సమాజంలో ఉన్న పలుకుబడి ఉన్న వ్యక్తులకు కోపం ఎక్కువగా వస్తుంది. వారికున్న ఈగో సమస్య వల్ల ఎవరైనా తిడితే భరించలేరు. నన్ను చాలామంది మౌలానా మీరు చాలా గొప్ప వ్యక్తి అంటారు. ప్రశంసల వల్ల వ్యక్తిలో ఈగో వచ్చేస్తుంది. ఇది ప్రమాదకరం. కోపం రాకుండా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. నేను నిర్వహిస్తున్న మదర్సాలో విద్యార్థులు  ఏడెనిమిదిగంటలు నిద్రపోవాలి.  క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. కోపం వల్ల బద్దకం వస్తుంది. బద్దకం ఉంటే వ్యక్తి నమాజు కూడా చేయలేడు. నమాజు చేయడం వల్ల అల్లా సంతోషిస్తాడు.   గుస్సా అల్లాకే  తరఫ్ సే నియమిత్ హై  అంటూ మౌలానా వివరించాడు. సిరాజ్ కోపంతో తిట్టిన తిట్లకు స్పందిచకపోవడమే మంచిది అని మౌలానా హితవు పలికారు. -బదనపల్లి శ్రీనివాసాచారి 
Publish Date: Sep 6, 2024 1:27PM

సజ్జల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ అధికారంలో ఉండగా సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కళ్లు, నోరుగా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సజ్జల చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా, చంద్రబాబు నాయుడి నివాసంపైనా జరిగిన దాడుల వెనుక సూత్రధారిగా సజ్జల పేరే ప్రముఖంగా బయటకు వస్తోంది. ఆ దాడుల కేసుల్లో నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిలో చాలా మంది ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలా పరారీలోకి వెళ్లిన వాళ్లలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నందిగం సురేష్ అరెస్టు కావడానికి సజ్జల ద్వారా ఆయన కదలికల గురించి వచ్చిన లీకులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది వేరే సంగతి. మొత్తానికి నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసి మంగళగిరి తీసుకువచ్చి విచారించారు. ఆ విచారణలో నందిగం సురేష్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం.  తెలుగుదేశం కార్యాలయంపై దాడి ఉద్దేశమే తనకు లేదనీ, కానీ అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదేశాల మేరకే తాను అక్కడకు వెళ్లాననీ, దాడికి పాల్పడటం సమంజసం కాదని భావించి వెనుదిరిగాననీ నందిగం సురేష్ విచారణలో పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అంతే కాకుండా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడులకు మందిని సమీకరించడం నుంచి దాడి చేసేలా రెచ్చగొట్టడం వరకూ వెనుకున్నది సజ్జలేనని నందిగం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు, పరారీలో ఉన్నమాజీ మంత్రి జోగు రమేష్ కూడా అజ్ణాతంలోనే ఉన్నారు. అయితే ఆయన అజ్ణాతంలోకి వెళ్లడానికి ముందు దాడికి సంబంధించి తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  అప్పటి ముఖ్య సలహాదారు సూచన మేరకే చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. జగన్ ను ప్రతిపక్షం విమర్శస్తుంటే మౌనంగా ఎలా ఉంటారు అంటూ తమను సజ్జల అప్పట్లో రెచ్చగొట్టారని పలువురు వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి.  మొత్తంగా తెలుగుదేశం కార్యాలయంపైనా, చంద్రబాబు నివాసంపైనా జరిగిన దాడుల వెనుక సజ్జల ఆదేశాలు, మార్గదర్శనమే ఉందని వైసీపీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి. విచారణలో కూడా అదే నిర్ధారణ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో సజ్జల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  
Publish Date: Sep 6, 2024 1:19PM

కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు సమన్లు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది.  మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందంటూ  భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు కేసీఆర్, స్మితా సబర్వాల్ కు  అక్టోబర్ 17న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.  ఈ పిటిషన్ ను విచారణలో భాగంగా గతంలోనే కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు తరఫున  అడ్వకేట్లు కోర్టుకు హాజర య్యారు. అలాగే మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవధాని, శ్రావణ్ రావు హాజరయ్యారు. ఇక ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహా రెడ్డి హాజరయ్యారు.   అయితే, మాజీ కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాకపోవడం, వారి తరఫున లాయర్లు కూడా అప్పియర్ కాకపోవడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని  మరోసారి సమన్లు జారీ చేసింది.  
Publish Date: Sep 6, 2024 11:57AM

నందిగం సురేష్ ను సానుభూతి కోసం సొంత పార్టీ నేతనే పట్టించేశారా?

ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లలను తానే తినేస్తుందంటారు. అలా వైసీపీ కూడావైసీపీ కూడా పాములాగే  రాజకీయ లబ్ధి కోసం సొంత పార్టీ నేతలనే పట్టించేస్తుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేయడానికి ఆ పార్టీ కీలక నేత, అధికారంలో ఉన్న సమయంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా లీకైన సమాచారమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్టు కావడానికి వైసీపీ కీలక నేత లీక్ చేసిన సమాచారమే కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మాజీ మంత్రి, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా అదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉండగా పోలీసులు ఇప్పటి వరకూ ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. వారిలో ఒకరు మాజీ ఎంపీ నందిగం సురేష్. మిగిలిన నిందితుల్లాగానే ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించగానే నందిగం సురేష్ కూడా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఆయన ఒక్కరి కోసమే కాదు.. ఈ కేసులో నిందితులైన దేవినేని అవినాష్, తలశిల తదితరులు కూడా తమ ఫోన్లు ఆఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అయితే వీరందరిలో నందిగం సురేష్ ఆచూకీని మాత్రమే పోలీసులు కనిపెట్టగలిగారు. ఆయన హైదరాబాద్ వెళ్లారు, అక్కడ నుంచీ కూడా మరో ప్రదేశానికి పారిపోయే ప్రయత్నంలో ఉండగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు ఛేజ్ చేసి పట్టుకుని మరీ మంగళగిరికి తరలించారు. ఆ తరువాత కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అది సరే అసలు నందిగం సురేష్ ఆచూకీ అంత కచ్చితంగా పోలీసులకు లీక్ చేసింది ఎవరు అంటే సజ్జల అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆ పార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు లీక్ చేశారని డొక్కా అంటున్నారు. ఈ కేసులో నందిగం సురేష్ సమాచారాన్ని మాత్రమే పార్టీ ఎందుకు లీక్ చేసి అరెస్టయ్యేలా చేసింది. మిగిలిన వారిని ఎందుకు కాపాడుకుంటోంది? అంటే నందిగం సురేష్ దళితుడు కావడమే కారణమని అంటున్నారు.   దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగం అరెస్టును తమకు అనుకూలంగా మలచుకుని ప్రజలలో సానుభూతి పొందాలన్నదే వైసీపీ వ్యూహంగా ఆయన చెబుతున్నారు.  దళితుడిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి ప్రజలలో సానుభూతి పొందాలన్న వ్యూహంలో భాగంగానే ఆయన ఆచూకీని పోలీసులకు లీక్ చేశారన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. ఇటువంటి వికృత రాజకీయాలు వైసీపీ అలవాటేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందుకు జగన్ సొంతబాబాయ్ హత్య ఘటనను ఉదాహరణగా చూపుతున్నారు. 
Publish Date: Sep 6, 2024 11:19AM

వెంటిలేటర్ పై సీతారాం ఏచూరి

సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏ చూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో  ఢిల్లీలోని ఎయిమ్స్  వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  చెబుతున్నారు.  సీతారాం ఏచూరి గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత నెల 19వ తేదీ నుంచీ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం (సెప్టెంబర్ 6) తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.  
Publish Date: Sep 6, 2024 10:37AM

నడకదారి భక్తుల కోసం టీటీడీ పది వేల టికెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తుల కోసం ఇక నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పది వేల టికెట్లు జారీ చేయనుంది. ఇప్పటి వరకూ కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రెండు నడక దారులు ఉన్నాయి. వాటిలో ఒకటి అలిపిరి కాగా రెండోది శ్రీవారి మెట్లు దారి.  ఈ రెండు మార్గాలలో వెళ్లే వారి కోసం టీటీడీ ఇప్పటి వరకూ మూడు వేల టికెట్లు జారీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు నడక దా4రి భక్తుల సౌకర్యార్థం ఆ సంఖ్యను పది వేలకు పెంచింది. వీటిలో శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వచ్చే భక్తుల కోసం నాలుగు వేల టికెట్లు, అలిపిరి మార్గం నుంచి నడిచి వచ్చే భక్తుల కోసం ఆరువేల టికెట్లు జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. టీటీడీ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తం అవుతోంది.  గతంలో  వైసీపీ హయాంలో నడకదారి భక్తుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. వన్యప్రాణుల భయం అంటూ రోజుల తరబడి నడకదారులను మూసివేయడం, ఆ తరువాత కూడా భక్తులలో ధైర్యం నింపడానికి బదులు వారికి కర్రలు ఇచ్చి వన్యప్రాణులు వస్తే మీరే తరిమి కొట్టుకోండి అంటూ వన్యప్రాణులు నడక మార్గంలోకి రాకుండా మేం ఏం చేయలేమని చేతులు ఎత్తేయడం కారణంగా నడకదారిలో తిరుమలేశుని దర్శనానికి వెళ్లేందుకు భక్తులు భయపడే పరిస్థితులు కల్పించారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల పవిత్రతను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టింది. అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచింది. కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, పాలు సరఫరా చేస్తున్నది. అలాగే నడకదారిన వచ్చే భక్తుల సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. వారికి జారీ చేసే టికెట్ల సంఖ్యను భారీగా పెంచింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
Publish Date: Sep 6, 2024 10:25AM

తిరుమలేశుని సర్వదర్శనానికి ఆరు గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ తగ్గడంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం నిల్వలు పెరిగాయి. దీంతో ఆధార్ కార్డుపై పది లడ్డూలు జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శుక్రవారం (సెప్టెంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 5) శ్రీవారిని మొత్తం 61 వేల 142 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 525 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.
Publish Date: Sep 6, 2024 10:09AM