వినాయకుడి విగ్రహం ప్రాముఖ్యత ఏంటి? మనం ఏం నేర్చుకోవచ్చు?
posted on Sep 6, 2024 9:30AM
ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వినాయక చవితి అంటే తప్పనిసరిగా ఎలాంటి పేదలు అయినా సరే.. తమకున్న స్థోమతలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేసుకుని ఆ స్వామి ఆశీర్వాదం పొందుతారు. అయితే వినాయకుడు కేవలం దేవతగానే కాకుండా ఆయన రూపం చాలా విషయాలు చెప్పకనే చెబుతుంది. ఇంతకీ వినాయకుడి విగ్రహం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? తెలుసుకుంటే..
వినాయకుడికి పెద్ద తల ఉంటుంది. తల పెద్దగా ఉండటం అంటే పరిమాణం కాదు.. ఆలోచనలు మెరుగ్గా ఉండాలని అర్థం. మెరుగ్గా ఆలోచించే వారు వ్యక్తిత్వ పరంగా మెరుగ్గా ఉంటారు.
వినాయకుడి చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఈ పెద్ద చెవులు శ్రద్ధగా వినమని చెబుతాయి. ఏది చెప్పినా శ్రద్దగా వినేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.
వినాయకుడి కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ చిన్న కళ్ళు సూక్ష్మ విషయాలను కూడా చాలా పరిశీలనగా దృష్టి కేంద్రీకరించి చూడాలని చెబుతాయి.
వినాయకుడి శరీర పరిమాణానికి తగ్గట్టు చూస్తే నోరు చిన్నది. చిన్న నోరు తక్కువ మాట్లాడమవి చెబుతుంది. తక్కువ మాట్లాడేవారు ఎప్పుడూ ఉత్తములు.
వినాయకుడికి పెద్ద బొజ్జ ఉంటుంది. మంచి చెడులను జీర్ణించుకోవాలని ఈ పెద్ద బొజ్జ సూచిస్తుంది.
పొడవాటి తొండం.. ప్రతికూలతను కూడా అనుకూలతగా మార్చుకోవాలని చెబుతుంది. అదే మనిషి బలాన్ని పెంచుతుందని చెబుతుంది.
చేతులు.. ఆశీర్వదించడానికి రక్షించడానికి ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశ్యాన్ని వినాయకుడి ఆశీర్వాద భంగిమ సూచిస్తుంది.
వినాయకుని దంతాలలో ఒకటి విరిగిపోయి ఉంటుంది. విరిగిన దంతానికి ప్రతీక ఏమిటంటే తెలివైన వ్యక్తి ద్వంద్వత్వానికి అతీతంగా ఉంటాడు. అంటే ఒకే దంతము ఏక కోణాన్ని సూచిస్తుంది.
గణేశుడి నాలుగు భుజాలు నాలుగు గుణాలకు ప్రతీక - అవేంటంటే... మనస్సు, బుద్ధి, అహంకారం, మనస్సాక్షి. వినాయకుడు ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచి కూర్చుని ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాలు రెండింటిలోనూ పాల్గొనాలని సూచిస్తుంది.
*రూపశ్రీ.