నడకదారి భక్తుల కోసం టీటీడీ పది వేల టికెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తుల కోసం ఇక నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పది వేల టికెట్లు జారీ చేయనుంది. ఇప్పటి వరకూ కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రెండు నడక దారులు ఉన్నాయి. వాటిలో ఒకటి అలిపిరి కాగా రెండోది శ్రీవారి మెట్లు దారి.  ఈ రెండు మార్గాలలో వెళ్లే వారి కోసం టీటీడీ ఇప్పటి వరకూ మూడు వేల టికెట్లు జారీ చేస్తూ వస్తోంది.

ఇప్పుడు నడక దా4రి భక్తుల సౌకర్యార్థం ఆ సంఖ్యను పది వేలకు పెంచింది. వీటిలో శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వచ్చే భక్తుల కోసం నాలుగు వేల టికెట్లు, అలిపిరి మార్గం నుంచి నడిచి వచ్చే భక్తుల కోసం ఆరువేల టికెట్లు జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. టీటీడీ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తం అవుతోంది. 

గతంలో  వైసీపీ హయాంలో నడకదారి భక్తుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. వన్యప్రాణుల భయం అంటూ రోజుల తరబడి నడకదారులను మూసివేయడం, ఆ తరువాత కూడా భక్తులలో ధైర్యం నింపడానికి బదులు వారికి కర్రలు ఇచ్చి వన్యప్రాణులు వస్తే మీరే తరిమి కొట్టుకోండి అంటూ వన్యప్రాణులు నడక మార్గంలోకి రాకుండా మేం ఏం చేయలేమని చేతులు ఎత్తేయడం కారణంగా నడకదారిలో తిరుమలేశుని దర్శనానికి వెళ్లేందుకు భక్తులు భయపడే పరిస్థితులు కల్పించారు.

ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల పవిత్రతను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టింది. అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచింది. కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, పాలు సరఫరా చేస్తున్నది. అలాగే నడకదారిన వచ్చే భక్తుల సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. వారికి జారీ చేసే టికెట్ల సంఖ్యను భారీగా పెంచింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.